అర్థ రూపాయి

Apr 28,2024 08:55 #katha, #Sneha

చందు బడిలోని మూడో తరగతి గది నుండి పారిపోయిన తర్వాత.. ఊపిరి పీల్చుకున్నది ముంబై చేరినాకే. ఇప్పుడతను ఒక మంత్రి బంగళాలో పనిచేస్తున్నాడన్నది వేరే విషయం. కానీ ఆనాటి సంఘటన ఇప్పటికీ అతనికి కళ్లకు కట్టినట్టు ఉంటుంది. మూడు రాత్రులు, మూడు పగళ్లు కంటి మీద కునుకు లేకుండా గడిపాడు. చివరికి బైకుల్లా ఫుట్‌పాత్‌ మీద సమందుల ద్వారా స్పృహ లేకుండా పడుకుంటే, అర్ధరాత్రి పూట హవిల్దార్‌ వచ్చి ‘అయితే, నువ్వు ఏ యుపి నుండి వచ్చావు?’ అని అడగడానికి కొట్టి లేపాడు.
‘ఫైజాబాద్‌’
‘సరే.. అర్ధరూపాయి ఇచ్చుకో.. ఫుట్‌పాత్‌ మీద ఊరికే పడుకోనివ్వను. ఏం, తెలుస్తున్నదా?
ఓ క్షణం, చందూకి సినిమా చూస్తున్నానేమో అని అనిపించింది. తను సినిమాల్లో మాత్రమే ఇలా మాట్లాడడం చూశాడు.
‘నా దగ్గర డబ్బులేం లేవు.. ఆ మాత్రం డబ్బులే ఉండి ఉంటే, ఈ నగరానికి ఎందుకొచ్చేవాడిని?’
‘ఇది నగరం కాదు. ముంబై.. ఏం? మహానగరం.. నాకు అర్ధరూపాయి ఇచ్చుకో.’
‘తన పక్కనే పడుకున్న ఝంరు లేచాడు. ‘ఒరేరు, దేవా.. ఎందుకా పిల్లాడిని ఇబ్బందిపెడతావు? ఇదిగో తీసుకో, నీ ఎనిమిది అణాలు .. వాడిని పడుకోనియ్యి’ అన్నాడు.
ఝంరు, దిండు కింద దాచిన చిల్లరను గుప్పెట్లో తీసుకుని, అందులో నుంచి అర్ధరూపాయి తీసి, హవిల్దార్‌ వైపుకు విసిరికొట్టాడు. దేవా దానిని గాలిలో ఎగురుతుండగానే పట్టుకున్నాడు. ‘నికృష్టుడా, పినాసీ, వాడి బదులు నువ్విస్తావా.. వాడు నీకేమవుతాడు?’ అంటూనే అర్ధరూపాయిని చేతిలో పట్టుకుని వెనక్కి నడిచాడు.
చందూకి ఇదేం నగరమో అర్థంకాలేదు. ఒకవైపు కాలితో తంతోంది. మరోవైపు ఆలింగనం చేసుకుని ఓదారుస్తున్నది. ఇక ఆ తర్వాత రాత్రంతా అతడికి నిద్ర పట్టనే లేదు.
మర్నాడు మళ్ళీ ఝంరు దగ్గరికి చేరాడు.
‘నువ్వు గ్రామం నుండి నేరుగా వచ్చేశావా? తలంతా ఇంతింత నూనె రాసుకుని వచ్చేసావు, ఏకంగా హీరో అయిపోదామనే!?
‘లేదు.. మిత్రమా! నేను..’
ఝంరు చేతులు గాలిలోపైకి విసిరి, ‘మిత్రమాలు వద్దిక్కడ. ఆ లాఫోటగాళ్లే మిత్రమా అంటారు. నన్ను బాబారు అని పిలువ్‌.. చాలు. అందరూ నన్ను అలాగే పిలుస్తారు. ఝంరు బాబారు!’ అన్నాడు.
చందదూ నీళ్లు నములుతూ, నోరు మూసుకోవడం ఉత్తమం అనుకున్నాడు.
‘దేవా మళ్ళీ వస్తాడు. నిన్నిక్కడ నిద్రపోనివ్వడానికి అర్ధ రూపాయి తీసుకుంటాడు. వారానికి అర్ధరూపాయి.’
