అర్థం చేసుకుందాం.. అండగా నిలుద్దాం..

పసితనాన్ని బేల చూపులకు పరిమితం చేస్తుంది ఆటిజం. పిల్లలు పెరిగే కొద్దీ కన్నవారికి కలవరపాటే! ఆందోళనలను, అపోహలను పక్కనపెట్టి అండగా నిలిస్తే ఆ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారదనేది మానసిక నిపుణుల మాట. కొందరు పిల్లలు ఎన్నిసార్లు పిలిచినా పలకరు. ఎప్పుడూ ఏదో లోకంలో ఉన్నట్టు వ్యవహరిస్తారు. ఇతరులతో మాట్లాడరు. భావ వ్యక్తీకరణలో ఇబ్బందులకు గురవుతారు. పెద్దపెద్ద శబ్దాలు చేస్తుంటారు. ఇవన్నీ ఆటిజం లక్షణాలే. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న పిల్లలు మన చుట్టూ ఉన్నారు. వారిని చూసి సహజంగా జాలి పడుతుంటాం. నిజానికి, ఆటిజం జబ్బు కాదు. నాడీవ్యవస్థ వైఫల్యంతో ఈ పరిస్థితి వస్తుందని పరిశోధకులు తేల్చారు. గర్భిణిగా ఉన్నపుడు తల్లి ఆరోగ్య పరిస్థితి, టీకాలు వికటించడం, అసలు టీకాలే తీసుకోకపోవడం.. తదితర కారణాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు.. జన్యు లోపాలు.. బిడ్డకు ఆటిజం వచ్చే ఆస్కారం ఉంది. ఆటిజం నిర్ధారణ కాగానే.. బెంబేలెత్తిపోవాల్సిన పనిలేదు. ఆటిజంతో బాధపడుతున్న వారి జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు, ప్రజలంతా సహాయం చేయవలసిన అవసరాన్ని తెలియజేస్తూ ఐక్యరాజ్యసమితి ‘ప్రపంచ ఆటిజం అవేర్‌నెస్‌ డే’ నిర్వహిస్తుంది. ఈ పిలుపుతో ప్రపంచ దేశాలు ఏప్రిల్‌ 2న ఆటిజం పిల్లల అభివృద్ధికి, వారి హక్కులు తెలియజేస్తూ అవగాహనా కార్యక్రమాలు జరుపుతున్నారు. దీనిపైనే ఈ ప్రత్యేక కథనం..

సమస్యను త్వరితంగా గుర్తించి, పరిష్కారాలు అన్వేషించాలి. ఆటిజం పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువ. దీంతో తరచూ జబ్బుపడే ప్రమాదం ఎక్కువ. వీరికి ఎలాంటి దుష్ప్రభావాలు లేని చికిత్సలు ఇవ్వాలి. వారి అవసరాలు, మానసిక సామర్థ్యం ఆధారంగా ఆలనాపాలనా చూసుకోవాలి. ప్రేమతో చెప్పాలి.. ఆసక్తులను గమనించి, ఆ రంగంలోనే శిక్షణ ఇవ్వాలి. తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆటిజం చిన్నారులను మేటి పౌరులుగా తీర్చిదిద్దవచ్చు. వారికంటూ ఓ ప్రపంచాన్ని నిర్మించి ఇవ్వవచ్చు. కన్నవారిగా మన బాధ్యత కూడా.
ప్రస్తుత కాలంలో మానసిక ఎదుగుదల లోపం కారణంగా చాలా మంది పిల్లలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో ఆటిజం సమస్య ఒకటి. వయస్సుకు తగ్గట్లు పిల్లల్లో రావాల్సిన మానసిక ఎదుగుదల లేని పరిస్థితినే ఆటిజం అంటారు. ఈ సమస్య బాల్యంలో ప్రారంభమయ్యే జీవితకాల నాడీ సంబంధిత రుగ్మత (న్యూరోలాజికల్‌ డిజార్డర్‌). ఇది చాలా అరుదైన సమస్యైనా ప్రతి వంద మంది పిల్లల్లో ఒక్కరికి వస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఆటిజం లక్షణాలు మూడేళ్ల వయస్సు నిండక ముందే కనిపిస్తాయి. లింగ భేదంతో సంబంధం లేకుండా వచ్చే సమస్య. నిజానికి ఇది పెద్ద ప్రమాదం కానప్పటికీ దీనిని నివారించడంలోనే అనేక సవాళ్లను తల్లిదండ్రులు ఎదుర్కోవాలి. ఇలాంటి పిల్లల్ని జీవితాంతం భరించాలని, నిత్యం కనిపెట్టుకుని ఉండాలని, జనం చీదిరించుకుంటారని, చిన్నతనంగా చూస్తారని.. ఇలా రకరకాల ఆలోచనలతో కుంగిపోతుంటారు. వీరి కోసం ప్రత్యేకంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఇలాంటి పిల్లలకి తల్లిదండ్రులే కాదు, కుటుంబం, బంధువులు, సమాజం అండగా నిలబడాలి.


