పిల్లలతో సంభాషించండి..!

Jun 30,2024 10:34 #Parenting, #Sneha

వేగవంతమైన జీవనంతో.. ఉరుకు పరుగులతో ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు పిల్లల కోసం సమయం కేటాయిస్తున్నారా? అని అడిగితే .. లేదనేది ఎక్కువమంది నుంచి వచ్చే సమాధానం అంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ పిల్లలతో తల్లిదండ్రులు సంభాషించాల్సిన అవసరం ఉందంటున్నారు. కనీసం రాత్రి నిద్రపోయేటప్పుడు అయినా వారితో కాసేపు మాట్లాడితే మంచిదని చెప్తున్నారు. దీని గురించి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.. అవేంటో తెలుసుకుందాం..
సహజంగా తల్లితండ్రులు పిల్లలతో మాట్లాడటం మొదలుపెట్టాలేగానీ.. పిల్లలు బోలెడన్ని ఊసులు చెబుతారు.. మనలోని స్ట్రెస్‌ కూడా బర్న్‌ అయిపోతుంది వారి మాటలతో.. అలాగే పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారో తల్లిదండ్రులకూ అర్థమవుతుంది. పిల్లలు వాళ్ల మాటలకు ఊహాలను తొడిగి భలే చెప్తుంటారు. వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది..

రోజువారీ విషయాలు..
ప్రతిరోజూ తల్లిదండ్రులకు, పిల్లలకు వీలయ్యే సమయం రాత్రి పడుకునేటప్పుడే.. ఆ సమయంలో పిల్లల్ని ఆ రోజు ఏం జరిగిందో అడగాలని చెప్తున్నారు నిపుణులు. దాంతో పిల్లలు ఆ రోజు జరిగిన విషయాలను జ్ఞాపకం చేసుకోవడం.. ఆయా సందర్భాల్లో జరిగిన విశేషాలను, గమ్మత్తులను తల్లిదండ్రులతో పంచుకుంటారు. అలా వారిని అడుగుతూ ఉంటే.. వారి బుజ్జి బుర్రలో ఎన్ని విషయాలు ఉన్నాయో తల్లిదండ్రులకూ అర్థమవుతుంది అంటున్నారు నిపుణులు.

ఇబ్బందులనూ..
కేవలం సరదాగా జరిగే విషయాలే కాకుండా.. వారు ఏవిధంగా అయినా బాధ పడినా చెప్పమని కోరండి అంటున్నారు నిపుణులు. ఇలా అడగడం వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తల్లిదండ్రులతో పంచుకునేలా అలవాటవుతుందని చెప్తున్నారు. స్నేహితుల వల్ల కలిగిన ఇబ్బంది అయినా, స్కూల్లో టీచర్ల వల్ల , మరే ఇతర సిబ్బంది వల్ల అయినా, పెద్ద తరగతి పిల్లల వల్ల కలిగినా ఏదైనా చెప్పమని కోరండి. స్కూల్‌ నుంచి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు ఎవరి వల్ల ఇబ్బందులు కలిగినా తల్లిదండ్రులే అడిగి మరీ చెప్పమనండి. అప్పుడు అమ్మానాన్న తమకు భరోసా ఇస్తున్నారని పిల్లలు మరింత ధైర్యంగా ఉండడానికి వీలవుతుంది. అలాగే ఆ ఇబ్బందులను ఎలా అధిగమించాలో కూడా పిల్లలకు తల్లిదండ్రులు నేర్పాల్సిన అవసరం ఉందని నిపుణులు ప్రత్యేకంగా చెప్తున్నారు. ఒకవేళ అది తల్లిదండ్రులకూ సాధ్యంకాకపోతే నిపుణుల సలహాలు సైతం తీసుకోవాలని చెప్తున్నారు.