చందూ ముఖం పాలిపోయింది, పచ్చకామెర్లు వచ్చినవాడి మొహంలాగా పచ్చబడిపోయింది.
‘నువ్వు, ఈ నగరంలో ఉందామనుకుంటున్నావా? పసుపులా పచ్చబడిపోకు. మిరపకాయలా ఎర్రగా ఉండు. ఎర్రనికారం మిరపకాయ.’
కాస్త ఆగి, ఝంరునే మళ్ళీ, ‘చౌపట్టికి వస్తావా? అక్కడో పెద్ద నాయకుడు ఉన్నాడు, బాగా మాట్లాడతాడు. మనకి అయిదు రూపాయలు ఇస్తాడు.’
‘అయిదు రూపాయలే! అంత సంపాదించడానికి మనం ఏంచేయాలి?’
‘నాయకుల ఉపన్యాసాలు వినాలి. చప్పట్లు కొట్టాలి. జయహో అంటూ అరవాలి. అంతకంటే ఏం లేదు.’
చందూ చిరునవ్వు నవ్వాడు. ‘ఈపాటి దానికి అయిదు రూపాయలా?’
‘అవును! కానీ అందులో సగం నాకు.
పార్టీ దేవాకి పది రూపాయలు ఇస్తుంది. అతడు అందులో సగం ఉంచుకుని, నాకు అయిదు రూపాయలు ఇస్తాడు. ఫుట్‌పాత్‌ల మీద పడుకునే వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర నుండి యాభై పైసల చొప్పున యాభై మంది దగ్గర వసూలు చేసి, అతగాడికి నేనివ్వాలి. అర్థం అయిందా?’
చందూ తలాడించాడు. ‘హో’ అన్నాడు. అతగాడు నేర్చిన మొట్టమొదటి మరాఠీ మాట అదే.
చందూ మళ్ళీ నగర స్పర్శను అనుభవించాడు. ‘ఏం నగరమిది? ఇది నిన్ను పోషిస్తుంది.. కాటేస్తుంది కూడా.’
‘మనం అంతా కొమ్రిలాంటి వారమే.’
‘కొమ్రి? కొమ్రి అంటే ఏమిటి?’
‘కొమ్రి అంటే కోడిపెట్ట. ఈ నగరం బియ్యం గింజలు విసురుతుంది. మనం ఆ బియ్యం గింజలను టుక్క్‌ టుక్క్‌ అంటూ కోళ్లలాగా ఏరుకు తింటాము. మనం ఊరికే వచ్చిన గింజలు తిని, కాస్త కండపట్టగానే మన రెక్కలు కత్తిరిస్తారు.’
‘కత్తిరించేది ఎవరు?’
‘రాజులు’
‘వాళ్లెవరు?’
‘ఈ నగరంలో రెండే రకాల మనుషులుంటారు. మొదటి రకం -పార్టీ వాళ్ళు-సభలు పెడతారు. ఉపన్యాసాలు చెప్తారు. డబ్బులు పంచుతారు. ఓట్లు దండుకుంటారు. రెండో రకం- తుపాకులు-కత్తులు పట్టుకునే రకం. డబ్బులు తీసుకుంటారు. ప్రాణాలు తియ్యరు. కొన్నిసార్లు ప్రాణాలు తీస్తారు. డబ్బులు ఇస్తారు.’
‘అంటే, గూండాలా?’
‘వాళ్ళు గుండాలా-మనుషులా.. అనే తేడా అల్లా, వాళ్ళ స్టైల్‌లోనే ఉంటుంది’.
మహానగరం నీతి రీతులు తెలుసుకోవడానికి చందూకి ఎక్కువ కాలం పట్టలేదు.
రెండోసారి దేవాతో పాటుగా పార్టీవాడొకడు వచ్చాడు. ‘అతగాడు మనుషుల్ని లెక్కపెట్టుకున్నాడు. నాయకుడు ‘ముంబై ఎవరికి చెందుతుందని అడిగితే ఏమని చెపుతారు?’
‘ముంబై ముంబై వాసులకే చెందుతుంది’ ముక్తకంఠంతో అరిచారు అంతా.
‘అరె, మదరాసోళ్లా, మరాఠీలా చెప్పండి. తమిళంలో కాదు’.
‘ఏం సమాధానం ఇవ్వబోతున్నారు?’