కారణాలు..
పిల్లలు పుట్టిన తర్వాత మూడు నెలలకు ‘ఊ..’ కొట్టడం, నవ్వడం.. చెప్పిన మాటలకు స్పందించడం చేస్తూంటారు. కానీ ఆటిజం పిల్లల కదలికల్లో తేడా ఉంటుంది. దీనికి ప్రధాన కారణాలు జన్యుపరమైనవీ అయ్యిండొచ్చు. దీనివల్ల పిల్లల మానసిక ఎదుగుదల సరిగా లేక, సాధారణ జీవితం గడపడం కష్టమవుతుంది.

  •  స్త్రీలు గర్భధారణ సమయంలో ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడడం, గర్భిణిగా ఉన్నప్పుడు తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం.
  •  మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్‌, డోపమిన్‌ వంటి రసాయనాలు తగినంత విడుదల కాకపోవడం.
  • నెలలు నిండకుండా శిశువు పుడితే కూడా ఆటిజానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించాలి.
  •  తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని గడపలేకపోవడం వల్ల ఆటిజం సమస్య వచ్చే అవకాశం ఉంది.

లక్షణాలు..
సాధారణంగా శిశువులు ఏడాది వయసులో పాకడం, నడవడం, నవ్వడం, ముద్దు ముద్దుగా మాట్లాడటం, తల్లిదండ్రుల పిలుపునకు బదులివ్వడం వంటివి చేస్తుంటారు. కానీ ఆటిజం సమస్య ఉన్న కొంతమంది పిల్లల్లో ఈ లక్షణాలు ఏవీ కనిపించవు. ఈ కింది లక్షణాలు కలిగి ఉంటారు.
వయస్సుకు తగ్గట్లు మానసిక పరిపక్వత లేకపోవడం, ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండడం, నేరుగా కళ్లల్లోకి చూడలేకపోవడం, స్పష్టంగా మాట్లాడలేకపోవడం, ఇతరులతో కలవడానికి ఇష్టపడకపోవడం, చేసిన పనులనే మళ్లీ మళ్లీ చేస్తుండడం, ఎలాంటి అనుభూతిని కూడా తెలపలేకపోవడం, గాయాలు తగిలినా తెలుసుకోలేకపోవడం, శబ్దాలను పట్టించుకోకపోవడం, కారణం లేకుండా ఏడుస్తూ ఉండడం, పిలిచినా-ఎవర్ని చూసినా పట్టించుకోకపోవడం వంటి లక్షణాలను కలిగి ఉంటారు.

 


సేవలు చేస్తూ..
విశాఖపట్నంకు చెందిన సుచిత్రకు నలుగురు తోబుట్టువులు. ఒక అక్క ఆటిజం సమస్యతో పుట్టింది. ఆమెతో పాటే సుచిత్ర చదువంతా బధిరుల పాఠశాల్లోనే కొనసాగింది. అక్కతో కలిసి బాల్యమంతా ప్రత్యేక అవసరాలు గల పాఠశాల్లో చదివారు. అక్కడే సంజ్ఞల లాంగ్వేజ్‌ నేర్చుకున్నారు. అప్పుడు ఆమె అనుభవించిన మానసిక వేదనే ‘ప్రజ్వల వాణి’ సంస్థకు పునాది అయ్యింది. సమాజంలో ఆటిజం ఉన్న పిల్లలు ఎలాంటి వివక్షకు గురవుతున్నారో తెలుసుకుని, వారి కోసం స్వచ్ఛంద సంస్థ స్థాపించారు. చదువుతో పాటు వారి అవసరాలు వారే తీర్చుకునేలా ఉపాధి మార్గం చూపుతున్నారు. కుట్లు, అల్లికలు, కంప్యూటర్‌ కోర్సు, వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహిస్తూ వారిపై వారికి నమ్మకం కలిగేలా శిక్షణ ఇస్తున్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
ఆటిజం పిల్లల్ని అర్థం చేసుకోవడం, వారిని అన్నివిధాలా ప్రోత్సహిస్తే సాధారణ పిల్లల్లా ముందుకు వెళతారు. ఈ విషయం తెలుసుకున్న సరిపల్లి కోటిరెడ్డి, శ్రీజారెడ్డి దంపతులు ‘పినాకిల్‌ బ్లూమ్స్‌’ సంస్థను నెలకొల్పారు. తెలంగాణకు చెందిన వీరికి ఆటిజంతో బాధపడుతున్న పిల్లవాడు పుట్టాడు. మొదట్లో చాలా బాధపడ్డారు. కానీ ధైర్యంతో తమ బిడ్డపై ఉన్న ప్రేమానురాగాలతో అతడిని సమాజానికి తగ్గట్టుగా తన కాళ్లపై తాను బతికే విధంగా తయారుచేయాలని సంకల్పిస్తున్నారు. ‘పినాకిల్‌ బ్లూమ్స్‌’ సంస్థను స్థాపించి, ఎందరో ఆటిజం పిలల్లకు సేవలు అందిస్తున్నారు. ఇలాంటి సమస్య ఉన్న వారిని వేరేలా చూడకుండా మనతో సమానంగా చూడగలిగే చైతన్యం ప్రతి ఒక్కరిలోనూ రావాలి. ఇటువంటి ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. స్కూళ్లు ఏర్పాటు చేసి.. తోడుగా, అండగా నిలబడాలి.

