‘నో బ్యాగ్‌ డే’ అందరికీ సరదానే..

May 12,2024 11:23 #Sneha

అందరికీ నమస్కారం! పుస్తకాలు లేకుండా బడేమిటి? అనుకున్నారా, అయితే ఒకసారి వినండి. ఆ రోజు నేను ఎంతో ఉత్సాహంతో బడికి వెళ్లాను. కాస్త ఆలస్యంగానే వచ్చానులేండి! క్లాస్‌ రూమ్‌ ముందు నుంచొని, డోర్‌ తెరవగానే అందరూ చాలా శ్రద్ధ పెట్టి ఆలోచిస్తున్నారు, మా క్లాస్‌ టీచర్‌తో సహా. ఏంటబ్బా! వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు? అని పక్కన చూస్తే పూలు ఉన్నాయి. చిన్న ముగ్గు వేసి, వాటిలో పూలు అమర్చాలనుకుంటున్నారు. ఒక పక్క నో బ్యాక్‌ డే అని ఆనందంతో బోర్డు డెకరేట్‌ చేయడానికి మా ఇద్దరి స్నేహితులు వాళ్ళ రకరకాల చిత్రాలు వేస్తున్నారు. నేనూ బాస్కెట్‌ని పక్కన పడేసి, ఒక చాక్‌పీస్‌ తీసుకుని వాళ్ళతో కలిసిపోయాను. మేము చేసేలోగా వాళ్ళు ముగ్గుని పూర్తి చేశారు. అబ్బ ఎంత పెద్ద పండగ జరుపుకున్నట్లు ఉందో! అనురాధ మేడము పిలుస్తున్నారని, బయటకు వెళ్తున్నాం ఓచ్‌! అని ఆనందపడిపోయిన మా మొహాలు, వెంటనే నీరసపడిపోయాయి. ఎందుకంటే?
స్కూల్లో చిన్న పిల్లలు చేసే ప్రోగ్రామ్స్‌ జాస్మిన్‌, మేరీగోల్డ్‌ వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్లను పరిశీలించి, ఎలా చెప్తున్నారో చూసి, రిమార్క్‌ వేయాలి. ఒక్కొక్క పిల్లవానికి కనీసం 10 యాక్టివిటీస్‌ నేర్పించి, చేయించాలి అన్నారు. ఒక్కొక్క క్లాస్‌ కి ఇద్దర్ని పంపించారు. మేము వెళ్లి మాకు వచ్చిన వాటిని వాళ్లతో చేపించాము. పర్లేదులే, చాలావరకు అందరూ బాగానే చెప్పారు. వాళ్లకు మార్కులు వేస్తుంటే, ఒక ఉపాధ్యాయురాలు అయిపోయామని గర్వంగా అనిపించింది. కానీ ”నో బ్యాగ్‌ డే” రోజున ఈ పని ద్వారా నేను మొట్టమొదటిగా నేర్చుకున్న పాఠం ఇదే. రెండు గంటలు వాళ్ళని చూసుకోవడానికి, మేము చాలా అలసిపోయాం. అదే మా ఉపాధ్యాయులు అయితే సంవత్సరం మొత్తం కష్టపడుతూనే ఉంటారు కదా! అని అనిపించింది. మాకు అప్పగించిన బాధ్యతలు నిర్వహించి, మార్కు లిస్టుని వాళ్ళ క్లాస్‌ టీచర్కు అప్పగించి, ఎవరి క్లాసులకు వాళ్ళం వెళ్లిపోయాము.
తర్వాత, లంచ్‌ బాక్స్‌లో తీసి అందరికి షేర్‌ చేసుకుంటూ తిన్నాము. మాతోటి స్నేహితులు బయటకు తీసుకెళ్ళమని అడిగినందుకు, వాళ్లతో పాటు మమ్మల్ని కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లమని అవకాశం ఇచ్చారు. మేము ఎంతో సంబరపడ్డాము. అందరూ లైన్లో నిలబడి, చేతితో నీళ్ల బాటిల్‌ పట్టుకొని వెళ్ళాము.
అయితే మమ్మల్ని అరవిందా గోకులంలోకి తీసుకువెళ్లారు. వెళ్ళగానే చిన్ని దూడను చూడగానే మా అందరి మనసులు మురిసిపోయాయి. ఎందుకంటే, అది అంత లేత బుజ్జిదూడ. అక్కడ మొత్తం మేము మూడు రంగులను చూసాము. దాని తర్వాత మేము చుట్టుపక్కల పొలాలను చూడడానికి వెళ్ళాము. తెలిసినంతవరకు అక్కడ పాలకూర, గోంగూరలు ఉన్నాయి. ఆ ఎండలో తిరగలేక క్లాసులకు వచ్చేసి, కొద్దిసేపు పడుకున్నాము. దాని తర్వాత నేర్చుకున్న కొన్ని పాటలు పాడాము. డాన్సులు వేసాము. తర్వాత మా క్లాస్‌ అబ్బాయిలు ఆంగ్లపు నాటకం వేశారు. మా క్లాస్‌ టీచర్‌ కేవలం ‘ఒక్క నిమిషం’ అని ఒక ఆటను ఆడించారు. ఆట చాలా బాగా నచ్చింది. మొదటి ట్రిప్పు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత, మేము ఒక ఆట ఆడుకున్నాం. పుస్తకాలు లేకుండా బడికి రావచ్చు, ఎన్నో నేర్చుకోవచ్చని నాకు అర్థమైంది.

– పి. సంహిత, 6వ తరగతి ,
అరవింద హైస్కూల్‌ , కుంచనపల్లి, గుంటూరు జిల్లా.

➡️