ఒక అద్భుతం!

Jan 3,2024 08:12
poetry on book deveraju maharaju

పుస్తకం ఎంత అద్భుతమైంది ?

చెట్టుతో తయారైన ఒక బల్ల పరుపు వస్తువు

సులభంగా అటూ ఇటూ కదల గలిగే విచిత్రం

తెల్లటి ఒంటి మీద కొన్ని గజిబిజి ఆకారాలు

అద్దుకుని, నీకోసం ఎదురు చూసే వస్తువు

ఒకే ఒక్క చూపుతో చూస్తే చాలు –

నువ్వు మరొకరి మెదడులోకి

నేరుగా ప్రవేశించగలవు –

ఆ మరొకరు బహుశా ..

వేల ఏళ్ళ క్రితమే కన్ను మూసిన వారు కావొచ్చు.

వేల ఏళ్ళ తర్వాత కూడా, కొందరు రచయితలు

నిశ్శబ్దంగా, స్పష్టంగా నీ తలలో

మాట్లాడుతున్నారూ

అంటే – రాయడం అనేది

మానవుడి ఆవిష్కరణలో ఎంత గొప్పది?

ఎంత సున్నిత మైంది? ఎంత సుందరమైందీ?

నీ పరిచితులని, అపరిచితులని

వేల వేల యుగాల్లో

వేరు వేరు దేశాలో

ఉన్న వాళ్ళందరినీ ఒక్కటిగా కలిపేది!

కాలం అడ్డు గోడల్ని ధ్వంసం చేసేది!!

మానవ మేధకు ఒక ఉదాహరణ – పుస్తకం !

మనిషి మహాద్భుతాలు సాధించాడనడానికి- ఒక రుజువు!!

(విజయవాడ పుస్తక మహోత్సవాన్ని పురస్కరించుకుని…)

– డా|| దేవరాజు మహారాజు

➡️