పెరుగుతున్న సమస్య
ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులు 1995 లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 500 మంది ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులలో అనేక అలవాట్లు, ఆహారంలో మార్పు కారణంగా ఆటిజమూ పెరుగుతూ వచ్చింది. 2019 నాటికి ఈ సమస్య మరింత పెరిగిందని అధ్యయనాలు వెల్లడించాయి. ఇది పైకి కనిపించే సమస్య కాకపోవడంతో అందరూ దీనిని గుర్తించడంలో ఆలస్యం జరుగుతుంది. దానితో సమస్య మరింత పెరిగిపోతుంది. దీనిపట్ల చదువుకున్న వారిలోనూ అంత పరిజ్ఞానం లేకపోవడంతో దీనిని గమనించ లేకపోతున్నారు. దాదాపు దీనిని గుర్తించిన వారికి తప్ప, మరొకరికి ఈ విషయంపై అవగాహన లేకపోవడం సమస్యను పెద్దది చేస్తుంది. దీనికి పరిష్కారంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని 2008లో ఐక్యరాజ్యసమతి నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఒక థీమ్‌తో జనాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అధిగమించే మార్గాలు..
ఆటిజంను నివారించడానికి తల్లులు అనేక చర్యలు తీసుకోవాలి. ఆటిజం సమస్యలను ముందుగానే గుర్తించడానికి సాధారణ ప్రినేటల్‌ చెకప్‌లు చేయించుకోవడమే కాక – కడుపులోని బిడ్డ ఎదుగుదలనూ నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామాలు చేయాలి. ధూమపానం, ఆల్కహాల్‌, డ్రగ్స్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి. తల్లులు నిర్దిష్ట పోషకాలు, సప్లిమెంట్లను డాక్టర్‌ సూచన మేరకు తీసుకోవాలి. దాంతో పిల్లలలో ఆటిజం ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
గర్భధారణ సమయంలో వాయు కాలుష్యం, పర్టిక్యులేట్‌ పదార్థాల ప్రభావానికి గురికాకుండా చూసుకోవాలి. అనారోగ్యాలను నియంత్రించే టీకాలు సైతం తీసుకుంటూ ఉండాలి. శిశువు కదలికలకు సంబంధించి, ఏవైనా అనుమానిత లక్షణాలను గమనించినట్లయితే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించడం ఉత్తమం. వీటితో పాటు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ ఉండాలి. వారు సాధారణంగా ప్రవర్తించకపోతే వెంటనే అప్రమత్తం కావడమూ చాలా ముఖ్యం. పిల్లలకి ఆటిజం ఉన్నట్లు నిర్ధారణ అయితే, కొన్ని ప్రత్యేక ముందస్తు చర్యల ద్వారా వారిలో సామాజిక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలి. వైద్యుల సలహా మేరకు ఆటిజంకు చికిత్స తీసుకుంటూ మరిన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య నుంచి పిల్లల్ని కాపాడుకోవచ్చు.

 

– డాక్టర్‌ ఎన్‌. శ్రీకాంత్‌
ఎండి (పీడియాట్రిక్స్‌), పిజిపిఎన్‌
(బోస్టోన్‌, యుఎస్‌ఎ),
సీనియర్‌ కన్సల్టెంట్‌ పీడియాట్రిషియన్‌ అండ్‌ నియోనాటాలజిస్ట్‌.

 

  • పద్మావతి, 94905 59477
➡️