గుబాళించే గులాబీలు

Feb 4,2024 09:10 #Health Awareness, #Sneha, #Stories
rose flower importance

‘రోజావే.. చిన్ని రోజావే.. రాగాలే రువ్వే రోజావే..! , గులాబీ పువ్వై నవ్వాలి వయస్సు’ అంటూ సినీ కవులు ఎంతో పొగిడారు ఈ పూలరాణిని.. చిన్నారుల లేలేత చర్మంలా, స్వచ్ఛమైన నవ్వులా, హృదయాకారంలో ఉండే గులాబీని ఎవ్వరైనా ఇష్టపడతారు. అప్పుడే విచ్చుకున్న గులాబీలు ఆ ఇంటికే ఎంతో అందాన్ని తీసుకొస్తాయి. చెట్టు కొమ్మలు పదునైన ముళ్ళను కలిగి ఉన్నా గులాబీ రేకులు పట్టుకుంటే మృదుత్వాన్ని ఇస్తాయి. వీటిని చూసినా, వాసన పీల్చినా మెదడులో ఒత్తిడి కలిగించే హార్మోన్ల స్థాయి తగ్గి, గుండెకు ఆరోగ్యాన్నిస్తాయని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. ఎరుపు రంగు ప్రేమకు చిహ్నం. అందుకే ప్రేమికులు ఎరుపు గులాబీలనే ప్రేమించిన వ్యక్తికి ఇస్తుంటారు. ‘ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈజ్‌ ది బెస్ట్‌ ఇంప్రెషన్‌’ అన్నారు కవులు. అలాగే గులాబీని చూడగానే ఎదుటి వ్యక్తికి సానుకూలత అభిప్రాయం ఉంటుందని ఓ ఆలోచన. అందుకే రోజా పువ్వుకు ఓ ప్రత్యేకమైన రోజును కేటయించారు. ఫిబ్రవరి నెల అంటే వాలెంటెన్స్‌డే గుర్తొస్తుంది. వారంరోజులపాటు జరుపుకునే ఈ వేడుకల్లో మొదటిరోజు ప్రేమించిన వ్యక్తికి గులాబీ ఇచ్చి తమ ప్రేమను వ్యక్త పరుస్తారు. అలా ఫిబ్రవరి 7న ‘ప్రపంచ గులాబీల దినోత్సవం’ జరుపుకుంటారు. ఈ సందర్భంగా గులాబీల్లోని ప్రత్యేకతలను తెలుసుకుందాం.

‘ఓ గులాబీ.. ఓ గులాబీ.. వలపుతోటలో విరిసినదానా.. లేత నవ్వుల వెన్నెల సోనా.. ఓహో గులాబి బాలా.. అందాల ప్రేమ మాలా..!’ అంటూ మంచిమనుషులు సినిమాలో పాట విన్నా.. ‘నా చెలి రోజావే నాలో ఉన్నావే..’ అని రోజా సినిమాలో పాటైనా, ‘రోజా..రోజా.. రోజా..రోజా’ అని ప్రేమికుల రోజులో ప్రియుడు తన ప్రేయసీని తలచుకున్నా.. ‘రోజ్‌ రోజ్‌ రోజా పువ్వా..’ అని అల్లరిప్రియుడులో రాజశేఖర్‌ గొంతు సవరించినా, ‘ఎలా వచ్చెనమ్మ గులాబీల వాన..’ అని సంక్రాంతిలో వెంకటేష్‌ తన్మయత్వం అయినా మొత్తం రచయితలకు గులాబీలపై ఉన్న ప్రేమే. ఇవన్నీ సినీప్రేక్షకుల్లో హృద్యయంగా నిలిచిన పాటలే. అంతేకాదు.. రామ్‌గోపాలవర్మ తీసిన ‘గులాబీ’ సినిమా అప్పట్లో అద్భుతమైన విజయాన్ని అందించింది. ఇంతలా సాహిత్యంలో ఇమిడిపోయిన గులాబీలు పుట్టింది చైనాలో. ఐదు వేల సంవత్సరాల క్రితం ఆ దేశంలో గులాబీ మొక్కలు పెంచారని చరిత్ర చెబుతుంది. ఈ నీలం రంగులో ఉన్న ఈ గులాబీలను చూసి ఇతర దేశాలవారు అమితంగా ఇష్టపడేవారు. ఈ క్రమంలోనే ఈ మొక్కలు ఇతర దేశాలకూ వ్యాప్తి చెందాయి. కొన్నాళ్లకు ఈ మొక్కలు ఆ దేశంలో అంతరించాయి.

