మొట్టమొదటిది మాతృభాష

story on International Mother Language Day

మనిషి తన భావాలను వ్యక్తపరిచే ఒక సాధనం భాష. భూమిపై ఉన్న అన్ని జీవరాశుల్లో మానవుడు ఒక్కడే తన భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయగలుగుతాడు. మనిషి తన మనసులోని అభిప్రాయాలు, భావాలను బహిర్గతం చేసే అర్థవంతమైన ధ్వనుల సముదాయమే భాష. మనిషి జీవితంలో మొట్టమొదట నేర్చుకునేది మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలిబడి. అమ్మ మాటే మాతృభాష. పిల్లలు ఆలోచించేది, కలలు కనేది అమ్మభాషలోనే. అందుకే మాతృభాషకు, మనుసుకు దగ్గర సంబంధం ఉంటుంది. ప్రతి మనిషీ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషనూ కాపాడుకోవాలి. జీవితంలో పైకి ఎదగాలంటే ఇతర భాషలను నేర్చుకోక తప్పదు. కానీ వాటి ప్రభావం అమ్మభాషపై పడకుండా చూసుకోవాలి. మన మాతృభాషను రక్షించుకోవాలి. ఈ నెల 21వ తేదీ ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం.

మనిషి పుట్టగానే తల్లి ఒడిలో నేర్చుకునే పదాలే మాతృభాష. అవి మనిషికి ఎంతో విలువైనవి. అమ్మ పలుకులోని ఆప్యాయత అనురాగం మరెక్కడా దొరకవు. మనిషి ప్రపంచంలో అన్ని చోట్ల తాను జయించాలంటే తన మాతృభాషను గౌరవించాలి. మనస్సులోని భావాలను సహజంగా వ్యక్తం చేయగల శక్తి మాతృభాషకే ఉంది. నేడు మాతృభాషను నిర్లక్ష్యం చేస్తూ పరభాషపై వ్యామోహంతో పరుగులు తీస్తున్నారు. ఇతర భాషలను నేర్చుకోవడం అవసరమే. కానీ ఆ నెపంతో మాతృభాషను చిన్నచూపు చూడకూడదు అనేది పలువురు సాహితీవేత్తల అభిప్రాయం. బాల్యం నుంచి మాతృభాషను క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అప్పుడే మనిషి సంపూర్ణతను సాధిస్తాడని భాషాభిమానులు, సాహితీవేత్తలు చెబుతున్న మాట. ప్రపంచంలో ఎన్నో భాషల్లో నిష్ణాతులున్నప్పటికీ ప్రతి ఒక్క వ్యక్తి తన మాతృభాషలో మాట్లాడినపుడే సంతృప్తి చెందుతాడు. ఇది అక్షర సత్యం.

అభివృద్ధికి గీటురాయిగా..

