భద్రం.. బీకేర్‌ఫుల్‌ శ్రామికా!

ప్రారిశామిక, ఉత్పత్తి రంగాలు ఏర్పడినప్పటి నుంచీ మనుషులంతా శ్రమ చేసుకుని బతకడం నేర్చుకున్నారు. కష్టపడి పనిచేసి, వచ్చిన ఆ కూలి డబ్బులతో కుటుంబాలను పోషిస్తున్నారు. కార్మికులు, కూలీలు అంతా బాగుంటేనే ఆయా రంగాలు అభివృద్ధి పథంలో నడుస్తాయి. అయితే పనిచేసే ప్రదేశంలో ఆ కార్మికులకు ప్రమాదం ఏమైనా ఉందా? లేదా? ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నారా? లేదా? అనేది యజమానుల బాధ్యతే కాదు.. ప్రభుత్వానిది కూడా. అందుకే ‘జాతీయ భద్రతా మండలి’ని ఏర్పాటు చేసింది. ఇది పని ప్రదేశాల్లో, రోడ్లపై జరిగే ప్రమాదాల పట్ల కార్మికులకు, సామాన్యులకు అవగాహన కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది మార్చి 4 నుంచి 10వ తేదీ వరకూ ‘జాతీయ భద్రతా వారోత్సవాలు’ జరుగుతున్నాయి. ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు వారి భద్రత, ఆరోగ్య రక్షణను తమ జీవితంలో భాగంగా నిర్వర్తించుకునేలా చేయడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

గత ఏడాది నవంబర్‌ నెల్లో ఉత్తర కాశీ సిల్క్యారా గ్రామంలో సొరంగం కూలిపోయి 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. సుమారు 17 రోజులపాటు చీకట్లో లోపలే ఉన్నారు. అధికారులు 400 గంటలు పైగా రాత్రనక, పగలనక కష్టపడి సహాయకచర్యలు చేపట్టారు. లోపల ఉన్న కార్మికులు ఎంతో ధైర్యంతో ఉన్నారు. ఏ ఒక్కరూ ‘ఇక బయటపడము’ అనుకోలేదు. ఏ ఒక్కరు ఆందోళన చెందినా లోపల ప్రమాదం జరిగి ఉండేది. కానీ అలా జరగలేదు. అందరూ ఒకరికొకరు అండగా ఉండి, ఓర్పుగా జీవితం మీద ఆశతో ‘బయటపడతాం’ అని ఎదురుచూశారు. ఆ సమయంలో వారికి బయటున్నవారు పైపుల ద్వారా ఆహారాన్ని, నీటిని పంపించారు. ఇటువంటి సెన్సిటివ్‌ జోన్‌లలో తవ్వకాలు జరుగుతున్నప్పుడు కార్మికులు మరింత అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు ఏమైనా ప్రమాదం జరిగినా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండటం చాలా అవసరమని ఈ ఘటన కార్మిక లోకానికి తెలియజేస్తుంది. ఇలాంటి ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి? అవి జరిగినపుడు ఎలా స్పందించాలనే అంశాలను షార్ట్‌ ఫిల్మ్స్‌ ద్వారా జాతీయ భద్రతామండలి ప్రదర్శించాలి. పని ప్రదేశాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరిగేలా చర్యలు చేపట్టాలి.

 

  • వాతావరణం కీలకం..

