కళ్ళు తెరిపించిన కోమలి…!

Apr 7,2024 08:34 #Sneha, #Stories

మహేంద్ర గిరి అడవులలో మధురం అనే కోకిల ఉండేది. శ్రావ్యమైన గొంతుతో చక్కగా పాడేది. మృగరాజు కేసరికి మధురం పాటలంటే చాలా ఇష్టం. అందుకే ఏ వేడుక జరిగినా తప్పనిసరిగా మధురం యొక్క గాత్ర కచేరి ఉండేది. మధురముకు చక్కని బహుమతులు కూడా మృగరాజు ఇచ్చేది. మృగరాజుకు తన గాత్రం అంటే ఇష్టం అవడం వలన మధురంకి కాస్త గర్వం తలకెక్కింది. అడవిలో ఇతర జంతువులు తమ వేడుకలలో పాడమని మధురమును ఆహ్వానించినా రానని తిరస్కరించేది. జంతువులు బాధపడేవి. ‘నా పాట కోసం మృగరాజు చెవుల కోసుకుంటారని’ ఇతర జంతువులతో గర్వంగా చెప్పేది.
పక్క అడవి నుండి కోమలి అనే కోకిల మహేంద్రగిరి అడవికి వచ్చింది. మధురమును కలిసి ‘మీరు చాలా అద్భుతంగా పాడతారని మా అడవిలో చెప్పగా విన్నాను. మీ దగ్గర శిష్యురాలుగా చేరి పాట పాడటంలో మెలుకవలు తెలుసుకోవాలని వచ్చాను. నన్ను శిష్యురాలుగా చేర్చుకోండి’ అని కోమలి అడిగింది. అప్పుడు మధురం ‘నాకు అంత సమయం లేదు. నేనేమీ చెప్పను. నువ్వు ఇంకా ఎవరి దగ్గరికైనా వెళ్లి నేర్చుకో’ అని కోమలి అభ్యర్థనను తిరస్కరించింది. కోమలికి ఏమి చేయాలో తెలియక ఆలోచనలో పడింది. కానీ తిరిగి తన అడవికి మాత్రం వెళ్ళలేదు. మహేంద్రగిరి అడవిలోనే మిగిలిన పక్షులతో జంతువులతో స్నేహం చేస్తూ గడప సాగింది.
కొన్ని నెలలు అలా గడిచాయి. అడవిలోని జంతువులు నిర్వహించే వివిధ వేడుకలలో కోమలి పాటలు పాడటం చేసేది. చాలా మధురంగా పాడేది. అవన్నీ చాలా ఆనందపడేవి. తమకు తోచిన కానుకలు కోమలికి ఇచ్చేవి. మధురం కూడా కోమలి పాటలు విన్నది. చాలా వినసొంపుగా అనిపించాయి. కోమలి చాలా బాగా పాడుతుండడంతో మధురంకి అడవిలోని జంతువులు తమ వేడుకల్లో పాడమని కూడా అడగడం మానేశాయి. దాంతో కోమలిపై మధురముకు అసూయ కలిగింది.
కోమలిని మధురం కలిసి ‘నువ్వు ఇక ఈ అడవిలో ఉండడానికి వీలు లేదు. వెంటనే మీ అడవికి వెళ్ళిపో. లేకపోతే మృగరాజుతో చెప్పి శిక్ష విధింపజేస్తాను. జాగ్రత్త… ఈ అడవిని వెంటనే విడిచి వెళ్ళిపో’ అని హెచ్చరించింది. అయినా కోమలి మధురంకు ఎటువంటి జవాబును ఇవ్వలేదు. అడవిలోని జంతువుల ద్వారా కోమలి గురించి మృగరాజు కేసరికి తెలిసింది. మృగరాజు కాకితో కోమలికి తన దగ్గరకు రమ్మని కబురు పంపించారు. మధురంకి కూడా రమ్మని కబురు పెట్టారు. కోమలికి కూడా కబురు పెట్టారని తెలిసిన మధురం దానికన్నా ముందే మృగరాజు దగ్గరికి వచ్చింది.