ఇటీవల గవర్నర్‌ ప్రసంగం పాఠంలో కానీ, ప్రభుత్వానికి సంబంధించిన గణతంత్ర శకటంలోగానీ.. ఆంగ్లం యొక్క గొప్పతనాన్ని శ్లాఘించారు. అదే అభివృద్ధికి గీటురాయన్నంతగా ప్రాచుర్యం చేస్తున్నారు. మనిషి జీవితంలో మాతృభాష అత్యంత అనుబంధం కలిగినది. అయితే ఆంగ్లంపై సమాజంలో పెరిగిన మక్కువ, మరోవైపు కనీసం ప్రాథమిక విద్య అయినా మాతృభాషలో సాగాలన్న విద్యాకమిటీల సూచన.. వెరసి దీనికి సంబంధించిన క్లిష్ట సమస్యలు ముందుకొస్తాయి. అమ్మ భాష, ఆంగ్ల మాధ్యమం గురించి నేడు జరుగుతున్న వాదోపవాదాలు అలాంటివే! ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే జ్ఞానవంతులవుతారనీ, ఉపాధి దొరుకుతుందనీ ప్రజల మనుసుల్లో బలంగా నాటారు. చివరికి ‘అమ్మానాన్న’ అని పిలిపించుకోవడానికీ ఇష్టపడటం లేదు. ‘మమ్మీడాడీ’ అంటేనే గొప్పగా భావిస్తున్నారు. ప్రభుత్వాలు సైతం మాతృభాషను ఒక సబ్జెక్టుకు మాత్రమే పరిమితం చేశాయి. నిజానికి బతుకు, భాషా వేర్వేరు కావు. అసలు భాష పుట్టిందే బతుకు అవసరాలను తీర్చటానికి. జీవనాన్ని మరింత సులభతరం, సుఖప్రదం చేయటానికి. ఏళ్ల తరబడి విద్యారంగంలో శాస్త్రీయంగా తేవాల్సిన మార్పులు తీసుకురాలేదు. మాతృభాషకూ, బతుకుకూ మధ్య ఉన్న బంధాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. దీంతో నేడు మాతృభాషను చులకనగా చూస్తున్నారు. ఆంగ్లంలోనే అన్నీ సాధ్యమనే భావన పెరిగింది. వాస్తవానికి ఆంగ్లమే అన్నింటికీ మార్గం కాదు. అలా అని తెలుగుతోనే అంతటా వెలుగుదారి అవుతుందనేదీ సమంజసం కాదు. రెండింటి మధ్య సరైన సమన్వయం ఉండాలి.

.

నైపుణ్యమైన తర్ఫీదు లేమి.

ప్రభుత్వరంగ విద్యాసంస్థలను ప్రభుత్వమే బలహీనపర్చే చర్యలు గత కొన్నేళ్ళ్లుగా ప్రణాళికాబద్ధంగానే జరిగాయి. ఈ క్రమంలోనే ప్రయివేటు విద్యాసంస్థలు పుట్టుకొచ్చాయి. ఈ విద్యా సంస్థలు మొదటి ఆప్షనుగా ఉన్న తెలుగు మాధ్యమాన్ని క్రమేణా లేకుండా చేశాయి. ఫలితంగా ఆంగ్ల మాధ్యమం ఒక్కటే మిగిలింది. ఆ తర్వాత కుప్పలు తెప్పలుగా కార్పొరేటు విద్యాసంస్థలు విస్తరించాయి. 90వ దశకం వరకూ ఆర్డినరీ మార్కుల ఉత్తీర్ణత గుర్తించబడింది. 35% పాస్‌ మార్కులు తెచ్చుకున్నా ఫర్వాలేదు ప్రమోట్‌ కావొచ్చనే భరోసా ఉండేది. తర్వాత్తర్వాత 98% రావడమే పరమావధిగా మారింది. అనారోగ్యకరమైన పోటీతత్వం పెరిగింది. ర్యాంకుల విద్యావిధానం అమల్లోకి వచ్చింది. ‘111, 222, 333’ అంటూ ఫలితాలు రాగానే ప్రకటనలు వచ్చే ఒరవడి పెరిగింది. దీంతో భవిష్యత్తు బాగుండాలంటే ఫలానా కార్పొరేట్‌ విద్యాసంస్థల్లోనే చదవాలనే భ్రమలు నెలకొన్నాయి. విద్య సరుకుగా మారిన ప్రక్రియలో జరిగిన తతంగమే ఇదంతా. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు తీవ్ర నిర్లక్ష్యానికి గురై, నిర్వీర్యమైపోయాయి. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో నేటికీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాకుండానే విద్యా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇటీవల మంత్రి పదవీ విరమణ చేసేవారినే కొనసాగించి, ఈ విద్యా సంవత్సరం పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల లేమి గురించి చెప్పాల్సిన పనేలేదు. సేవా దృక్పథంతో ఏర్పడ్డ ఎయిడెడ్‌ విద్యాసంస్థలు నిర్వీర్యమైపోయాయి.