‘ముంబై ఆంచి’.
‘మంచిది.’
అతగాడు వెళ్ళిపోగానే చందూ దేవాతో, ‘బావు! పెద్దన్నా!’ అని పిలిచాడు.
దేవాని అందరూ అలా పిలవడం చందూ గమనిస్తూనే ఉన్నాడు. దేవా కాస్తంత మెత్తబడ్డాడు.
‘ఈ పార్టీవాళ్ళు ఒక్కొక్కరికి ఎంతిస్తారంటావు?’
దేవా మొహానికి కాస్త గంటు పెట్టుకున్నాడు. ‘నీకెందుకు? నీకు రావలసిన అయిదు అర్ధరూపాయలు నీకు అందుతున్నాయి కదా! లేదా?’
‘బావు, అయిదు అర్ధరూపాయలు ఎందుకూ కొరగావడం లేదు.’
‘అయిదు వారాలు ఫుట్‌పాత్‌ మీద పడుకునేందుకు అద్దె ఇవ్వడానికి మాత్రమే సరిపోతున్నాయి. అవునా? కాదా?’
‘అవును. నిద్రపోడానికి సరిపోతాయి. కానీ తిండి మాటేమిటి బావు?
‘నేను నిన్ను ఇక్కడికి రమ్మని పిలిచానా ఏం? నువ్వు ఏ యుపి నుండో వచ్చావు? ఎక్కడి నుండి వచ్చావో చెప్పు? చెప్పు?’
‘ఫైజాబాద్‌’
‘ఫైజాబాద్‌లో నీకు అన్నం ఎవరు పెట్టారు? ఎవరు? చెప్పు. చెప్పు.
చందూ ఎంత పెద్ద అబద్ధం చెప్పాడంటే, ఆ దెబ్బకి అతడు తలక్రిందులయ్యాడు.
‘మేము రైతు కూలీలం, పేద రైతు కూలీలం. రోజుకూలీ కోసం పనులు చేస్తుంటాం బావు. కానీ ఒకరోజు, తీవ్రవాదులు అదాటున మాపై టార్‌, టార్‌ టార్‌, టార్‌.. అంటూ వరసగా తూటాలు పేల్చేశారు. నా కుటుంబం అంతా ఆ తూటాల దెబ్బకు తునాతునకలయ్యింది. అన్న, అక్క, అమ్మ, నాన్న అంతా.’
అతడంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోయాడు. నెమ్మదిగా వణకడం మొదలెట్టాడు. దానితో బావు కాస్త మెత్తబడ్డాడు. చందూ నిజమే చెపుతున్నాడని నమ్మాడు.
‘సరే, నేనేం చేయగలనో చూద్దాం. నీకు ఏదయినా పనిచూసి పెడతాను. నీకు ఏమయినా చదువూ సంధ్యా వచ్చా?’
‘వచ్చు. నేను స్కూల్‌ నుండి పారిపోక ముందు మూడో తరగతి చదువుతూ ఉండేవాడిని.’
‘నువ్వు నీ పేరు రాసుకోగలవా?’
‘అవును’
‘నా పేరు కూడా రాయగలవా ?’
‘అవును.’
‘అయితే మంచిదే. నువ్వు రేపటి నుండి నా దగ్గర పనిచేస్తావు. నేను నా డైరీని వారం వారం రాయాలి. నాకు హిందీ సరిగ్గా రాదు. హిందీ జాతీయభాష కదా! మా రిపోర్టులన్నీ హిందీలోనే ఉండాలి. అందుకని రేపటి నుండి నా బదులు నువ్వాపని చెయ్యాలి. మన ప్రభుత్వం ఇక్కడ హిందీని మాత్రమే అనుమతిస్తుంది. నాకు ఉద్యోగం ఇవ్వడానికి, ప్రభుత్వం హిందీ వచ్చి తీరాలని షరతు పెడితే, ఉద్యోగం కోసం హిందీ వచ్చని చెప్పాను. ఇప్పుడు నా బదులుగా హిందీలో రాయడానికని ఒకడిని పెట్టుకుంటే, వాడు వారానికి ఒకసారి డైరీ రాయడానికి నాలుగు ఎనిమిదణాలు తీసుకుంటున్నాడు. ఈ మహానగరంలో ఎవరూ ఏ పనీ ఊరికే చేయరు. అవునా?’