సరికొత్తగా చేసినా..
పిల్లలు పిల్లల్లా ఉండరు. వారి చిట్టి బుర్రల్లో బోలెడన్నీ ఆవిష్కరణలు ఉంటాయి. పెద్దలకు సైతం తట్టని ఆలోచనలు వాళ్లు చేస్తుంటారు. ఒక్కోసారి ఇంట్లో ఏదైనా పనిచేయకపోతే వాళ్లు చిటికెలో ఆ సమస్యను పరిష్కరించేస్తారు. అందుకే ఆ రోజు వాళ్లు నేర్చుకున్న కొత్త కొత్త విషయాలను కూడా తల్లిదండ్రులతో పంచుకునేలా ఉండాలంటున్నారు నిపుణులు. దీనివల్ల పిల్లల ఆలోచనా సరళితో పాటు, వారిలోని ప్రగతి పేరెంట్స్‌కు అవగాహనలోకి వస్తుందని చెప్తున్నారు. అప్పుడే వారికి అందుకనుగుణమైన అదనపు తర్ఫీదుగానీ, పుస్తకాలు, సంబంధిత నాలెడ్జ్‌ వారికి అందే ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. తద్వారా పిల్లలు మరింత నైపుణ్యవంతంగా తయారవుతారని అంటున్నారు.

సవాళ్ల ఎదురైనా..
పిల్లలు ఏదైనా సవాళ్లను ఎదుర్కొన్నారా అనేది తల్లిదండ్రులు అడగాలని చెప్తున్నారు నిపుణులు. అలాంటి సవాళ్లను పేరెంట్స్‌ ప్రత్యేకంగా అడగడం వల్ల పిల్లలకు వాటినీ పంచుకోవచ్చని అవగతమవుతుంది. ఎలాంటి సవాళ్లను అయినా అధిగమించడానికి పేరెంట్స్‌ తోడ్పాటును ఇస్తారనే భరోసా కలుగుతుంది. అలాగే సవాళ్లు రావడం అనేది ఎంత సహజమో పిల్లలకు తెలియజేయడానికి పేరెంట్స్‌కు ఇదొక అవకాశం.. ఇలా చేయడం వల్ల జీవిత గమనంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి పునాది పడినట్లే

స్నేహితుల గురించి..
పిల్లలు తమ స్నేహితుల గురించీ తల్లిదండ్రుల దగ్గర పంచుకునేలా వారిని అడగాలని అంటున్నారు నిపుణులు. దానివల్ల పిల్లలు ఎలాంటివారితో స్నేహాలు చేస్తున్నారో.. వారి ఆలోచనా విధానంపై వాటి ప్రభావాలు ఏమిటో తల్లిదండ్రులకు అవగాహన కలుగుతుందని చెప్తున్నారు. స్నేహితులతో ఎలా వ్యవహరిస్తున్నారో కూడా వారితో మాట్లాడుతున్నప్పుడే అర్థమవుతుంది. ఆయా సందర్భాల్లో పేరెంట్స్‌ వారికున్న స్నేహితుల గురించీ పిల్లలతో పంచుకోవాలి అంటున్నారు నిపుణులు. దానివల్ల పిల్లలకు స్నేహం విలువ, వారితో ఎలా వ్యవహరించాలో అర్థమవుతుంది.

పుస్తకాలపైనా..
పిల్లలతో ఎన్ని మాట్లాడినా.. తరగతి పుస్తకాలే కాకుండా కథల పుస్తకాలో, ప్రముఖుల గురించి క్లుప్తంగా రాసిన పుస్తకాలో, వారి వారి ఆసక్తులకు సంబంధించిన పుస్తకాలో చదివాక.. తల్లిదండ్రులు వాటిపై పిల్లలతో సంభాషించాలి. దానివల్ల ఆ పుస్తకాల్లోని విషయాలు వాళ్లు ఎంతవరకు ఆకళింపు చేసుకున్నారో అర్థమవుతుంది. అలాగే అది వారి విద్యకు ఎంతలా తోడ్పడుతుందో కూడా తెలుస్తుందని నిపుణులు చెప్తున్నారు.
ఇవేకాకుండా పిల్లలకు సమయం గురించి, దాని విలువ గురించీ చెప్పాలి. కాలం విలువ తెలియజేయడం వల్ల వారికి ఎలా ఉండాలో అర్థమవుతుంది. అలాగే సహాయం చేసే సుగుణం, ఎదుటివారికి ఏదైనా కష్టం వస్తే ఆదుకునే విషయాలు పిల్లలకు కథలుగానో, సంభాషణల్లోనో తల్లిదండ్రులు చెప్తుండాలని నిపుణులు అంటున్నారు.

➡️