ఈ నేపథ్యంలో పేద, బలహీనవర్గాల పిల్లలే ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలారు. టీచర్లు లేని విద్యాలయాల్లో విద్య ఎలా ముందుకు సాగుతుంది. అందుకు తగ్గట్టే ఫలితాలూ ఉండేవి. ఆ కారణాలు పక్కనబెట్టి, తెలుగు మాధ్యమం వల్లే అనే దురభిప్రాయం కొంతమందిలో కలిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నూతన విద్యావిధానం అమలులో కేంద్ర విధానాలను అమలుచేయడంలో తొందరపాటు ప్రదర్శిస్తోంది. దీనివల్ల విద్యాలయాల షఫిలింగ్‌ ఒకరకంగా విద్యార్థుల్ని బడులకు దూరం చేశాయి. గతంలోనే ఒకటి నుంచి ఆరో తరగతి వరకూ తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ, ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టింది. ఆంగ్లమే విద్యారంగంలో అభివృద్ధి అన్నట్లు ముందుకు తెస్తోంది. సహజంగానే ఇది వివాదాస్పదమైంది. ఆంగ్ల మాధ్యమంతో పేద విద్యార్థులు సైతం మంచి అవకాశాలను అందుకుంటారన్నది ఒక వాదన. ఆంగ్ల మాధ్యమం ఒక ఆప్షనుగా ఉండాలిగానీ, తెలుగును పూర్తిగా రద్దు చేయటం తప్పని మరొక వాదన. పిల్లలు ప్రాథమిక విద్య మాతృభాషలో నేర్వడం వల్ల పునాది పడుతుందనేది వీరి వాదన.

ఈ ఏడాది థీమ్‌

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2024 యొక్క థీమ్‌ ”అంతరించిపోతున్న భాషలను సంరక్షించడం, బహుభాషావాదాన్ని ప్రోత్సహించడం మరియు భాషా వారసత్వాన్ని కొనసాగించడం కోసం లక్ష్యాలను నిర్దేశించడం”. ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు బహుభాషా (లేదా కనీసం, ద్విభాషా) అని తెలిసిన వాస్తవం మరియు వారి భాషలు వారి సాంస్కృతిక, మేధో వారసత్వాన్ని ఏర్పరుస్తాయి. బహుభాషా విద్య, మాతృభాషలో స్వేచ్ఛా వ్యక్తీకరణను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. భాషా వైవిధ్యాన్ని పెంపొందించుకోవడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ భాషా సంప్రదాయాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఈ రోజు ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తుంది.

అమ్మ భాషలోనే అభివృద్ధి..

అసలు పిల్లలకు విద్యాబోధన ఏ మాధ్యమంలో సాగాలనేది ఎప్పటి నుంచో సాగుతున్న చర్చ. ముఖ్యంగా బ్రిటీషు పాలిత దేశాల్లో ఈ చర్చ ఎక్కువ. మిగతా దేశాల్లో ఇలాంటి గొడవకు ఆస్కారమే లేదు. ఎందుకంటే, అక్కడ వారికి మాతృభాషలో బోధన తప్ప, మరొక మాధ్యమం గురించిన చర్చే అవసరం లేదు. ప్రపంచంలో అత్యధికుల మాతృభాష మాండరిన్‌ (చైనీస్‌). దాదాపు 111.7 కోట్ల మంది ఆ భాషలోనే విద్యాభ్యాసం సాగిస్తారు. ఇంగ్లీషు లేనందువల్ల చైనా ఇప్పుడు వెనకబడిపోలేదు. అత్యంత అభివృద్ధి రేటును సాధిస్తూ మున్ముందుకు పోతోంది. సైన్సు అండ్‌ టెక్నాలజీ, ఐటి, రోబోటిక్‌, నిర్మాణం, విద్యా వైద్య రంగాల్లో అద్భుతంగా దూసుకుపోతోంది. ఆ దేశంలో అసలు ఇంగ్లీషు లేదని, దాని అవసరం లేదని కాదు. ఎవరికి అవసరమో వారికి నేర్పిస్తారు. అలాగే ఇతర భాషల్లో ఉన్న విజ్ఞానాన్ని, ఆధునిక ఆవిష్కరణల పరిజ్ఞానాన్ని తమ భాషలోకి తక్షణమే అనువాదం చేసి, విద్యార్థులకు అందిస్తారు. తమ అవసరాలకు అనుగుణంగా ఆ విజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. విద్యారంగంలో అనేక ప్రగతిదాయక ప్రయోగాలు చేస్తున్న దేశం ఫిన్లాండు. అత్యంత చిన్ని దేశం. పిల్లలకు ఒత్తిడి లేని చదువును అందిస్తోంది. పిల్లల సొంత ఆలోచనలకు, ఆవిష్కరణలకు అత్యంత ప్రాధాన్యాన్ని ఇస్తోంది. ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలిగిన విజ్ఞాన నైపుణ్యాలను ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు అందిస్తోంది. ఇదంతా జరుగుతున్నది వారి మాతృభాష ఫిన్నిష్‌లోనే. జర్మను, జపాన్‌, రష్యా, పోర్చుగీసు, స్విట్జర్లాండు వంటి దేశాలన్నీ తమ పిల్లలకు విద్యాబోధన చేస్తున్నది వారి సొంత భాషలోనే. ఈ దేశాలేవీ అనామకమైనవి కాదు. అనేక రంగాల్లో అత్యద్భుత ఫలితాలను సాధించినవి, సాధిస్తున్నవి.