చందూ అనుకున్న పని అయిపోయింది. అయినా, ‘బావు, నువ్వెప్పుడూ ఎనిమిదణాలలోనే అన్ని లెక్కలూ చెప్తావు, ఎందుకని?’ అని అడిగాడు.
బావు ఫక్కున నవ్వాడు. ‘ఎందుకంటే, మనలాంటి సగటు మనిషికి అన్నీ సగాలే అందుబాటులో ఉంటాయి. కంచంలో సగం అన్నం, సగం రాత్రి నిద్ర, సగం నవ్వు, సగం ఏడుపు, ఆఖరికి చావు కూడా సగమే. ఈ అర్ధరూపాయి ఎన్నటికీ రూపాయి అవదు. కాసేపు ఆగి, ‘ఇది గంభీరంగా ఆలోచించే విధానం, అవునా?’ మళ్ళీ కాస్త ఆగి, రహస్యంగా ‘అని ఒక నక్సలైట్‌ నాకు చెప్పాడు’ అన్నాడు.
చందూ బావుని ఒక రిపోర్టర్‌లాగా అనుసరిస్తున్నాడు. అతడు చేసిన ప్రతి పనినీ చందూ రాయాలి. నెమ్మదిగా చందు, బావుతోపాటు అతని ‘కోలి’లో ఉండడం మొదలెట్టాడు. అప్పుడప్పుడు బావు కోసం వంట చేసేవాడు. అతను డ్యూటీ చేస్తున్న చోటికి తీసుకెళ్లి, పెట్టేవాడు కూడా.
బైకుల్లాకి కాస్తంత కింద, సర్వి హోటల్‌ పక్కన చిన్న సందు ఉంది. ఆ సందులో ఓ తీగె మీద ఒకడు తన దుస్తులను ఆరేస్తున్నాడు. అతనిని చూస్తే ఉర్దూ మాట్లాడే మనిషిలాగా ఉన్నాడు. అతని దగ్గర లైసెన్స్‌ లేదు. బావు ఓ రోజు అతనిని పట్టుకున్నాడు. తన డైరీని తెరిచి, ‘నువ్వు ఏం అమ్ముతున్నావు?’ అని అడిగాడు.
అతడు తన లక్నవ్‌ యాసలో ‘ఖమీరేకి గులండి యా’ అన్నాడు.
బావు ఒక్కసారి కంగుతిన్నాడు, ఏమిటేమిటీ?
‘పులియపెట్టిన గులండి, అయ్యా’.
‘అంటే ఏమిటి?’
‘గులాబీ రేకులు, ఒకసారి రుచి చూడండి.’
‘హుం!’ అని నోట్లో వేసుకుని, ‘రుచి అద్భుతం!’ అంటూ చప్పరించాడు. ‘నీ పేరేంటి?’ అని మరాఠీలో అడిగాడు.
‘ఇష్కుళ్‌ రెహమాన్‌ సిద్ధికీ.’
బావు గొంతెత్తి గట్టిగా, ‘హిందీలో చెప్పు.. అర్థం అయిందా.. నీ పేరు హిందీలో చెప్పు’ అంటూ మళ్ళీ హూంకరించాడు.
ఆ మనిషి మళ్లీ అదే మాట పదే పదే చెప్పాడు- ‘ఇష్కుళ్‌ రెహమాన్‌ సిద్ధికీ’.
బావు గట్టిగా ఊపిరి పీల్చుకుని, డైరీపై పెన్సిల్‌పెట్టి ‘పొట్టి ఇ రాయాలా పొడుగు ఈ రాయాలా?’ అని అడిగాడు.
‘అంటే ఏమిటండి? అతగాని ఉర్దూకి ఇతగాని హిందీకి మధ్య భాష నలిగిపోతోంది.
బావు ఇక లాభం లేదని డైరీ మూసేసి, ‘చూడు.. నేను నిన్ను ఈ రోజుకి వదిలేస్తున్నాను.. దీన్ని నా రిపోర్ట్‌లో పెట్టడం లేదు. నా రిపోర్ట్‌లో నీ పేరు బాబు. నువ్వు బంగాళాదుంపలు అమ్ముతున్నావు. అంతే. ఏమిటి?’