కానీ ఇరాక్‌లోని ఒక రాష్ట్రమైన అస్సిరియా యువరాజు పసుపు గులాబీని చాలా ఇష్టపడేవారు. మొఘల్‌ సామ్రాజ్యకాలంలో, మొఘల్‌ చక్రవర్తి భార్య నూర్జహాన్‌ ఎర్ర గులాబీలను చాలా ఇష్టపడేవారట. నాటి చక్రవర్తులు అనేక గులాబీ తోటలను సాగు చేసినట్లు చరిత్రకారులు తెలిపారు. నూర్జహాన్‌ ఈ గులాబీ రేకులతో పెర్ఫ్యూమ్‌ చేయడానికి ప్రయోగాలూ చేశారట. 18 శతాబ్దంలోనే గులాబీల్లో కొత్త వంగడాలను కనుగొన్నారు. గతంలో యూరప్‌లోని రెండు దేశాల జాతీయ పుష్పం గులాబీ ఉండేది. కానీ ఇప్పుడు యూనైటెడ్‌ కింగ్‌డమ్‌ దేశానికి మాత్రమే జాతీయ పుష్పంగా ఉంది. భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఇష్టమైన పువ్వు ఎరుపు గులాబీ. ఇంతటి ఘనత గల ఈ గులాబీలకు సంస్కృతి, సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.

ప్రేమకు చిహ్నంగా..

గులాబీలను శమంతిక, అతి మంజుల, తరుణి తదితర పేర్లతో కవులు పిలుస్తారు. ఈజిప్టు రాణి క్లియోపాత్ర కాలం నుంచి ప్రేమకు చిహ్నంగా గులాబీలను ఇచ్చిపుచ్చుకోవడం అనవాయితీగా వస్తుంది. తన ప్రియుడైన ఆంథోనీని స్వాగతించేందుకు మోకాళ్ల ఎత్తు మేర గులాబీ రేకుల్ని పరిచిందట. ఇలా ప్రేమికులు హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నామని చెప్పడానికి గులాబీలను ఇవ్వడం సర్వసాధారణం అయ్యింది.ఈ క్రమంలో గులాబీల సంఖ్యను బట్టి కొన్ని భావాలకు సంకేతాలుగా భావిస్తున్నారు. ఒక గులాబీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్లు, 12 గులాబీల గుచ్ఛం కృతజ్ఞత తెలిపేందుకు, 25 గులాబీలతో కూడిన గుత్తి శుభాకాంక్షలు చెప్పేందుకు, 50 గులాబీలతో కూడిన బొకే గాఢమైన, పరిపూర్ణమైన ప్రేమను వ్యక్తం చేసేందుకు సంకేతాలుగా భావిస్తారు.

సుగంధతైలం తయారీ

17వ శతాబ్దంలోనే గులాబీలను ఆవిరిలో ఉడికించి తీసిన నూనెను మందుల తయారీల్లోనూ, అత్తరుల తయారీకి వాడడం జరిగింది. అప్పట్లోనే గులాబీ రేకుల నుంచి సుగంధ తైలాన్ని తయారుచేయడంలో మనిషి విజయాన్ని సాధించాడు. ఒక పౌండు అత్తరు (సుగంధ తైలం) తయారీకి సుమారు 10,000 పౌండ్ల గులాబీ రేకులు కావల్సి వస్తాయి. ఆ కాలంలో ప్రాచీనకాలపు రోమన్‌ (ప్రస్తుతం ఇటలీ) మహిళలు గులాబీ రేకులు తమ చర్మ సౌందర్యానికి ఉపయోగించేవారు. గులాబీల సువాసనను ఆలివ్‌ తైలానికి చేర్చి, పన్నీరు (రోస్‌ వాటర్‌) ను తయారుచేశారు. ఇప్పటికీ దీన్ని సౌందర్య లేపనంగా (పన్నీరు) శుభకార్యాల్లో ఉపయోగిస్తున్నారు.వైద్యపరంగాగులాబీల సువాసన మనస్సుపై ప్రశాంతత, ఓదార్పు ప్రభావాన్ని కలిగిస్తుందంటున్నారు మానసిక నిపుణులు. గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుందని శాస్త్రవేత్తల అధ్యయనాల్లో వెల్లడైంది. అవసరమైన వారికి భావోద్వేగ మద్దతును (ఎమోషనల్‌ హీలింగ్‌) అందిస్తుంది. వైద్యపరంగా గులాబీకి చాలా ప్రాముఖ్యం ఉంది. పంచదార, గులాబీ రేకులు కలిపి చేసిన గుల్‌ఖండ్‌ మంచి విరోచనకారిగా పనిచేస్తుంది. గులాబీ పూసి, వాడి రాలిపోయిన పిదప చిన్న బుడిపెలా మిగిలిపోయే కాయల్లో (హిప్‌లు) నిమ్మ, నారింజ కంటే కనీసం పదిరెట్లు ఎక్కువ ‘విటమిన్‌ సి’ ఉంటుంది. గులాబీ రేకుల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖాన్ని కాంతివంతంగా చేస్తూ మచ్చల్ని తొలగించేందుకు ఎక్కువగా వాడుతున్నారు. గులాబీ రేకులతో టీ చేసుకుని తాగితే, జలుబుకు ఉపశమనం లభిస్తుంది. గులాబీ రేకుల నుండి తీసిన యాంటీ ఇన్ఫ్లమేటరీ రోజ్‌వాటర్‌, సౌందర్య తైలాల్లో కలుపుతారు. ఇది హైడ్రేటింగ్‌గా ఉండి, శరీరంపై గాయాలను నయం చేస్తుంది. గులాబీ తైలం మర్దన చేయించుకుంటే మనోల్లాసం చేకూరుతుంది. మృదువుగా, తేమగా ఉండే గులాబీ రేకులను ఫేస్‌ప్యాక్‌లు, పెర్‌ఫ్యూమ్స్‌ల తయారీల్లో వాడుతున్నారు. గులాబీ రేకుల క్రీమ్‌తో బాడీమసాజ్‌ చేస్తారు. గులాబీ రేకుల్ని వేడి నీటిలో నాలుగు గంటలు ఉంచి, వాటితో స్నానం చేస్తే శరీరం మెరుపు, మృదుత్వం వస్తుంది.

