ఇంకిపోని సూర్యుడు

Jan 14,2024 07:49 #Poetry, #Sneha
kavitha

చీకట్లను చీల్చుతూ

కన్నీళ్ళు కార్చే కనులు

వెలుగులను ఏ సూర్యుళ్ళ నుంచో మింగి

కావల్సినప్పుడల్లా కారుమబ్బులను

వెలికి తీస్తాయి ఆశ్చర్యంగా..!

కొంచెం తమాయింపు తొడుక్కొని

పదే పదే సుడులు సుడులుగా

వ్యథలను కెరటాల రూపంలో

ఎద తీరానికి ఎత్తి కొడుతూ పోటెత్తుతాయి..!!

ఒకానొకరోజు- ఇంకిపోయిన లోతుల్లోంచి

కొన్ని ఇంకు చుక్కలు కానవస్తాయి!

మిత్రమా బాధలు అందరికీ నొప్పినిస్తాయ్

కొందరిని వెంటాడి, వేధించి నలిపేస్తాయ్

దుఃఖం మోడుబారిపోతుంది ఏడ్చీ ఏడ్చీ..!

అనుకుంటాం ఇంకేం మిగిలిందని ఇంతకన్నా…

అనుభవించడానికి ఆవిరైన అడవి తప్పా..!!

ఇక ఏ భావమూ తొణికిసలాడక

దిక్కులూ దిశలూ మమేకమై, తటస్థమై

జడత్వాన్ని కప్పుకొని గుర్రుపెట్టి నిద్రపోయి

ఏ ధూళికణాల్లోనో..

కలిసిపోయినట్టు కనిపించినా-

విప్లవాత్మక కిరణాలకు అస్థిత్వాన్ని పొదుగుతాయి

అవే రేపటికి ఆసన్న భుజాలవుతాయి

దిగులు గుబులును నిర్వీర్యంగాంచుతాయి!!

 

  • రవీర్‌, 9603245215
➡️