అయ్యా సారూ…!!

Dec 14,2023 08:12 #Drought, #Poetry
drought poet

కరువు కాని కరువు కాటేస్తాంటే
అరువు బరువు మోయలేక
కర్షక లోకం కుంగిపోతాంది
పొయ్యి పైన ఎసరు లేని గిన్నె
బిక్కు బిక్కున చూస్తాంటే
దిక్కు తెలియని స్థితిలో
కాలే కడుపు పకపకా నవ్వుతాండాది
అయ్యా సారూ కాస్త చూడరాదు.
వాగు వచ్చి సెలకల్ని తన్నుకెళ్తాంటే
నడుము విరిగిన కంకిగట్టుకు కొట్టుకొచ్చి ఏడుస్తుండాది
చిరిగిన అంగీలకు
మరమ్మతులు చేసుకోలేక
సగటు బతుకు కుమిలిపోతాండాది.
లెక్క కుదిరాక ఎక్కాల్ని మరచినట్టు
సీటు దొరికినాక
స్థిరత్వాన్ని మరిస్తే ఎట్లా సారూ
గువ్వలు వలసెళ్ళిగూడు చెదిరిపోతాంటే
ఊరు ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుండాది
పూట గడవని బతుకులు
మూల మూలలో ఒదిగిపోతాంటే
వీధి అంగలార్చుతుండాది అయ్యా సారూ
కాయింత సూడండ్రీ.
తడి లేని పేగు తల్లడిల్లుతాంటే
బక్క ప్రాణం కంట్లో తడి పెట్టుకున్నాది
ఉన్నోళ్లకే ఊపిరి అందిస్తాంటే
ఆయాసపడే బడుగు జీవనం
మౌనంగా మూలన కూర్చుండాది
అయ్యా సారూ
ఎరగని బతుకులు ఎంగిలి పడలే
కాస్త కనిపెట్టి కనికరించండ్రి.

– నరెద్దుల రాజారెడ్డిసెల్‌ : 9666016636

➡️