చరిత్రలోకి చూస్తే..

ప్రపంచంలో దాదాపు 7,151 భాషలు మాట్లాడుతున్నారు. అయితే ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషలు అరబిక్‌, చైనీస్‌, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, రష్యన్‌, స్పానిష్‌. ప్రపంచంలో మాండరిన్‌ భాషను వందకోట్ల మందికి పైగా మాట్లాడుతుంటే, కేవలం ఒకే ఒక్కరికి మాత్రమే తెలిసిన భాషలు 46 ఉన్నాయి. భాషా వైవిధ్యం మన సాంస్కృతిక వారసత్వం యొక్క ప్రాథమికాంశం. ప్రతి భాష ఒక ప్రత్యేక చరిత్ర, గుర్తింపును కలిగి ఉంటుంది. దానిని ఉపయోగించే కమ్యూనిటీల సంప్రదాయాలు, విలువలను ప్రతిబింబిస్తుంది. ప్రపంచభాషల్లో దాదాపు ఇప్పుడు 40% భాషలు అంతరించిపోతున్నాయి. ఏ భాషనైనా ఒక తరంలోని పిల్లలు 30 శాతానికి మించి చదవకపోయినా, మాట్లాడకపోయినా- అది కొన్నేళ్ల తర్వాత అంతరించిపోతుందని యుఎన్‌ఒ అంచనా. మాతృభాషలో బోధన లేకుండా పోతే- భవిష్యత్తులో తెలుగుకు కూడా అలాంటి పరిస్థితి దాపురిస్తుందేమోనని ఆందోళన. ఒక భాషను, సంస్కృతిని కాపాడుకోవటం ఆ భాషా పౌరుల అందరి బాధ్యత. ప్రభుత్వాలది ప్రప్రథమ బాధ్యత. తరచుగా వెయ్యి కంటే తక్కువ మాట్లాడేవారు మిగిలి ఉన్నాయి. ప్రపంచ జనాభాలో సగానికిపైగా ప్రజలు 23 భాషలు మాత్రమే మాట్లాడుతున్నారు.

