పద్దెనిమిదేళ్ల తర్వాత..

Jun 30,2024 10:42 #celebrity, #Sneha

అలనాటి హీరోయిన్స్‌ చాలా మంది ఇప్పుడు ఇండిస్టీలో లేరు. పెళ్లి చేసుకుని కొందరు.. పిల్లలు, కుటుంబసభ్యులతో గడపాలని మరికొందరు నటనకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆ తారలు రీ ఎంట్రీ ఇచ్చి, వెండితెరపై తమ సెంకడ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఆ వరుసలో అభినయ తార శోభన చేరారు. ఒకప్పుడు తన నటనతో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించి, మెప్పించారు. మళ్లీ రెండు దశాబ్దాలకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమాతో ప్రేక్షకులకు, అభిమానులకు వినోదాన్ని అందించారు. చాలాకాలం తర్వాత తెలుగు ఆడియన్స్‌ని పలకరించబోతున్న నేపథ్యంలో శోభన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఆనందం, చంద్రకుమార్‌ పిళ్లై దంపతుల కుమార్తె శోభన. నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిలకు మేనకోడలు. నటుడు వినీత్‌ దూరపు బంధువు కూడా. కళాకారులను చూస్తూ పెరిగిన శోభన బాల్యం నుంచి నృత్యం పట్ల ఆసక్తి కనబరిచారు. దాంతో ఆమె చెన్నైలోని చిదంబరం నాట్య అకాడమీలో నృత్యంలో శిక్షణ పొందారు. ఆమె గురువు పేరు చిత్రా విశ్వేశ్వరన్‌. శిక్షణ తీసుకుంటూనే ప్రదర్శనలు ఇచ్చేవారు. భరత నాట్యంలో ఎంతో ముఖ్యమైన అభినయాన్ని ప్రదర్శించడంలో ఆమె దిట్ట. ఈమె నృత్యాన్ని చూసి, సినిమాల్లో నటించేందుకు చాలా అవకాశాలొచ్చాయి.

విజయవంతంగా..
ఎవరికైనా జయాపజయాలు సహజం. కానీ ఆమె నటించిన చాలా సినిమాలు విజయం అందుకున్నవే. శోభన బాలీవుడ్‌ చిత్రం ‘అమర్‌ ప్రేమ్‌’ లో బాలనటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆమె మొదటి ప్రధానపాత్ర మలయాళ చిత్రం ‘ఏప్రిల్‌ 18’ (1984). ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం సాధించింది. ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ‘కనమరాయతు, టిపి.బాలగోపాలన్‌ ఎం.ఎ., చిలంబు, నాడోడిక్కట్టు, కలికాలం, మాయ మయూరం’ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించారు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘మణిచిత్రతాఝు’ లో శోభన అద్భుతమైన నటనను ప్రదర్శించారు. దీనికి ఆమె మొదటి జాతీయ అవార్డును అందుకున్నారు.
తెలుగులో హీరో నాగార్జునతో ‘విక్రమ్‌’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు శోభన. చిరంజీవితో ‘రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి’ వంటి సినిమాల్లో నటించారు. నటులు వెంకటేష్‌తో, మోహన్‌బాబుతో ‘అల్లుడుగారు, రౌడీగారు’, ఇటీవల ‘గేమ్‌’ నటించి, మంచిపేరు సంపాదించారు. తెలుగుతోపాటు మలయాళ, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో సుమారు 230కి పైగా చిత్రాల్లో నటించి, ఎంతో మంది అభిమానుల ప్రేమను పొందారు.

డ్యాన్స్‌ స్కూలుతో..
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా తనకు ఇంత గుర్తింపు ఇచ్చిన భరతనాట్యాన్ని మాత్రం ఆమె ఎన్నడూ విడవలేదు. అందులో ప్రావీణ్యం, నైపుణ్యం సంపాదించిన నర్తకి శోభన 1994లో చెన్నైలో ‘కళార్పణ’ అనే నృత్య పాఠశాలను స్థాపించారు. శాస్త్రీయ కళల ప్రచారానికి తనను తాను అంకితం చేయాలనే లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి ఎందరికో భరతనాట్యంలో శిక్షణ ఇస్తున్నారు. దేశవిదేశాల్లో నృత్య వార్షికోత్సవాలు నిర్వహించారు. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఆమె దగ్గర నటనలోను, నాట్యంలోను శిక్షణ తీసుకున్నవారే. వారి ప్రదర్శనలు అన్నీ ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో శోభన షేర్‌ చేస్తూంటారు.
అయితే జీవితంలో తన ఒంటరితనాన్ని మర్చిపోయేందుకు ఒక చిన్నపాపను దత్తత తీసుకొని, ఆమె ఆలనాపాలనా చూసుకుంటున్నారు. కూతురుతో కలిసి నృత్యప్రదర్శన కూడా చేశారు. ఇక మూవీస్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసి, దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ”వారనే ఆవశ్యముంద్‌” అనే సినిమాలో మెరిశారు. నృత్య ప్రదర్శనలో ఆమె ప్రతిభకు అనేక అవార్డులు, ప్రశంసల మధ్య, 2006లో భారత ప్రభుత్వం ఆమెను ‘పద్మశ్రీ’తో సత్కరించింది.


అందరూ స్టార్‌ హీరోలతో 40 సినిమాలకు పైగా నటించిన శోభన 1997 తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈమె దాదాపు 18 సంవత్సరాల తర్వాత ‘కల్కీ 2898 Aణ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం 54ఏళ్ల వయసు ఉన్న శోభన ప్రతిరోజూ నృత్యాన్ని సాధన చేస్తున్నారు. ఈ విధంగా తన బహుముఖ ప్రదర్శనలతో తెలుగు చిత్ర పరిశ్రమలో, ప్రేక్షకుల గుండెల్లో ఆమె చెరగని ముద్ర వేసుకున్నారు.

పూర్తి పేరు : శోభనా చంద్రకుమార్‌ పిళ్లై
పుట్టిన తేది : 1970, మార్చి 21
నివాసం : చెన్నై
వృత్తి : నటి, నర్తకి, కొరియోగ్రాఫర్‌
కూతురు : నారాయణి
అవార్డులు : పద్మశ్రీ పురస్కారం (2006),
కళైమామణి (2011)

➡️