అప్పటికి చందూ అక్కడికి చేరుకున్నాడు. బావు తన డైరీని చందూ చేతిలో పెట్టి. ‘రాయి.. పేరు బాబు. వ్యాపారం – బంగాళా దుంపల అమ్మకం. చందూ, అతని దగ్గరి నుండి ఎనిమిదణాలు తీసుకో’ అంటూ అక్కడి నుండి ముందుకు కదిలాడు.
అటువంటి ఘటనే మరోసారి జరిగింది. ఆ రోజు చందు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. అందువలన బావుతో వెళ్లలేకపోయాడు. బావు వెనక్కొచ్చి ఈ కథ చెప్పాడు.
‘నీకు వినాయక్‌రావు రోడ్డు తెలుసు కదా!’
ఇది దేవా, వార్డెన్‌ రోడ్‌కి బదిలీ అయినప్పటి మాట. అతనిప్పుడు వార్లలోని ‘కోలి’లో ఉంటున్నాడు.
చందూ దేవాని ఆట పట్టించడం మొదలెట్టాడు. ‘సరే, వినాయక్‌రావు రోడ్డులో ఏమయిందో చెప్పు.’ అతనికిప్పుడు మహానగరంలోని రోడ్లన్నీ పరిచయమే.
‘ఆవు చనిపోయింది.’
‘ఎవరి ఆవు?’
‘నాకు తెలియదు. వీధులలో తిరిగే ఆవుల మందలలో ఒకటై ఉంటుంది. ఆ రోడ్డు పేరు వినాయక్‌రావు పట్వర్థన్‌ రోడ్డు. పేరు పలకడం కూడా కష్టమే. ఎవరు రాయగలరు? అది కూడా హిందీ లో.’
చందూ విరగబడి నవ్వాడు.
‘అప్పుడు నువ్వేం చేసావు?’
‘నాకు రెండు గంటలు పట్టింది. ఆ ఆవు తోకను పట్టుకుని లాగి లాగి ఓ మూలకి చేర్చాను. నాకు ఊపిరి కూడా ఆడలేదు. ఆ తరువాత, చివరికి ఏమయితేనేం చచ్చిపోయిన అవును పక్క రోడ్డుకు చేర్చాను. దానికి నాకు రెండుగంటలు పట్టింది.’
‘పక్క రోడ్డుకి ఎందుకు చేర్చావు?’
‘పక్క రోడ్డు పేరు బాపు రోడ్డు. రాయడం తేలిక.’
‘మరి నీకు ఎనిమిదణాలు ఎవరిచ్చారు?’
‘ఎవరి ఇంటిముందు చనిపోయిందో వాళ్లే.’
బావు, చందూ ఇప్పుడు మంచి స్నేహితులయ్యారు. సంవత్సరాలు గడిచాయి కదా! ఈ కాలంలో బావు, చందూని ఎన్నో ఉద్యోగాలలో చేర్పించాడు, మాన్పించాడు కూడా. ఆ తరువాత పార్టీ వాళ్ళలో ఒకరి చేత మినిస్టర్‌ గారి ఇంటి కాపలాదారునిగా నియమింపచేసాడు.
చందూ ఇప్పుడు పూర్తిగా ముంబై వాసి అయిపోయాడు. మినిస్టర్‌కి అతనంటే వల్లమాలిన నమ్మకం ఏర్పడింది. అతని వ్యక్తిగత పనులకి కూడా పంపడం మొదలు పెట్టాడు. చందూ ఇప్పుడు ఎవరో ఇచ్చే ఎనిమిదణాల మీద ఆధారపడడం లేదు. అయినా ఇప్పటికీ కొంతమంది ఎనిమిదణాలు ఇస్తూనే ఉంటారు. అది వేరే విషయం.
ఒకరోజు మంత్రి బంగళాలో పెద్ద పేలుడు జరిగింది.
అప్పుడు మంత్రి తన ఆఫీస్‌లో ఉన్నాడు. శబ్దానికి కంగుతిని, వెంటనే కూర్చున్న కుర్చీలో నుంచి లేచి నిలుచున్నాడు. క్షణంలో చందూ, అతని కాళ్ల దగ్గర పడి వున్నాడు. చందూ వెనకే ఎకె 47 ఎక్కుపెట్టిన వ్యక్తి నిలబడి ఉన్నాడు.
