బ్లూరేంజ్‌…!

Feb 11,2024 12:01 #Poetry, #Sneha
poetry on poverty

నాది వాడిది..

ఒకే ఊరు.. ఒకే బడిబాట..

ఒకే బతుకుపాట..!

మా ఊరి చివర

దొడ్డికోయే బాటలో మా ఇల్లు

సెంటర్‌లో దేవుని పక్కల వానిల్లు

అయినా.. దోస్తులమే మేము..!

మా నాయనమ్మ

వాని జేబు నిండా

తియ్యని ప్రేమల్ని నింపేది

కానీ.. వాని బామ్మ

కండ్లల్ల నిప్పులు చెరిగేది..

వాడు కూడా రాను రాను

ఎండిన రేకంపయ్యిండు.

వానికేమో..

బత్తాయిపండ్లు మస్తు ఇష్టం

అక్కడక్కడ పంచుతూ పొయ్యేవాడు

నాకేమో..

నల్లటి నేరేడు పండ్లు ఇష్టం

నీలాన్ని నాలుకలపై పూసేవాడిని

రాళ్ళను పోగేసి

పెద్ద బంగళ చేస్తాడు వాడు

పేజీలను కాల్చేసి

మెదళ్లకు బూడిద రాయాలని చూస్తాడు

నన్ను, నాలాంటి వారిని

మాయమాటలతో

నమ్మించి వాడు

తొవ్వపొంటి కుట్రలే పెంచుతాడు

వానికి ఇయ్యాల కాకున్నా

రేపొద్దున్నైనా దగ్గరకు తీసుకొని

కాల్చిన పేజీల మర్మం వివరించాలి..!

  • రామ్‌ పెరుమాండ్ల 9542265831
➡️