‘ఎన్విరాన్‌మెంటల్‌ సోషల్‌ అండ్‌ గవర్నెన్స్‌ కోసం సేఫ్టీ లీడర్‌షిప్‌పై దృష్టి పెట్టండి’ అనే థీమ్‌తో భద్రతా మండలి ఈ సంవత్సరం వారోత్సవాలు నిర్వహిస్తోంది. సంస్థల్లో నైతిక సమస్యలపై, వ్యాపార పద్ధతులు, పనితీరును అంచనా వేయాలని చెబుతోంది. ఇటువంటి విషయాల్లో కార్మికులకు, ఉద్యోగులకు అవగాహన కల్పించాలని కోరుతోంది. రోడ్లపై ప్రమాదాలు నివారించాలని సూచిస్తుంది. కానీ అలాంటివి జరుగుతున్నాయా అంటే? ‘లేదు.. చాలా తక్కువ..’ అనే చెప్పాలి. కార్మికుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వాలు, యాజమాన్యాలు ఇచ్చే ముడుపులు తీసుకుని చట్టాలను సవరిస్తూన్నారు. దాంతో కార్మికులకు ప్రమాదాలు జరిగినా పట్టించుకోవడంలేదు. సంస్థల్లో కార్మికులకు, ఉద్యోగులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని కల్పించడంలో యజమానులు, ప్రభుత్వాలు కీలకపాత్ర పోషించాలి. చాలా సంస్థలు పర్యావరణాన్ని విపరీతంగా నాశనం చేస్తూ, కాలుష్యాన్ని గాలిలోకి విడుదల చేస్తున్నాయి. ఇది పీల్చుకున్న జనం రకరకాల రోగాలతో బాధపడుతున్నారు. ఇలాంటివి నివాసాలకు దూరంగా ఉండాలి. కానీ ఆ నిబంధనలు పాటించడం లేదు.


ప్రభుత్వాలు.. యాజమాన్యాలు..
ఈ ఏడాది మార్చి 1న నెల్లూరులోని, ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో ఇండోనేషియాకు చెందిన బొగ్గునౌక ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు ట్యాంకులోకి దిగి ఇద్దరు కార్మికులు మరణించారు. ఈ ఇద్దరూ క్యాజువల్‌ కార్మికులు. దిగిన కొద్దిసేపటికే వారికి ఆక్సిజన్‌ అందక అపస్మారక స్థితికి చేరుకున్నారు. యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకొని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని కార్మిక కుటుంబాలు అంటున్నాయి. అనుభవం తక్కువ ఉన్న కార్మికుల చేత ఇటువంటి పనులు చేయించడం అన్యాయం. కుటుంబసభ్యులకు నష్టపరిహారం చెల్లించినా చనిపోయిన వారు తిరిగి రాలేరు కదా!. ప్రభుత్వాలు-యాజ మాన్యాలతో కలిసి కార్మికులను మోసం చేస్తోంది. కార్మిక రక్షణ, భద్రతా చట్టాలు సక్రమంగా అమలు చేసేలా చేస్తే ప్రమాదాలు తగ్గుతాయి.

సదుపాయాలు.. సహాయం..
దేశంలో అనేకచోట్ల సెప్టిక్‌ ట్యాంకుల్లోకి దిగి శుభ్రం చేస్తున్న కూలీలకు ఊపిరాడక చనిపోతున్న ఘటనలు ప్రతిరోజూ ఎక్కడోకచోట జరుగతూనే ఉన్నాయి. వీరికి సరైన భద్రత చర్యలు అమలుకావడం లేదు. పని చేసే క్రమంలో అవసరమైన రక్షణ పరికరకాలు అందడం లేదు. వీరు చేసే పనికి సరైన గుర్తింపు కూడా ఉండటం లేదు. బాధిత కుటుంబాలకు సహాయం అందడం లేదు. నిత్యం ఈ పనిచేసుకుని బతికేవారు ఏదో రకమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కొన్ని సర్వేలు వెల్లడించాయి.

