వయసు దాటిన ప్రేమ

Feb 11,2024 09:00 #Sneha, #Stories
Love beyond age

సూర్య విషయం ఎప్పుడో చెబుదామని అనుకున్నా ఇంట్లో పెళ్లి హడావిడి మొదలు పెట్టే సరికి ఇంకా తప్పదు అన్నట్లు తన అభిప్రాయాన్ని దాచుకోకుండా చెప్పేసింది దీప. దీప తండ్రి సర్వేశ్వర రావు ‘మన వాళ్లేనా’ అని అడిగాడు మొదట ప్రశ్నగా..

‘ఆ సూర్యకి ఆస్తి పాస్తులు ఉన్నాయా?’ అని దీప తల్లి నిర్మల మరో ప్రశ్న.

‘అవేమీ తెలియదమ్మా ప్రేమకు అవే కొలమానం కాదు కదా. బాగా చూసుకుంటారు అనే నమ్మకం ఉంటే సరిపోతుంది కదా. చాలా రోజులు ఒకే ఆఫీస్‌లో పని చేస్తున్నాం. ఎప్పుడూ తన పని తను చేసుకుంటూ ఉంటాడు తప్ప నాకు తెలిసినంత వరకు పార్టీలకు వెళ్ళడం, గొడవలు పెట్టుకోవడం చూడలేదు. అలాగే ఏ అమ్మాయితో కూడా అసభ్యకరంగా ప్రవర్తించలేదు. దుబారా ఖర్చు చేయడం కూడా ఎప్పుడూ చూడలేదు. హంగు ఆర్భాటం కలిగేలా బట్టలు వేసుకోడు. ఖరీదైన సెల్‌ కూడా వాడడు. సాధారణంగా ఉంటాడు’ అంది.

సర్వేశ్వరరావుకి తాను చూసిన సంబంధం చేసుకోలేదు అని లోలోపల బాధ కలిగినా మంచి మనసు కలిగిన వాడు అనేసరికి ఒప్పుకోక తప్పలేదు. వెంటనే ఈ విషయం సూర్యకి చెప్పింది ‘మా ఇంట్లో ఒప్పేసుకున్నారు మీ ఇంట్లోనే ఆలస్యం’ అనగానే..’మా అమ్మ నాన్న చాలా మంచివాళ్ళు. ఇంట్లో నేను ఏమి చెప్పినా వింటారు”అవునా అయితే నేను అదృష్టవంతురాలిని. అలాంటి అత్తమామలు దొరకటం’ అంటూ ఆనందించింది దీప.

ఒక రోజు ఆఫీస్‌ అయ్యాక బయటికి వచ్చారు ఇద్దరూ.

‘మీ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తావు?’ ‘నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే తీసుకెళ్తాను’ అన్నాడు సూర్య.

‘పద’ అంటూ సూర్య బైక్‌ ఎక్కింది దీప. కాసేపు తర్వాత ఇంటి ముందు ఆపాడు సూర్య.

‘ఇల్లు చాలా బాగుంది సూర్య.”నా కుటుంబం కూడా చాలా బాగుంటుంది’ అన్నాడు సూర్య.

దీప రెట్టింపు ఆనంద పడింది. కానీ తర్వాత అది ఆవిరి అయింది.

దీప ఇంటికి వచ్చిన వెంటనే తన అమ్మ నాన్నలతో ‘మీరు చూపించిన సంబంధమే చేసుకుంటా’ అంటూ వెళ్లి తలుపు వేసుకుంది. అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు దీప తల్లి దండ్రులకు.

కాసేపు తర్వాత దీప తన అమ్మ ఒడిలో పడుకుని ఏడ్చింది.’వారిది పద్ధతైన కుటుంబం కాదు. విలువలు, ఆచారాలు తెలియని కుటుంబం’ అంది.

ఇంతలో సర్వేశ్వరరావు రావడంతో అసలు విషయం చెప్పడం మొదలు పెట్టింది దీప.

నేను ఇంట్లోకి అడుగు పెట్టే సరికి సూర్య ముందే చెప్పినట్లు ఉన్నాడు. హారతితో స్వాగతం పలికారు సూర్య తల్లిదండ్రులు. చాక్లేట్‌ చేతికి ఇచ్చి ‘వదిన’ అంటూ పదేళ్లు కుర్రాడు వచ్చి ఇప్పుడు మన ఇంట్లో నలుగురు కాదు, అయిదుగురు అంటూ కేక్‌ కూడా కట్‌ చేశాడు. వారి అభిమానానికి పొంగిపోయాను. వారు చూపిస్తున్న ప్రేమకు ముగ్దురాలినయ్యాను. అంతా బాగానే ఉంది అన్పించింది. కానీ ఆ పదేళ్ల అబ్బాయి ఎవరని సూర్యను అడిగాను. మా తమ్ముడు అఖిల్‌ అంటూ చెప్పాడు సూర్య.

