ఆవకాయ వెరైటీగా పెట్టేద్దాం..

May 12,2024 12:26 #ruchi, #Sneha

ఎన్ని రుచులన్నా అవేవీ ఆవకాయకు సాటి రావు. వేసవి అనగానే ఆవకాయలు.. ఊరగాయలు నోరూరిస్తాయి. ఈ ఆవకాయ మీద అనేకమంది వారి అభిరుచుల్ని తమ రచనల్లో వ్యక్తీరించారు. కవితలు, పాటలు, కావ్యాల రూపంలో ఆవకాయకు పెద్దపీట వేశారు. అలాగే ఈ ఆవకాయ రుచులు పూర్వకాలం నుంచి వస్తున్నవే.. అనంతరం వచ్చిన కొత్త రుచులు ఏవైతేనేం మామిడితో రకరకాల ఆవ రుచులు జాడీలలోకి వచ్చేశాయి. మరి మనమూ ఆ వెరైటీలు ఎలాగో తెలుసుకుని, పెట్టేద్దాం..

పులిహోర ఆవకాయ..


కావలసినవి : మామిడికాయ ముక్కలు – 8 కప్పులు, మెంతిపొడి – 1/2 స్పూను, ఆవ పొడి – 11/2 స్పూను, నువ్వుల పొడి – 11/2 కప్పులు, నువ్వుల నూనె -11/2 కప్పులు, ఉప్పు – కప్పు, కారం – కప్పు, పసుపు -1/2 స్పూను
తాలింపుకు : శనగపప్పు – 2స్పూన్లు, మినప్పప్పు – 2 స్పూన్లు, ఆవాలు – స్పూను, జీలకర్ర – స్పూను, ఇంగువ – 1/2 స్పూను, ఎండుమిర్చి -4
తయారీ : మామిడికాయలను చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వాటికి ఉప్పు, పసుపు పట్టించి నాలుగుగంటలు ఎండలో పెట్టాలి. తర్వాత బాండీలో నూనె వేడిచేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి దినుసులన్నీ వేసి దోరగా వేయించాలి. తాలింపు చల్లారిన తర్వాత దానిలో ఎండబెట్టిన మామిడి ముక్కలు, మెంతిపొడి, ఆవ పొడి, నువ్వుల పొడి, కారం, అన్నీ కలిపి పచ్చడి జాడీలో పెట్టుకోవాలి. అంతే పులిహోర మామిడి కాయ పచ్చడి రెడీ. ఇది సంవత్సరమంతా నిలువ ఉంటుంది. పులిహోర వాసనతో ఘుమఘుమలాడుతూ నోరూరిస్తుంది.

బెల్లంతో..


కావలసినవి : మామిడి ముక్కలు – 2 కేజీలు, మెంతిపొడి – 1/2 కప్పు, ఆవ పొడి – 2 కప్పులు, బెల్లం – 3/4 కేజీ, ఉప్పు -11/2 కప్పులు, కారం – 2 కప్పులు, పసుపు -1/2 స్పూను, నువ్వుల నూనె – కేజీ.
తయారీ : ఒక వెడల్పు గిన్నెలో మామిడి ముక్కలు, మెంతిపొడి, ఆవ పొడి, బెల్లం, ఉప్పు, కారం, పసుపు అన్నీ ప్రతి ముక్కకు పట్టేలా కలపాలి. మూత పెట్టి ఒకరోజు అలా ఉంచేసి రెండో రోజు మరలా కలపాలి. పచ్చడి కాస్త జారుగా వస్తుంది. దానికి నువ్వుల నూనె కలిపి జాడీలో పెట్టుకోవడమే. అంతే తీపి పులుపు కారం రుచులతో మామిడి బెల్లం పచ్చడి రెడీ.

నువ్వులతో..


కావలసినవి : మామిడి ముక్కలు – కేజీ, నువ్వులు – 250 గ్రా., మెంతిపొడి – స్పూను, జీలకర్ర పొడి – స్పూను, ఆవాలు – 100 గ్రా, ఉప్పు – 250 గ్రా, పసుపు -1/2 స్పూను, నువ్వుల నూనె – 1/2 కిలో. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – 250 గ్రా. (అల్లం 125 గ్రా, వెల్లుల్లి -125 గ్రా)
తాలింపుకు : ఆవాలు – స్పూను, మెంతులు – స్పూను, జీలకర్ర – స్పూను దోరగా వేయించాలి. కాస్త చల్లారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు చేర్చి నూనెలో వేగుతూ కలిసేలా కలపాలి.
తయారీ : ముందుగా నువ్వులు, ఆవాలు, మెంతులు, జీలకర్ర విడివిడిగా వేయించుకుని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. నువ్వులు, ఆవాలు వేడిమీద మిక్సీ పడితే నూనె బయటికి వచ్చి ముద్దగా అవుతుంది. మామిడికాయలను మనకు కావలసిన సైజులో ముక్కలుగా కోసుకోవాలి. వెడల్పు గిన్నెలో ముక్కలు, నువ్వులు, ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడులు, ఉప్పు, పసుపు ప్రతి ముక్కకూ పట్టేలా కలపాలి. దీనికి చల్లారిన తాలింపు నూనెతో సహా కలపాలి. అంతే.. నువ్వుల మామిడి ఆవకాయ రెడీ. ఇది కారం కలపని వెరైటీ ఆవకాయ. రుచి అమోఘం.

తొక్కుడు ఆవకాయ..


కావలసినవి : మామిడి కాయలు – 5, వెల్లుల్లి – 10 రెబ్బలు, కారం – కప్పు, ఉప్పు – 1/2 కప్పు, పసుపు – స్పూను, ఆవపిండి – 1/2 కప్పు, మెంతి పొడి – 2 స్పూన్లు, నూనె – 1/4 కేజీ
తాలింపు : ఆవాలు – 1/2 స్పూను, పచ్చిశనగ పప్పు – స్పూను, మినప్పప్పు – స్పూను, మెంతులు – 1/4 స్పూను, దంచిన వెల్లుల్లి – స్పూను, ఎండుమిర్చి – 5. బాండీలో నూనె వేడిచేసి దినుసులన్నింటినీ దోరగా వేయించాలి.
తయారీ : మామిడి ముక్కలను చిన్నగా దంచుకుని ఒక వెడల్పు గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని దంచుకుని మామిడి తొక్కులో వేసుకోవాలి. దానికి కారం, ఉప్పు, ఆవ మెంతి పొడి, పసుపు ముక్కలన్నింటికీ పట్టించాలి. చల్లారిన తాలింపును దీనికి కలిపి జాడీలో పెట్టుకోవడమే. అంతే ఘుమఘుమలాడే మామిడి తొక్కుడు పచ్చడి రెడీ.

➡️