‘కాలంతో పాటు… పఠితులు కూడా..

Dec 24,2023 11:01 #book review, #Sneha

సమాజాన్ని, తన చుట్టూ వున్న పరిసరాలను పరిశీలించ కుండా, తన పరిశీలనకొచ్చిన అంశాలను స్పృశించకుండా ఏ కవీ మనలేడు. సమాజం నుంచి ఉద్భవించిన కవిత్వానికే జీవం వుంటుంది. అలాంటి కవిత్వమే ‘కాలంతో పాటు…’ కవితా సంపుటి. ఎస్‌ఎం సుభానీ రాసిన ఈ కవితలన్నీ దాదాపు ఏదోక పత్రికలో ప్రచురిత మైనవే. ‘కాలంతో పాటు…’ మారని పేదరికం గురించి, జీవితాల గురించి, రైతుల గురించి, నరకప్రాయమైన నగర జీవితం గురించి, కనుమరుగవుతున్న పచ్చదనం గురించి, మనిషికోసం తపించే మనిషి గురించి, దగ్ధమౌతున్న బాల్యం గురించిన కవిలోని అంతర్మథనం, ఆవేదన అంతా ఈ కవితల నిండా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహ ఉరవడి… ఒక సంవేదన రూపంగా అక్షరబద్ధం అయితే, ఆ సంవేదన కవితారూపం తీసుకుంటే… అదే ఈ కవితా సంపుటి. ఇది రచయితకు తొలి వచన కవితా సంపుటి అయినా… కవి భావగాఢత తన పరిశీలనా శక్తికి నిదర్శనం.

‘మతాల ముసుగులో/ మమతలను మసి చేస్తున్నారు’ అంటూ ఆవేదన, ‘కుల, మత, ప్రాంతీయ ఉగ్రవాదాల కతీతంగా/ శాంతి కపోతాల నెగురవేస్తా’ అంటూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ‘ఎవరురా… మీరు?’ కవితలో తన కోపం, బాధ, ఆవేదనను పలికిస్తాడు కవి. అమ్మ గురించి, అమ్మలోని మమకారం గురించి ఎన్ని గ్రంథాలు రాసినా ఇంకా రాయాల్సింది ఎంతో మిగిలే వుంటుంది. ‘అమ్మను అర్థం చేసుకోలేని/ కన్న కొడుకులకు/ కనువిప్పు కలిగేనాటికి/ కళ్ల ఎదుట అమ్మ ఏది?’ అంటాడు కవి ‘పేగు బంధం’ కవితలో. అమ్మను, అమ్మ ప్రేమను అర్థం చేసుకోలేని పిల్లలకు కనువిప్పు కలిగేనాటికి… అమ్మ కళ్లముందర వుండకపోవచ్చు. చిన్ననాటి అమ్మ ప్రేమను… ముదిమి వయసులో అమ్మపై పిల్లలు చూపించగలిగితే… ఈ కవి రాసిన ‘పేగు బంధం’ కవితకు న్యాయం జరిగినట్టే. అలాగే నేలమ్మ గురించీ ఓ కవిత రాశారు. ‘కడుపులు కొట్టి కూడబెట్టే/ కోట్ల సంపాదన నాకొద్దు/ పొలమంటే నాకు ప్రాణం/ ప్రాణం పోయినా అమ్మను/ ఆకలి తీర్చే ‘నేలమ్మ’ను…/ అమ్మను నేను’ అంటూ ‘నేలమ్మను’ కవితలో వ్యవసాయం, ఆకలి, అన్నదాత గురించి హృద్యంగా చెబుతారు. ‘మన్నించు తల్లీ’, ‘కడుపులో దాచుకోమ్మా’, ‘కడుపుతీపి చంపుకుని’, ‘అమ్మతనం’ వంటి కవితలన్నిటి నిండా అమ్మ ప్రేమను అమృతంలా ఒలికిస్తాడు కవి. ఈ పుస్తకానికి శీర్షిక అయిన ‘కాలంతో పాటు…’ ‘కాలం పరుగిడుతూనే వుంది/ కాలంతోపాటు/ నేను’ అంటూ పఠితులను కూడా తన కాలంతో పాటు తీసుకెళ తాడు కవి. వీటితో పాటు మనసుకు హత్తుకునే కవితలు ఇంకా చాలానే వున్నాయి. తరిగిపోతున్న మానవ సంబంధాలను ‘కలత కోయిల’ కవిత లోను, రైతు స్థితిని, కోల్పోతున్న అస్తిత్వానికి ఒక వాంగ్మూలం అంటూ ‘మరణం నా వాగ్మూలం’ కవితలోను ‘అక్షరాన్ని తక్కువగా/ అంచనా వేయకు/ విశ్వమంతా విస్తరించిన/ వజ్రాయుధం- అక్షరం’ అంటూ అక్షరం కవితలోనూ తనదైన శైలిలో, భావనతో అక్షరాల అంటుకట్టాడు కవి.

ఈ పుస్తకంలో మొత్తం 62 కవితలున్నాయి. హాయిగా చదువుకోదగ్గ కవిత్వం ఈ పుస్తకం నిండా వుంది. ‘కవిజన్మ ఎత్తడం చాలా చాలా కష్టం/ ఆ కష్టాన్ని ఇష్టపడినవాడు అవుతాడు కవి/ ఆ కష్టాన్ని ఇష్టపడిననాడు పుడుతుంది కవిత్వం’ అంటారు. ఆచార్య ఎన్‌.వి.కృష్ణారావు ఈ కవితా సంపుటికి రాసిన ముందు మాటలో. ఈ పుస్తకంలోని కవితలన్నీ చదివిన తర్వాత ఆచార్య కృష్ణారావుగారు చెప్పింది అక్షరసత్యమని కచ్చితంగా అనిపిస్తుంది. అంతేకాదు… సమకాలీన సమస్యలన్నీ ఈ పుస్తకంలో కవిత్వంగా రూపుదిద్దుకున్నాయి.

– రాజాబాబు కంచర్ల 

9490099231

➡️