క్యాన్సర్‌ రోగుల కోసం

పన్నెండేళ్ల కెనడియన్‌ క్యాన్సర్‌ బాధితురాలు మెలిండా రోజ్‌, తన జీవితంలోని చివరి ఆరు నెలలను తన చుట్టూ ఉన్న క్యాన్సర్‌ రోగుల జీవితంలో ఆనందం, ఆశను తీసుకురావడానికి కృషి చేశారు. కొద్దిరోజుల్లో చనిపోతాను అని తెలిసినా జీవితం పట్ల నిరాశ చెందలేదు. అందుకు కారణం తన చుట్టూ ఉన్న గులాబీలే. నిద్ర లేచిన వెంటనే తన చుట్టూ వందల గులాబీలు కళ్లకు కనిపిస్తూ ఉండేవి. ఆ గులాబీల్లో జీవితం మీద నమ్మకం, ఆశ కలిగించే శక్తి ఉందని ఆమె నమ్మారు. క్యాన్సర్‌ బాధితులకు గులాబీలు ఇస్తూ వారిలో జీవితం పట్ల నమ్మకాన్ని కలిగించారు. వ్యాధిగ్రస్తులు సానుకూలత ఆలోచనలు ప్రేరేపించేలా ప్రోత్సహించారు. ఆమె 1996 సెప్టెంబర్‌ 22న మరణించారు. ఆమె జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 22న ప్రత్యేకంగా గులాబీ డే జరుపుకుంటారు. రోగుల్లో స్వస్థత చేకూరేందుకు క్యాన్సర్‌ రోగులకు గులాబీ పువ్వులు పంచుతారు. ఇదంతా విదేశీ సంస్కృతి అయినా మన దేశమంతా ప్రచారము చెందింది.

పర్యాటకులను ఆకర్షిస్తూ..

ఒక గులాబీ చెట్టు ఇంటిముందు ఉంటే ఆ ఇంటికే ఎంతో శోభను తీసుకొస్తుంది. అలాంటిది ఎన్నో రంగురంగుల గులాబీలు ఒకేచోట ఉంటే చూసేందుకు రెండు కళ్ళూ చాలావు. పర్యాటకులను ఆకర్షించేందుకు గులాబీల తోటలను పెద్ద ఎత్తున సాగుచేస్తున్నారు.. బెంగళూరు, ఊటీ రైతులు. అంతేకాదు.. చాలా ప్రాంతాల్లో ‘రోజ్‌ గార్డెన్‌’ లకు ఎంతో పేరు ఉంది. అక్కడ సేద తీరేందుకు పర్యాటకులు చాలా ఇష్టపడతారు. దక్షిణ ఢిల్లీలోని చాణక్యపురిలోని ఎంబసీ ప్రాంతంలో ఉన్న నేషనల్‌ రోజ్‌ గార్డెన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరుదైన రకాల గులాబీలు కనిపిస్తాయి. చండీగఢ్‌లో ‘జాకీర్‌ హుస్సేన్‌’ రోజ్‌ గార్డెన్‌ దేశంలో మరొక ప్రసిద్ధ గులాబీ తోట. 30 ఎకరాల విస్తీర్ణమున్న ఈ తోటలో దాదాపు 825 రకాల గులాబీలు, 32,500 రకాల ఔషధ మొక్కలు విస్తరించి ఉన్నాయి. వీటిని చూసేందుకు పర్యాటలకు ఉదయం నుంచి రాత్రి వరకూ వస్తూనే ఉంటారు.గులాబీ రేకులు మృదుత్వానికి ప్రతీకగా ఉంటాయి. ఆ సున్నితమైన గుబాళింపు మనసును మైమరిపించేలా చేస్తాయి. ఇంటింటా గులాబీల సోయగం ఉంటుందంటే ఎంతగా గులాబీలను ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అందరి హృదయాలను దోచే గులాబీల గుబాళింపులను ఆస్వాదిద్దాం..

 

  • పద్మావతి, 9490099006
➡️