కాబట్టి ప్రభుత్వ, కార్పొరేటు పాఠశాలలు రెండింటిలోనూ ప్రాథమిక విద్యను అమ్మభాషలో బోధించటం తప్పనిసరి అవసరం. ఈ రోజుల్లో కొన్ని భాషల ప్రపంచ ప్రభావంతో, అనేక మాతృభాషలు కనుమరుగవుతున్నాయి. అవి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల సాంస్కృతిక, మేధో వారసత్వానికి ముప్పు వాటిల్లుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన భాషలకు ప్రాధాన్యత ఉన్నప్పుడు బహుభాషా ప్రజలు తమ ప్రాంతీయ భాషల ప్రాముఖ్యత ఎలా తగ్గిపోతుందో అర్థంచేసుకుంటారు. ప్రపంచంలోని అన్ని భాషలను సంరక్షించడం అనేది సంస్కృతి, సంప్రదాయాలను రక్షించడానికి అత్యవసరం. దానిని ప్రోత్సహించడానికి ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవా’న్ని 1999లో స్థాపించారు.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రఫీకుల్‌ ఇస్లాం, అబ్దుస్‌ సలామ్‌ అనే ఇద్దరు భాషా ఉద్యమకారుల ఆలోచన. వీరు 1998లో ప్రపంచ భాషలను అంతరించిపోకుండా కాపాడేందుకు ఈ దినోత్సవాన్ని పాటించాలని సిఫార్సు చేశారు. ప్రతిపాదిత రోజు చారిత్రక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. ఇది బంగ్లాదేశ్‌లో (అప్పటి తూర్పు పాకిస్తాన్‌) 1952లో జరిగిన విషాద హత్యలను గుర్తు చేస్తుంది. 1947లో భారతదేశం-పాకిస్తాన్‌ విభజన తర్వాత బంగ్లాదేశ్‌ పాకిస్తాన్‌తో విలీనం చేయబడింది. పాకిస్తాన్‌ ప్రభుత్వం 1947 నుండి 1971 వరకు దేశాన్ని నియంత్రించింది. 1948లో బెంగాలీ ఎక్కువ మంది మాట్లాడే భాష అయినప్పటికీ ఉర్దూను ఏకైక జాతీయ భాషగా ప్రకటించింది. జనాభా ఇది అశాంతిని సృష్టించింది. దేశంలోని జాతీయ భాషలలో బెంగాలీ ఒకటి కావాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. అయితే, పిటిషన్‌ను స్వీకరించలేదు. సమావేశాలు, ర్యాలీలు నిషేధించబడ్డాయి. ఇది ప్రజా ఉద్యమాన్ని ఆపలేక పోయింది. పైగా ప్రజా సహకారంతో ఢాకా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు మరిన్ని సమావేశాలు, ర్యాలీలను ఏర్పాటు చేశారు. 21 ఫిబ్రవరి 1952 దురదృష్టకరమైన రోజు. పోలీసులు ఈ ర్యాలీలలో ఒకదానిపై కాల్పులు జరిపారు. వందలాది మంది ప్రాణనష్టానికి కారణమయ్యారు. నవంబర్‌ 1999లో యునెస్కో మాతృభాషలను రక్షించడానికి, అందుకోసం బంగ్లాదేశ్‌లో తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవడానికి ఫిబ్రవరి 21వ తేదీని ప్రపంచవ్యాప్తంగా ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా ప్రకటించింది.

అనేక చోట్ల.. వివిధ మార్గాల్లో..

