ఆకట్టుకున్న వేముల చిత్రకళా ప్రదర్శన

Feb 11,2024 12:42 #Arts, #Sneha
An impressive art performance by Vemula

విజయవాడకు చెందిన సీనియర్‌ చిత్రకారుడు, చిత్రకళా తపస్వి, కీర్తి శేషులు వేముల కామేశ్వరరావు శత వసంతాల వేడుక సందర్భంగా ఫోరం ఫర్‌ ఆర్టిస్ట్స్‌, జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ భవన్లో చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటుచేశారు. కళను, కళా సంస్కృతిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో యంగ్‌ ఇండియన్స్‌ సంస్థ, ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ మిడ్‌ టౌన్‌, శిరీష క్లినిక్‌ల ప్రోత్సాహంతో జనవరి 28న వేముల కామేశ్వరరావు గీసిన చిత్రాలతో ఈ ప్రత్యేక చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఎంబి విజ్ఞాన కేంద్రంలో 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. సబ్‌ జూనియర్స్‌ (1,2,3 తరగతులు) విభాగంలో ‘పల్లె వాతావరణం’ అంశంపై, జూనియర్స్‌ (4,5,6 తరగతులు) విభాగంలో ”ప్రకృతి వైపరీత్యాలు” అంశంపై, సీనియర్స్‌ (7, 8, 9, 10 తరగతులు) విభాగంలో ‘సంక్రాంతి సంబరాలు’ అంశంపై, సూపర్‌ సీనియర్స్‌ (ఇంటర్‌, డిగ్రీ) విభాగంలో ”రోడ్డు సేఫ్టీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు” అంశంపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 40 విద్యా సంస్థల నుండి 600 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. చిత్రకళా ప్రదర్శనను యువజన సంక్షేమ శాఖ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ యు.శ్రీనివాసరావు ప్రారంభించారు. ప్రదర్శనలో ఉంచిన ఈ చిత్రాలు పలువురిని ఆకట్టుకున్నాయి. చివరిగా చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు అతిథులు ప్రసంశా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.

– పి.వెంకటేశ్వరరావు

 

➡️