ప్రభావితమవుతున్న మెదళ్లు..!

Nov 26,2023 07:46 #Science, #Sneha
enviornment-impact-on-mind-sneha-story

ఊళ్ళను ముంచే వరదలు.. భగ్గున మండే ఎండలు.. కరిగి నీరవుతున్న మంచు పర్వతాలు.. పీల్చే గాలి, తాగే నీరు, కాలుష్యం.. కాలుష్యం.. ఎక్కడ చూసినా, ఏది విన్నా ఇదే పర్యావరణాన్ని పీల్చి పిప్పి చేస్తోంది. రెండు మూడు దశాబ్దాల నుంచి పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, స్వచ్చంద సంస్థలు హెచ్చరిస్తూనే ఉన్నా.. అది అంతకంతకూ పెరుగుతోందే గానీ తగ్గుముఖం పట్టే ఛాయలు కనబడటం లేదు. చివరికి జీవరాశుల మనుగడ కష్టతరమైన పరిస్థితి. మరికొన్ని ఉనికిని కోల్పోయిన దుస్థితి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వర్షపాతం, కాలానుగుణంగా ఏర్పడుతున్న వేగవంతమైన మార్పులు, సముద్రపు ఆమ్లీకరణ అనేక జీవ జాతుల మెదళ్ళపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పరిశోధనలు చెప్తున్నాయి.

ఏ ప్రాణి ఏం చేసినా ఆలోచనతోనే. ఆ ఆలోచనకు నాంది మెదడు కణాలు. అంటే నాడీవ్యవస్థలో న్యూరాన్లు, న్యూరాన్‌ నిర్మాణం, జన్యువులు ముఖ్యం. ఇప్పుడు వాటికే ముప్పు వాటిల్లుతోంది. ఆలోచనకు అనుగుణంగా ప్రవర్తన ఉంటుంది. మెదడు భాగాలపై చూపుతున్న పర్యావరణ ప్రభావం రానురాను జీవుల ప్రవర్తనలో హానికరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.సముద్రపు నీరంతా ఆమ్లీకరణ చెందటంతో జలచరాలకు అనేక రకాల విపత్తులు ఎదురవుతున్నాయి. కార్బన్‌ డై ఆక్సైడ్‌ శాతం పెరగడంతోనే ఈ పరిస్థితి. ఇది కొన్ని సముద్ర జంతువుల సాధారణ పనితీరుపై స్పష్టమవుతోంది. ఆహారం కోసం ఉపయోగించే ఇంద్రియ సామర్థ్యం కుంటుపడుతోంది. న్యూరోట్రాన్స్మిటర్ల ద్వారా మెదడు కణాలు కుంచించుకుపోతున్నాయి. అసాధారణ న్యూరాన్లు ఏర్పడుతున్నాయి. ఒకదానితో ఒకటి మాట్లాడుకునే విధానంలో దీని ప్రభావం ఉంది.నాడీవ్యవస్థలో ఇంద్రియ గుర్తింపు, మానసిక పరివర్తన కీలకం. జంతువులు వాటి మనుగడ, పునరుత్పత్తికి వీలు కల్పించే మార్గాల్లో.. వాటి పరిసరాలను గుర్తించడానికి ఉపకరిస్తాయి. ప్రస్తుతం జీవుల్లో ఆ శక్తి తరిగిపోతుంది.మోనార్క్‌ సీతాకోకచిలుకలు (డానస్‌ ప్లెక్స్‌క్సిపస్‌) శీతాకాలంలో తూర్పు, ఉత్తర అమెరికాల నుండి మెక్సికోకు వలసపోతాయి. వసంతకాలంలో తిరిగి వస్తాయి. ఇవి ప్రయాణించడానికి సూర్య కాంతిని దిక్సూచిగా పరిగణిస్తాయి. అధిక చలి, వేడిగా కాలాలు మారేటప్పుడు.. అవి దిశను మార్చుకోవడానికి వాతావరణం అనుకూలించకపోతే, తిరుగు ప్రయాణంలో తప్పుదారి పడుతున్నాయి.

మానవ మెదడుకూ మినహాయింపు లేదు..

వాతావరణ మార్పు, దాని ప్రభావం మనిషికి ప్రత్యక్ష అనుభవమే. ఈ వాతావరణ మార్పుల వల్ల మన మెదళ్ళూ కృశించిపోతున్నాయి. విచిత్రమేమంటే ఇంత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ మనం చేసే తప్పిదాలను అభివృద్ధిగా భావిస్తున్నామే గానీ, మార్చుకోవడానికి ప్రయత్నాలు జరగటం లేదు.యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వాతావరణ మార్పులను ప్రపంచ సవాలుగా పరిగణించింది. ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలతో భాగస్వామ్యతను ఏర్పరచింది. అధికారులు స్థానిక ప్రాంతాల్లో గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు, జీవవైవిధ్యాన్ని పెంచేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఎవరో ఏదో చేస్తారని కాకుండా ప్రతి వ్యక్తీ, ప్రతి ప్రభుత్వం ఈ బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకోవాలి. అందరం కలిసి తమ వంతు పాత్రను పోషిస్తే.. అనేక చిన్న మార్పులు పెద్ద సహకారంగా మారుతుంది. ఐక్య కార్యాచరణతో సాంకేతికతను ఉపయోగించి కౌన్సిల్స్‌, స్థానిక సంఘాలు బాధ్యత చేపట్టాల్సిన అవసరం ఉంది. వ్యాపారం, విద్య, ఆరోగ్యం తదితర సంస్థాగత స్థాయి నుంచి ఈ కార్యాచరణను ప్రారంభించినప్పుడు ఫలితం ఉంటుంది. చెత్త సంచులను పంపిణీ చేయడం, వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్‌ చేయటంలాంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు తప్పనిసరి చేయాలి. ముఖ్యంగా పెనుభూతంగా మారుతున్న ప్లాస్టిక్‌ వస్తువుల తయారీని నిలిపివేసి, ప్రత్యామ్నాయం పెంపొందించాలి. అప్పుడే పరిష్కారం వేళ్లూనుకుంటుంది.

➡️