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని వివిధ మార్గాల్లో జరుపుకుంటారు. ఏదేమైనప్పటికీ మాతృభాషల గురించి అవగాహనను వ్యాప్తి చేయడం, కలుపుకొనిపోవడాన్ని ప్రోత్సహించడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఆలోచన. బంగ్లాదేశ్‌కు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంతో చారిత్రాత్మక అనుబంధం ఉన్నందున, విషాదకరమైన కాల్పులను స్మరించుకోవడానికి, తమ మాతృభాష కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను గౌరవించడానికి దీనిని పాటిస్తారు. ప్రపంచ స్థాయిలో, బహుభాషా విద్య గురించి అవగాహన కల్పించడానికి, ప్రోత్సహించడానికి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఉంది. అంతర్జాతీయ మాతభాషా దినోత్సవం గురించి వివిధ అంశాలపై పరిశోధన చేయడం, సోషల్‌ మీడియా ద్వారా సమాచారాన్ని పంచుకోవడం, బహుభాషా వాదంపై ఉపన్యాసాలు, ఈవెంట్స్‌ లేదా వర్క్‌షాప్‌లకు హాజరుకావడం వంటి ఏదైనా సామర్థ్యంలో ఒకరు పాల్గొనవచ్చు. సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనడం, వివిధ భాషలలో, మాతృభాషలో తీసిన చలనచిత్రాలు, రాసిన పుస్తకాలను ప్రచారం చేయడం మాతృభాష వినియోగాన్ని ప్రోత్సహించడం, కొత్త భాషను నేర్చుకోవడం వంటివి ఈ రోజును జరుపుకోవడానికి మరికొన్ని మార్గాలు.మనం కొన్ని భాషల గురించి ఏవైనా పక్షపాతాలను మార్చుకోవాలి. మన గ్రహం మీద ఉన్న అనేక విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలను పెంపొందించుకోవడానికి కలుపుకునే వాతావరణాన్ని సృష్టించాలి అనే సందేశాన్ని ప్రతిధ్వనిస్తుంది. అలా చేయడం ద్వారా, ఒకరి మాతృభాషలో వ్యక్తీకరించే స్వేచ్ఛను విస్తరించడం ద్వారా, ఉపాధి, వృద్ధి అవకాశాలు సృష్టించబడతాయి. తద్వారా ప్రతి ఒక్కరూ వారి సంస్కృతి, వారి దేశాబివృద్ధికి సహకరించే అవకాశం ఉంది.

వాదనలు.. మంచి, చెడులు..

మన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అనేక వాదోపవాదాలు నేటికీ జరుగుతున్నాయి. ఇది అవసరమైన స్పందనే! ఇందులో సహజంగానే ఆంగ్ల మాధ్యమంపై అనుకూల, ప్రతికూల వాదనలు ఉన్నాయి. మంచిచెడ్డలు చర్చిస్తూ.. ఆలోచింపజేసే పోస్టులూ చాలా వస్తున్నాయి. ఏదొక వైపు మాత్రమే మొగ్గి, చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలూ కొన్ని ఉన్నాయి. బిజెపి నేతలైతే ఏకంగా ‘ఆంగ్ల మాధ్యమం పెట్టటం ఒక మతానికి అనుకూలంగానే!’ అని తీవ్ర వ్యాఖ్య చేశారు. ప్రతి అంశాన్ని మతంతో ముడిపెట్టి రెచ్చగొట్టే కాషాయీకరణ ధోరణి అది. బిజెపి హిందీని దేశం మొత్తం మీద రుద్దాలని చూడడం ఎందుకోసమో ఆ పార్టీ సమాధానం చెప్పాలి.

  • ఆంగ్ల మాధ్యమానికి అనుకూలంగా ఉన్న కొందరు.. తెలుగు మాధ్యమం ఉండాలనే వారిని కుట్రదారులుగా, మనువాదులుగా పేర్కొనటం మరొక విపరీత ధోరణి. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలనేది ఒక శాస్త్రీయ దృక్పథం. అది కార్పొరేటు విద్యాసంస్థల్లోనూ అమలు చేయాలనేది వారి వాదన. కానీ అలా కోరటమే ఘోరం అన్నట్టు మాట్లాడటం సరైంది కాదు.
  • కొందరు తెలుగు భాష మాత్రమే అభివృద్ధికి సోపానం అన్నట్లు భావిస్తున్నారు. అంతా తెలుగులోనే జరగాలనేది వారి ఆవేదన. కానీ అందుకనుగుణంగా అన్నింటా ఆ మార్పు జరగాలి. ప్రపంచ విజ్ఞానం మాతృభాషలో అందించే ఏర్పాటు చేయాలి.
  • నిజానికి విద్యార్థులు మంచి ఫలితాలను పొందాలంటే స్కూళ్లలో బోధకులు సరిపోనూ ఉండాలి. ప్రాథమిక వసతులు కల్పించటం అన్నింటికన్నా చాలా ముఖ్యం. రానున్న కాలంలో వాటిపై గొంతెత్తాలి. అలా మాట్లాడేవారికి మద్దతుగా నిలవడం మీడియా బాధ్యత.