‘దీనర్థం ఏమిటీ?’ చందూ వైపు తిరిగి మందలించాడు మంత్రి.
చందూని ‘ఎందుకు- ఎందుకు ఇతనిని లోనికి రానిచ్చావు?’ అని అడిగాడు.
‘నేను, నేనెక్కడ రానిచ్చాను అయ్యగారూ. ఆ మనిషే నన్ను లోపలికి నెట్టాడు..’ చందూపైకి తుపాకీ గురిపెట్టబడి ఉండడంతో, తూలుతున్నాడు, వణుకుతున్నాడు.
‘ఎవడు బాబూ నువ్వు?’ ఇప్పటికి మంత్రికి ఆగంతకుడి చేతిలో తుపాకీ ఉన్న విషయం గమనంలోకి వచ్చింది. మంత్రి నెమ్మదించాడు.
‘నేనెవరనుకుంటున్నావు?’
‘తీవ్రవాదివి.. అనుకుంటున్నాను.’
‘ఆ తీవ్రవాది నవ్వాడు. మంత్రి కూడా నవ్వాడు. ‘అతగాడిని ఎందుకు అదుపులో పెట్టుకున్నావు? చందూ వైపు చూపుతూ మంత్రి అడిగాడు.
‘అతడు నా అదుపులో ఉన్నాడు.’
‘నా అదుపులో కూడా’ మంత్రి జవాబిచ్చాడు.
‘నిజామా? నీ అదుపులో ఉన్నాడా? బయట విచ్చలవిడిగా తిరుగుతున్నవాడు, నీ అదుపులో ఎలా ఉన్నాడు?’
‘అదుపులో ఉంచుకోవడానికి నీలాగా నాకు తుపాకీ అవసరం లేదు.’
‘అయితే, ఎలా అదుపులో ఉంచుకుంటావు?’
‘మొదట నోట్లతో, ఆ తరువాత ఓట్లతో. నేను వాళ్ళను ఐదేళ్లు బందీగా ఉంచుకోగలను.’
‘ఆ తరువాత?’
‘మళ్ళీ మరో ఐదేళ్లు. అలా అయిదేళ్లకొకసారి వరుస కొనసాగుతూనే ఉంటుంది.’
తీవ్రవాది తన దారిని మార్చుకున్నాడు. తుపాకీని పట్టుకుని, ‘ఈ లైసెన్స్‌ విధానాన్ని రద్దు చేయండి. ఇది ఇక పనిచేయడం లేదు.’
‘అయితే ఏది పనిచేస్తుందంటావ్‌?’
‘ఆ విషయం అతనినే అడుగు. నీకు నాకు మధ్యలో ఉన్నది ఇతనే. సామాన్య మానవుడు!’
మంత్రి చందూతో, ‘చెప్పు, నువ్వు దేనిని ఎన్నుకుంటావు? బుల్లెట్‌తో ఒకేసారి చనిపోవడమా? లేక ..’
తీవ్రవాది ఓ అడుగు ముందుకేసాడు, ‘లేదా రోజు రోజు కాస్తంత కాస్తంత చొప్పున ప్రతి అయిదేళ్లకోసారి చనిపోవడమా?’
చందూ కాసేపు ఆగాడు, ఇద్దరివైపు ఒకసారి చూసాడు. ఆ తరువాత జేబులో చెయ్యి పెట్టాడు.
తీవ్రవాది బెదిరిస్తూ, ‘జేబులో ఏముంది? ఏం బయటికి తీస్తున్నావు?’
చందూ ఏమాత్రం కలవరపడలేదు. ‘ఏం లేదు.. నా జేబులో ఎనిమిదణాల బిళ్ళ ఉంది. దానిని పైకి ఎగరేసి, దేనిని ఎన్నుకుందామా అని నిర్ణయించు కోవాలనుకుంటున్నాను’ అంటూ నాణాన్ని పైకి ఎగరేసాడు. నాణెంపైకి ఎగరగానే ఇద్దరూ ఒకేసారి ‘తల’ అని అరిచారు.
అదృష్టం కొద్దీ ఆ నాణెం కిందికి పడలేదు. పడి ఉంటే, అది ఏవైపు పడ్డా పోయేది చందూ తలే.

మూలం : గుల్జార్‌
అనువాదం : కె. ఉషారాణి
9492879210

➡️