ప్రకృతి వడిలో..

Apr 28,2024 08:34 #Sneha

ప్రతి సంవత్సరం నేను మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళే వాడిని. అది ఉదయగిరి మండలంలోని దేవమ్మ చెరువు. అక్కడ ప్రకృతి నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఊరు కొండల మధ్య ఉంది. కొండలపై నుంచి సెలయేరు పడుతూ ఉంటుంది. పక్కనే అడవి. ఆ అడవిలో ఇంతవరకు నేను చూడని, వాటి పేర్లు కూడా వినని పండ్లున్నాయి. అక్కడి వాళ్ళు ఉడుములను తినేవారు. ఆ ఉడుములను కుక్కలతో పట్టించేవారు. కుక్కలకు ట్రైనింగ్‌ ఇచ్చి ఉడుము కలుగు దగ్గరకు తీసుకెళ్ళి, కలుగులో పొగ వదులుతారు. ఆ పొగకు ఉడుము బయటికి రాగానే కుక్క దాన్ని వేటాడి పట్టుకుని యజమానికి ఇస్తుంది. దాని విశ్వాసం నాకు నచ్చింది.


కొండలపైనుంచి పడుతున్న సెలయేటి నదిలో మునుగుతూ.. పక్కనే ఉన్న జారుడు బండల మీద జారుతూ.. వాగులోకి దూకి ఈదుతూ.. మా ఫ్రండ్స్‌తో కలిసి అలా ఎంజారు చేయటం నాకు చాలా ఇష్టం. ఆ పక్కనే రంగురంగుల సీతాకోకచిలుకలు ఎగురుతూ ఉంటాయి. అక్కడి రైతులు అన్ని రకాల పంటలు పండిస్తారు. ముగ్గురాయి, చింతపండు, సున్నపురాయి, బంక, తేనె.. ఇంకా చాలా వస్తువులు అక్కడ దొరుకుతాయి. నేను, మా ఫ్రండ్స్‌ కొండ పైకి ఎక్కేవాళ్ళం. గోతాం పట్టాలు వంటినిండా కప్పుకొని, తేనెపట్టు దగ్గర పొగ పెట్టి, తేనె తీసేవాళ్ళం. ఆ తేనెను మేం తాగటమే కాక డబ్బాల్లో పట్టి ఇళ్ళకు తెచ్చేవాళ్ళం.
ఆ ఊరికి పక్కనే సిద్ధేశ్వరం అనే ఊరు ఉంది. అక్కడున్న కొలనులో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. కొలను పక్కనే ఉన్న ఆలయం.. నంది నోటిలోనుంచి నీటి ప్రవాహం కొలనులోకి రావటం చూడటానికి అద్భుతంగా ఉంటుంది. అక్కడ మాతో పాటే నెమళ్ళు తిరుగుతాయి. ప్రకృతి మనకు వస్తువులతోపాటు ఎంతటి ఆనందాన్నిస్తుందో కదా అని నాకన్పించేది. మన సమాజంలో నిరంతరం డబ్బు.. దాని కోసం స్వార్ధం, మోసం చేసుకుంటూ పోవటమే ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు నేను అనుభవించి, ఆనందించిన ప్రకృతి అందరికీ చెందాలని, అందరూ హాయిగా స్వేచ్ఛగా ఉండాలని అనిపిస్తుంది నాకు.

యల్‌. వినోద్‌ కుమార్‌
10వ తరగతి

(‘మమ్మల్ని అర్థంచేసుకోండి’ పుస్తకం నుంచి)

➡️