మృగరాజు కేసరితో ‘మన పక్క అడవి నుంచి కోమలి వచ్చి ఇక్కడ మన జంతువుల పక్షులతో స్నేహం చేస్తూ మన అడవి రహస్యాలు తమ మృగరాజుకు చేరవేస్తున్నట్టు నాకు తెలిసింది’ అని కోమలిపై ఫిర్యాదు చేసింది. మృగరాజు ఏమి అనలేదు. ఇంతలో కోమలి దగ్గరికి వచ్చింది. అడవిలోని జంతువులు , పక్షులు కూడా అక్కడకు చేరాయి. మృగరాజు కోమలితో ‘నీ గాత్రం మృదు మధురంగా ఉంటుందని జంతువులు చెబుతున్నాయి. ఒకసారి నీ పాటను వినిపించు’అని అడిగింది.
కోమలి వెంటనే వీనుల విందుగా మృగరాజు, అచ్చట ఉన్న జంతువులు పక్షులు పరవశించేటట్లుగా చక్కని పాట పాడింది. కోమలి పాట ముగిసిన తర్వాత అక్కడ ఉన్న జంతువులు పక్షులు కరతాల ధ్వనులు చేశాయి. మృగరాజు కోమలిని ప్రశంసపూర్వకంగా చూస్తూ ‘ఇంత చక్కని గాత్రం తో అందరినీ పరవశింప చేసావు. ఇంతకీ మీ గురువుగారు ఎవరు?’ అని అడిగింది. కోమలి ‘మృగరాజా! మా గురువుగారు వేరెవరో కాదు మీ సమక్షంలో నిరంతరం పాడుతూ మిమ్మల్ని ఆనందంపజేస్తున్న మధురం’అని చెప్పింది. కోమలి సమాధానం విన్న మధురం సిగ్గుతో తలదించుకుంది.
మృగరాజు మధురమును చూసి ‘అసూయ పనికిరాదు. నీకన్నా చక్కగా పాడుతున్న కోమలిపై లేనిపోని మాటలు చెప్పావు. అది సరికాదు. గురువుగా శిష్యుని ఉన్నతిని కాంక్షించాలి’అని మందలించింది. కోమలికి చక్కని కానుకలు అందించింది. అలాగే మధురంకి కూడా కానుకలు ఇచ్చింది. సమావేశం ముగిసిన తర్వాత కోమలి దగ్గరకు మధురం వెళ్లి ‘నా దగ్గరకు వచ్చి, మెలుకవలు నేర్పమని అడిగినప్పుడు నేను తిరస్కరించాను కదా!. మరి నన్ను గురువుగా ఎందుకు చెప్పావు’అని అడిగింది.
‘మీరు… మృగరాజు సమక్షంలో పాడుతున్నప్పుడు నేను గృహ బయట ఉన్న చెట్టుపై కూర్చుని మీ పాటలోని మెలుకవలు అన్ని నేర్చుకున్నాను. వాటిని సాధన చేశాను. జంతువులు పక్షులు తమ వేడుకల్లో పిలిచినప్పుడు ఆ సాధనతోనే పాటలు పాడాను. అందుకే మీరే నాకు గురువు’ అని వినమ్రముగా చెప్పింది. మధురం సిగ్గుతో తలదించుకుని ‘నన్ను క్షమించు… మృగరాజు గారు నా గాత్రమును మెచ్చుకుంటున్నారని గర్వంతో జంతువులు పక్షులను చిన్నచూపు చూశాను. నువ్వు నేర్పమని అడిగినా కాదన్నాను. నేనే గొప్ప అనుకోవడం చాలా తప్పు అని ఇప్పుడు తెలుసుకున్నాను. నా కళ్ళు తెరిపించావు. ఇకపై గర్వం, అసూయ వదిలి అందరితో స్నేహంగా మెలుగుతాను. నాకు తెలిసిన విద్యను పదిమందికి పంచుతాను’అని అంది. మధురం మాటలు విన్న మిగిలిన జంతువులు, పక్షులు ఆనందంతో చప్పట్లు కొట్టాయి.

➡️