ఎవరు? మీ పిన్ని వాళ్ళ అబ్బాయా? అని అడిగాను ఆత్రంగా.

కాదు మా సొంత తమ్ముడే అనగానే గుండెలో రాయి పడినట్లు అన్పించింది.సూర్య వయసు ముప్పై. అఖిల్‌ వయసు పది. ఇద్దరికీ ఇరవై ఏళ్ళు తేడా. కనీసం సిగ్గు కూడా లేకుండా ఆ వయసులో పిల్లల్ని కంటారా? అంత అవసరం అయితే దత్తత తీసుకోవచ్చు కదా? సమాజం ఏమి అనుకుంటుందో అనే ఆలోచన లేదు. సూర్య తల్లికి జ్ఞానం ఉండాలి కదా. పిల్లలు లేకపోతే అనుకోవాలి. కానీ సూర్య ఉన్నా కూడా మరొకరిని కనడానికి ఇరవై ఏళ్ళ తర్వాత గుర్తు వచ్చిందా ?

ఇంకా నయం మా పెళ్లి అయ్యాక పిల్లలు కంటాను అనలేదు ఆ మహాతల్లి. అందుకే ఈ విషయం తెలిసిన వెంటనే ఒక నిమిషం కూడా ఉండకుండా సూర్యతో ఒంట్లో నీరసంగా ఉందని చెప్పేసి వచ్చేశాను’ అని అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పుకొచ్చింది.

‘ఇదేం దౌర్భాగ్యం ఆ వయసులో పిల్లలు కనడం ఏమిటి?’ అంటూ కూతురుకి వత్తాసు పలికింది తల్లి. సర్వేశ్వరరావు కూడా పిల్లలు కలగకపోతే ఇరవై ఏళ్ళు ఆగాలా మరీ విడ్డూరం కాకపోతే అంటూ ఆయన కూడా కూతురు వైపే మాట్లాడారు.

‘నువ్వు పుట్టిన తర్వాత పిల్లలు కలగలేదు అంతే అనుకుని ఒకళ్ళతోనే సరి పెట్టుకున్నాం. అంతే గానీ ఛీ.. ఛీ నా నోటితో నేను చెప్పలేను’ అంటూ కోపంగా మాట్లాడాడు.

వారం రోజులపాటు సూర్యతో మాట్లాడలేదు దీప.

సూర్యకి ఏమి జరిగిందో అర్థం కాలేదు. ఫోన్‌ చేస్తే కట్‌ చేసింది. మెసేజ్‌ వెళ్లకుండా బ్లాక్‌ చేసింది. సూర్య మౌనంగా ఉన్నాడు తప్పా అడిగే ధైర్యం చేయలేదు.’ఆడవారు తగ్గరని తెలిసి సూర్యనే ఒక మెట్టు దిగి ఏమైంది దీప? నా వలన ఏమైనా సమస్య వచ్చిందా?’ అన్నాడు ఓ రోజు.

‘నీ వలన కాదు మీ తల్లిదండ్రుల వల్ల’ అంటూ ఉక్రోషంగా చెప్పింది.

‘వారేం చేశారు”ఆ వయసులో అఖిల్‌ను కనడం అవసరమా?. ఇరవై ఏళ్ళు తేడా వచ్చినా పిల్లలు కనాలి అనే ఆలోచన రావడం సిగ్గు చేటు. ఆలోచించాలి కదా? ఎవరైనా ఏమైనా అనుకుంటారని’.

‘ఇదే నీ ప్రాబ్లెమా?’ అడిగాడు సూర్య.

‘అవును’ మూతి తిప్పుకుని చెప్పింది దీప. ‘సరే సాయంత్రం బీచ్‌లో కలుద్దాం. అన్ని విషయాలు అక్కడ చెబుతాను.’సరే.. అని తలాడించింది.

ఇద్దరూ బీచ్‌కు వచ్చారు. అలలు ఎగిసిపడుతున్నాయి. వాతావరణం చల్లగా ఉన్నా.. దీప మనసు భగ భగ మండుతూ ఉంది. సూర్య చెప్పడం మొదలు పెట్టాడు.

