సినిమా తప్ప వేరేదీ తెలియదు

Apr 7,2024 07:47 #celebrities, #Sneha

కొంతమంది నటీనటులకు సినిమా అంటే పాషన్‌. అదే ప్రపంచం. అటువంటి వారు సినిమా కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారు. ఆ కోవకే చెందుతారు మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. ‘ది గోట్‌ లైఫ్‌’ పుస్తకం ఆధారంగా దర్శకుడు బ్లెస్సీ తెరకెక్కించిన చిత్రం ‘ఆడు జీవితం’. కొన్నేళ్లపాటు చిత్రీకరణ జరుపుకున్న చిత్రం. మార్చి 28 న విడుదలయ్యింది. పృథ్వీరాజ్‌ నటనతో సినిమాకి ప్రాణం పోశారు. ఈ సందర్భంగా ఆయన గురించి పలు విశేషాలు.

తిరువనంతపురంలో సుకుమారన్‌, మల్లికా సుకుమారన్‌ దంపతులకు పథ్వీరాజ్‌ జన్మించాడు. ప్రారంభ పాఠశాల విద్యను చెన్నైలో చదివారు. తర్వాత పృథ్వీరాజ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో బ్యాచిలర్‌ డిగ్రీని అభ్యసించడానికి ఆస్ట్రేలియాకు వెళ్లారు. పథ్వీరాజ్‌ ఇంకా ఆస్ట్రేలియాలో తన డిగ్రీ చదువుతున్నప్పుడు, దర్శకుడు ఫాజిల్‌ అతని ఒక సినిమా కోసం స్క్రీన్‌-టెస్ట్‌ కోసం పిలిచాడు. 19 ఏళ్ల పృథ్వీరాజ్‌ ఈ పాత్ర కోసం ఆడిషన్‌కు వెళ్లాడు. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ నిలిపివేయబడింది. అయితే, ఫాజిల్‌ అతన్ని దర్శకుడు రంజిత్‌కు పరిచయం చేశాడు. అందులో పృథ్వీరాజ్‌ నందనం సినిమాలో (2002) నటించారు, ఇది సాంకేతికంగా అతని తొలి చిత్రం. వెంటనే మరొక సినిమాలోనూ నటించారు. అయితే రెండు సినిమాలూ హిట్‌ అవ్వలేదు. దాంతో కుటుంబసభ్యులు సినిమాలు వదిలేసి చదువుకోమని చెప్పారు. కానీ పృథ్వీరాజ్‌ పట్టువదలకుండా విజయాలతో సంబంధం లేకుండా పరిశ్రమలో ప్రయత్నాలు చేశారు. పృథ్వీరాజ్‌ అన్నయ్య ఇంద్రజిత్‌ సుకుమారన్‌ కూడా నటుడు, గాయకుడు.
2004లో పృథ్వీరాజ్‌ ‘ఆకలే’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. వెంటనే తమిళ పరిశ్రమలో అవకాశం వచ్చింది. కనా కాండఎన్‌ చిత్రంతో అరంగేట్రం చేశారు. పారిజాతంలో శరణ్య భాగ్యరాజ్‌తో కలిసి నటించారు. ఈ సినిమా హిట్‌గా నిలిచింది. అదే సంవత్సరంలో పద్మకుమార్‌ దర్శకత్వం వహించిన వాస్తవం చిత్రంలో తన నటనకు ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచారు. తర్వాత క్లాస్‌మేట్స్‌, చాక్లెట్‌, తాళ్లప్పావు, తిరక్కత వంటి సినిమాల్లో నటించారు. 2009లో, పథ్వీరాజ్‌ పుతియా చిత్రంలో మెచ్చుకోదగిన నటనను అందించాడు.
దర్శకుడు, నిర్మాత మణిరత్నం తీస్తున్న తమిళచిత్రం రావణన్‌లో పృథ్వీరాజ్‌కు పోలీసు పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో అతని నటనకు మెచ్చి వరుస అవకాశాలు వచ్చాయి. మలయాళం, తమిళం, తెలుగు మరియు హిందీ భాషలలో 100 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు.


‘బ్లెస్సీ సర్‌ దర్శకత్వంలో ఒక్క సినిమాలోనైనా నటించాలనేది మలయాళ నటీనటులందరి డ్రీమ్‌. పలువురు అగ్ర హీరోలతో పని చేసిన ఆయన ‘ఆడుజీవితం’ (ది గోట్‌ లైఫ్‌) కోసం యంగ్‌ యాక్టర్‌ని తీసుకోవాలనే ఉద్దేశంతో నన్ను సంప్రదించారు. నేను వెంటనే ఓకే చెప్పా. సినిమా చూశాక ఏ ఒక్కరూ ‘పృథ్వీరాజ్‌.. ఇంకా బెటర్‌గా నటించి ఉండాల్సింది. లుక్‌ సెట్‌ అవలేదు’ అని అనకుండా ఉండాలని పాత్రకు న్యాయం చేసేందుకు నా శరీరాన్ని చాలా కష్టపెట్టా. సినిమాపై ఉన్న ప్రేమే అందుకు కారణం. సినిమా తప్ప నాకు వేరేదీ తెలియదు. కొన్నాళ్లుగా ఈ సినిమాతో ప్రయాణించా. ఈ క్రమంలో.. చిరంజీవి సర్‌ ఇచ్చిన రెండు ఆఫర్లకు(సైరా, లూసిఫర్‌) ‘నో’ చెప్పా. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన నజీబ్‌ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తీశారు.
2018లో ఈ సినిమా షూటింగ్‌ మొదలుపెట్టాం. జోర్డాన్‌ వెళ్లి చిత్రీకరణ జరిపాం. షూటింగ్‌ ప్రాసెస్‌లో ఉండగానే లాక్‌డౌన్‌ వచ్చింది. అక్కడి నుంచి బయటపడే వీలు లేదు. వందేభారత్‌ ఫ్లైట్‌తో కేరళ చేరుకున్నాం. ఏడాదిన్నర తర్వాత అల్జీరియా సహారా ఎడారిలో చిత్రీకరణ తిరిగి ప్రారంభించాం. ఇలా ఎన్నో కష్టాలు పడి, అరుదైన లొకేషన్స్‌లో షూటింగ్‌ కంప్లీట్‌ చేశాం. వాస్తవంగా రెండేళ్లలో పూర్తి చేయాల్సిన సినిమా ఇది. కోవిడ్‌ వల్ల ఆలస్యమైంది. ఈ సినిమా కోసం రోజుల పాటు డైట్‌ చేశాను. నజీబ్‌ పాత్రలా మారేందుకు కఠినమైన ఆహార నియమాలు పాటించాను. ఈ క్రమంలో నా ఆరోగ్యం గురించి మా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు. నా భార్య, మా పాప సినిమా కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని అర్థం చేసుకుని సపోర్ట్‌గా నిలిచారు. నజీబ్‌ ఎడారిలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొని ఉంటాడని ఊహించుకుంటూ నటించాను. మా కష్టానికి తగ్గ విజయం లభించిందని’ సంతోషం వ్యక్తం చేశారు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.

పేరు : పృథ్వీరాజ్‌ సుకుమారన్‌
పుట్టింది 16 అక్టోబర్‌ 1982
వత్తులు : నటుడు, దర్శకుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు
నిర్మాణ సంస్థ : పృథ్వీరాజ్‌ ప్రొడక్షన్స్‌
జీవిత భాగస్వామి : సుప్రియా మీనన్‌
కూతురు : అలంకృత

➡️