 

ఈ రోజు ప్రత్యేకత…
ముంబైలో రాష్ట్ర కార్మిక శాఖామంత్రుల సమావేశం 1962లో జరిగింది. పని ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాల మీద చర్చ జరిగింది. ప్రమాదాల పట్ల కార్మికుల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం నుండి ఒక సంస్థ అవసరమని ఆ సభ నిర్ణయించింది. 1965, ఢిల్లీలో జరిగిన పారిశ్రామిక భద్రత తొలి సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఇతర సంస్థలు పాల్గొన్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో భద్రతామండలి ప్రారంభించాలని వారంతా నిర్ణయించారు. 1966, మార్చి 4న కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ భద్రతామండలి ఏర్పడింది. మండలి ప్రారంభమయిన మార్చి 4 నుంచి 10 వరకూ ప్రతి యేటా ‘జాతీయ భద్రతా వారోత్సవాలు’ నిర్వహిస్తున్నారు. నేషనల్‌ సేఫ్టీ కౌన్సిల్‌ (ఎన్‌ఎస్‌సి) ప్రతి సంవత్సరమూ ఒక థీమ్‌తో ఈ వారోత్సవాలు నిర్వహించే బాధ్యతను తీసుకుంటుంది.


వైద్య పరీక్షలు తప్పనిసరి..
అధిక వేడి గల ఇంజన్లు, విద్యుత్‌, విషవాయువుల దగ్గర పనిచేసే కార్మికులు, ఉద్యోగులు కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అధిక వేడి వద్ద ఎక్కువ సమయం ఉండటం వల్ల హీట్‌ స్ట్రోక్‌(వేడి సెగ) వంటి వేడి సంబంధిత ప్రమాదాలు కార్మికులకు పొంచి ఉంటాయి. త్వరగా అలసట, మైకం, వికారం, తలనొప్పి వంటి లక్షణాలు వెన్నంటే ఉంటాయి. గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది. మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే యజమాన్యాలు కార్మికులకు ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు చేయించి, కార్మికులు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. పోషకాహారం తీసుకునేలా వైద్యుల చేత సూచనలు చేయాలి. ఆయా యాజమాన్యాలు అటువంటి ఆహారం కూడా కార్మికులకు అందించాలి. రసాయనాల తయారీల్లోనూ, విద్యుత్‌ యంత్రాల వద్ద పనిచేసే కార్మికులు నిత్యం అప్రమత్తంగా పనిచేస్తూ ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. యంత్రాల్లో చేతులు, కాళ్లు పడి అవయవాలు పోగొట్టుకున్న కార్మికుల కుటుంబాలూ ఉన్నాయి. అలాంటివారికి యాజమాన్యం, ప్రభుత్వం అండగా నిలబడాలి. కానీ అలా జరగడం లేదు. మొక్కుబడిగా నష్టపరిహారం చెల్లించి, చేతులు దులుపుకుంటున్న పరిస్థితి.


ప్రమాదకారి శివకాశి..
నూతన సంవత్సరం రోజునే తమిళనాడులో శివకాశి బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి భవనం నేలమట్టమైంది. బాణాసంచా తయారుచేస్తున్న నలుగురు సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. టపాసుల తయారీ ఫ్యాక్టరీలోప్రమాదాలు జరిగి, కూలీలు చనిపోయారని చదువుతున్నప్పడల్లా శరీరం గగుర్పాటుకు లోనవుతుంది. బాణసంచా తయారీలో ప్రసిద్ధి చెందిన శివకాశిలోనే తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా ప్రమాదాల నివారణకు ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకోవడం లేదు. పనికిగానీ, ఆ పనిచేసే కార్మికులకుగానీ భద్రత ఇవ్వలేని యాజమాన్యాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం లేదు. ఇటువంటి ప్రాణపాయ ప్రదేశాల్లో పనిచేసేందుకు కూలీలు వచ్చినా పని జరిగిందా? లాభాలు వచ్చాయా? అని చూసుకోవడమే తప్పా, కార్మికుల గురించి పట్టించుకుంటున్న ఫ్యాక్టరీల యాజమాన్యాలు లేవు. కార్మికులు బాగుంటే ఆయా పనిచేసే సంస్థలు, రంగాలు బాగుంటాయి. దేశం ఆర్థికంగా అభివృద్ధి దిశగా నడుస్తుంది. అందుకే వారి భద్రత దేశ భద్రతగా భావిద్దాం.

– పద్మావతి

➡️