‘మా అమ్మకి చిన్న వయసులోనే పెళ్లి చేశారు. సంవత్సరం కాగానే నేను పుట్టాను. తర్వాత అమ్మకి చాలా ఏళ్లు ఒంట్లో బాగోలేదు. చిన్న వయసులోనే కాన్పు వల్ల తన శరీరం సహకరించలేదు. చిన్న పని చేసినా చాలా ఇబ్బందులు పడేది. దాంతో నన్ను నాన్నమ్మ ఇంటికి పంపించి చదివించారు. తర్వాత హాస్టల్లో చేర్పించారు. అలా అమ్మ ప్రేమ తెలియకుండానే పెరిగాను. ఉద్యోగం వచ్చాక మళ్ళీ వారిని వదిలేసి బయటకి రావడం జరిగింది. కానీ ఒక రోజు పండక్కి ఇంటికి వెళ్లా. తిరిగి వస్తున్నప్పుడు అమ్మానాన్నలు మరో బిడ్డను కనాలి అనుకుంటున్న విషయం చెప్పారు. ‘నీకు ఇష్టమేనా?’ అని అడిగేసరికి ఒక క్షణం నాకు మాట రాలేదు.

‘అసలు ఎందుకు’? అని ఎలా అడగాలో కూడా నాకు అర్థ్దం కాలేదు. ఏ తల్లి తండ్రులు కూడా ఆ వయసులో అలాంటి ప్రశ్న వేయరు. కానీ వాళ్ళు చెప్పిన మాటలకు కన్నీరు తప్పా మరో మాట రాలేదు. ‘తెలిసీ, తెలియని వయసులో బిడ్డను కన్నాం. మాకు ఎలాంటి అచ్చట, ముచ్చట తీరలేదు. తల్లిగా నీకు పాలు ఇవ్వలేదు జోల పాట పాడలేదు. కనీసం మనసారా గుండెలకు హత్తుకున్న సందర్భాలు తక్కువ. మా ప్రేమానురాగాలు పంచకుండానే పెద్దోడివి అయ్యావు. కానీ మాకు ఇప్పుడు పిల్లల్ని కనాలని ఉంది. మాకు పుట్టిన బిడ్డను మా చేతుల్తో పెంచాలని ఉందిరా’ అన్న అమ్మమాటకు నాలో అంతర్మధనం.

‘తండ్రిగా నేను ఒకసారి కూడా నిన్ను స్కూలుకి తీసుకు వెళ్ళలేదు. బొమ్మల్ని కొనివ్వలేదు.సైకిల్‌ తొక్కడం నేర్పించలేదు’ అని నాన్న నా మీద ఉన్న ప్రేమ చెప్పి బాధపడ్డారు.

బాహ్యప్రపంచం ఎంత అందంగా ఉన్నా భావావేశాలు మనసులోనే భరిస్తూ, తెలియని నరకయాతనను సైతం మౌనంగా అమాయకంగా జీవిస్తున్నారు. వాళ్ళ ఇష్టాయిష్టాలకు నేను హద్దు చెప్పకూడదని అనుకున్నాను. నిర్మొహమాటంగా వారి ఆలోచనను, బాధను వాళ్ళు వ్యక్తపరచడం చూసి ఆశ్చర్యపోయాను. వారి అన్యోన్యాన్ని అర్థం చేసుకుని సరే అన్నాను.

కొడుకు పెళ్లి చేయావల్సిన వయసులో వాళ్ళకి పిల్లవాడు పుట్టడం ఏమిటి అని లోకం ఎన్నో గాయాలు చేసేలా మాటలతో పొడుస్తూ ఉన్నా కానీ నా తల్లిదండ్రులు మాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. పసిబిడ్డ పుడతాడు అన్న సంతోషం ముందు ఇవన్నీ తీయటి బాధించే గాయాలనుకున్నారు. మనుషులంతా ఒంటరి అంకె గల వాళ్ళే జత కలిస్తే సంఖ్య బలం పెరుగుతుంది. ఆ రోజు చివరగా అమ్మ ఒక మాట చెప్పింది ‘పుట్టిన బిడ్డను నీ అంత చేసే లోపు మేము చనిపోవచ్చు. నువ్వు చూసుకొంటావు కదా’ అంది. ‘నా జీవితంలో వచ్చే భార్యను కూడా వదినగా కాదు అమ్మగా చూడమని చెబుతా’ అని మాట ఇచ్చాను.

సూర్య అంతా చెప్పాక దీప వైపు చూస్తూ-‘అఖిల్‌కి వదినగా ఉంటే నా జీవితంలోకి రావద్దు. తల్లిగా వస్తే మాత్రం నీ చేయి వదలను. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ప్రేమను అందిస్తూనే ఉంటా’ అన్నాడు. కానీ దీప అప్పటికే నిర్ణయం తీసుకుంది ‘మనది వయసులో ఉన్న ప్రేమ. నా అత్త మామలది వయసు దాటిన ప్రేమ’ అంటూ సూర్య చేతిని బలంగా పట్టుకుంది.

  • నల్లపాటి సురేంద్ర, 94907 92553
➡️