సమాన పాత్రలో నటించా!

Jan 21,2024 08:32 #Actress, #Profiles, #Sneha
profile of jyothika actress

తాను రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించిన చిత్రాల్లో ‘కాథల్‌ -ది కోర్‌’ ఉత్తమమైన సినిమా అని నటి జ్యోతిక అన్నారు. దానిలో హీరోతో సమాన పాత్రలో నటించానని ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన సినీ జీవితంలో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన తర్వాత తనకు వచ్చిన అవకాశాలు ఏమీ నచ్చలేదనీ అందుకే ఇంత గ్యాప్‌ వచ్చిందన్నారు. తను ఇండిస్టీలోకి అడుగుపెట్టి దాదాపు 25 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఆమె సినీ ప్రయాణం, అనుభవాల గురించి తెలుసుకుందాం.

‘లక లక లక…’ అంటూ ‘చంద్రముఖి’ సినిమాలో పెద్ద కళ్లతో జనాలను హడలుకొట్టిన జ్యోతిక, మలయాళ హీరో మమ్ముట్టి కలిసి నటించిన లేటెస్ట్‌ మూవీ ‘కాథల్‌-ది కోర్‌’. జో బేబి డైరెక్ట్‌ చేశారు. స్వలింగ సంపర్కం తప్పుకాదని చెబుతూనే, దానివల్ల ఓ భార్య పడే బాధను చాలా హుందాగా చెప్పారు. అందులో జ్యోతిక నటన సినీ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది.

‘నేను ఇండిస్టీలోకి అడుగుపెట్టి దాదాపు చాలా ఏళ్లు అవుతోంది. నటిగా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. అగ్ర దర్శకులు సైతం నాకు ఆఫర్స్‌ ఇచ్చారు. అవి ఏవీ కూడా నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లా నాకు అనిపించలేదు. కేవలం, ఒక నటుడికి జంటగా కనిపించడానికి మాత్రమే ఆ రోల్స్‌ క్రియేట్‌ చేశారు. దాంతో నేను తిరస్కరించాను. కేవలం నాపై ఉన్న అభిమానంతో అవకాశాలు ఇచ్చేవారు దర్శకులు. కాకపోతే, ఆ పాత్రలు ఓకే చేయడానికి నాకు ఎలాంటి మంచి సీన్స్‌ కనిపించలేదు. అందుకే వాటిని వదులుకున్నా. ఎందుకంటే నటనకు ఆస్కారం లేని పాత్రలు పోషించడం నాకు నచ్చదు. అలాంటి సమయంలోనే మలయాళం పరిశ్రమ నుంచి ”కాథల్‌ -ది కోర్‌” లో అవకాశం వచ్చింది. ఇందులో నాది కూడా హీరోకు సమానంగా ఉండే పాత్ర’ అని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఇంటిల్లిపాదికి నచ్చే విధంగా, పెర్ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో తనకు నటించాలని ఉందని అన్నారు.

ఆమె అసలు పేరు జ్యోతిక సదానా. జ్యోతికను చూసి అంతా తమిళ అమ్మాయి అనుకుంటారు. కానీ ఆమె పుట్టింది ముంబయిలో. 1998లో బాలీవుడ్‌లో వచ్చిన ‘డోలీ సజా కే రఖ్‌నా’ అనే చిత్రంతో సినీ కెరీర్‌ను ప్రారంభించారు. కానీ ఈ సినిమా పెద్దగా పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత ఆమె తమిళ సినీ ప్రస్థానం ప్రారంభించి ‘వాలి’ చిత్రంలో నటించారు. ఈ సినిమాకు గానూ బెస్ట్‌ ఫీమేల్‌ డబ్ల్యూ కేటగిరీలో ఫిలింఫేర్‌ అవార్డును అందుకున్నారు. అక్కడి నుంచి వరుసగా జ్యోతికకు తమిళ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. కొన్ని తెలుగులోకి డబ్‌ అయ్యాయి. ఆమె నటనకు తెలుగు దర్శక, నిర్మాతలు కూడా ఫిదా అయ్యారు. తన అందమైన కళ్లతో, నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆమె ఆకట్టుకున్నారు. దాంతో తెలుగులో ‘ఠాగూర్‌’ సినిమాలో తొలి అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘మాస్‌’, ‘షాక్‌’ చిత్రాల్లో నటించారు. దాంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అందుకే ఆమె నటించే ప్రతీ తమిళ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తూ వచ్చారు.

మిలట్రీ ఉమెన్‌ అయినా, టీచర్‌లా చీరకట్టుతో కనిపిస్తూ 2018లో వచ్చిన ‘రాక్షసి’ సినిమాతో తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. దాంతో తమిళం, తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. అంతేకాదు నిర్మాతగా ’36 వయసులో’, ‘మగువలు మాత్రమే’, ‘పొన్మగల్‌ వందాళ్‌’, ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్‌,’ ‘ఓ మై డాగ్‌’ సినిమాలు నిర్మించారు.

‘పూవెల్లామ్‌ కేట్టుప్పార్‌’ చిత్రంలో నటిస్తున్న సమయంలో హీరో సూర్యతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 2006లో పెళ్లి చేసుకున్నారు. వీరికి దేవ్‌, దియా అనే ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబం కోసం కొంత కాలం నటనకు దూరంగా ఉన్న జ్యోతిక మళ్లీ నటించడం మొదలెట్టారు. ’36 వయదునిళే’ చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జ్యోతిక తనకు తగిన పాత్రలను ఎంపిక చేసుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

మతం కన్నా మానవత్వం ముఖ్యమని నమ్మిన జ్యోతిక, సూర్య దంపతులు విపత్తుల సమయాల్లో బాధితులకు విరాళాలు ఇచ్చి, ఆదుకోవడంలో ముందుంటారు.

పేరు : జ్యోతిక సదానా

ఇతర పేర్లు : జో

పుట్టిన తేది : 1978 అక్టోబరు 18న

తల్లిదండ్రులు : చందర్‌ సదానా, సీమా సదానా

అక్క, చెల్లెళ్లు : నగ్మా, రోషిణి

వృత్తి : నటన, నిర్మాత

➡️