మన దేశం.. మన తెలుగు..

మన దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు అనేక భాషలు మాట్లాడతారు. దేశంలో కనీసం 800 భాషలు, 2000 వరకూ యాసలు ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలకు హిందీ, ఇంగ్లీషు భాషలనే వాడాలని నిర్దేశించింది. మాతృభాష అంతరించిపోయే ప్రమాదాన్ని పసిగట్టిన యునెస్కో ప్రజల జాతీయ, పౌర, రాజకీయ, సాంఘిక, ఆర్థిక సాంస్కృతిక హక్కుల్లో అమ్మభాష అంతర్భాగమని నిర్వచించింది. మనదేశంలో హిందీ తరువాత తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు.

అమ్మభాషతోనే అప్రతిహతంగా..

ప్రపంచంలోని చాలా దేశాలు మాతృభాషలోనే బోధిస్తున్నాయి. ప్రస్త్తుతం ప్రపంచ భాషగా వర్థిల్లుతున్న ఆంగ్లానికి ఈ ప్రాభవం ఉన్నది అమెరికా, బ్రిటన్‌తో పాటు ఒకప్పటి బ్రిటీషు పాలిత దేశాల్లోనే! ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే భాష మాండరిన్‌ (చైనీస్‌). 111.7 కోట్ల మంది ఈ భాష మాట్లాడతారు. తర్వాతి స్థానం 46 కోట్ల మంది మాట్లాడే స్పానిష్‌. 38 కోట్ల మంది మాట్లాడే ఇంగ్లీషుది మూడో స్థానం. ఏ భాషలో గొప్ప విజ్ఞానం ఉన్నా, దానిని మన భాషలోకి తర్జుమా చేసుకోవటం మేలైన పని. చైనా, జపాన్‌, జర్మనీ వంటి దేశాలు ఈ దారిని అనుసరిస్తే, మనం మాత్రం ఆంగ్లంలో విద్యార్జనకు అంగపంగలు వేస్తూ పరిగెడుతున్నాం. ఆంగ్లమే కాదు, ఏ పరభాష నేర్చుకున్నా తప్పు కాదు. కానీ అమ్మ భాషను విస్మరించటమే తప్పు. ఒక భాష నిర్వీర్యమైతే, ఆ భాషకు సంస్కతి కూడా ఆ ప్రభావంతో వైవిధ్యాన్ని కోల్పోతుంది. దీర్ఘకాలికంగా చూసినప్పుడు అది మన అస్తిత్వానికి హానికరం. భాష ప్రాతిపదికనే మన రాష్ట్రాలు ఏర్పడ్డాయి. భాషకు సంబంధించిన ప్రేరణతోనే బంగ్లాదేశ్‌ పాకిస్తాన్‌ నుంచి స్వాతంత్య్రం పొందింది. భాషా సంస్కృతుల ఉద్దీపనతోనే తెలంగాణా ప్రజలు పోరాడి నిజాం అరాచక పాలన నుంచి విముక్తిని సాధించారు. మాతృభాష వ్యక్తీకరణకు ఒక సాధనం మాత్రమే కాదు.. తరతరాలుగా నడిచొచ్చిన మార్గం. మనదైన విజ్ఞానవికాసాలు వర్థిల్లిన ప్రాంగణం. అందుకని మాతృభాష తెలుగును కాపాడుకుందాం. మరింత తెలుసుకోవడానికి ఆంగ్ల భాషనూ గౌరవిద్దాం. మాతృభాషను మృతభాషను కాకుండా కాపాడాలి. అమ్మభాషను ప్రపంచానికి తెలియజేయడానికి ఆంగ్లం ఒక ఉపకరణం. ఆ విధంగా సమన్వయం, సముపార్జన జరగాలి. మన పిల్లలు గొప్ప విజయాలు సాధించాలి.

  • నవ్యసింధు, 8333818985
➡️