పుస్తక పఠనం .. మనసుకు వ్యాయామం

Dec 3,2023 13:59 #Sneha

మోటార్‌ సైకిల్‌ యాత్రా దర్శనం మంచి కంటి గ్రంథాలయ యాత్ర

రచయిత : మంచికంటి

పేజీలు : 160

వెల : రూ. 150

ఫోన్‌ : 9949535695

             ‘ప్రపంచ పటంలో కనిపించే ప్రతి మూలకూ వెళ్లాలని ఆశపడుతున్నావా, అయితే గ్రంథాలయానికి వెళ్లు’ అంటారు టెస్కార్డ్స్‌. గ్రంథాలయాల ప్రాధాన్యతను వివరించడానికి ఈ ఒక్క వాక్యం చాలు. గ్రంథాలయోద్యమం ఒకప్పుడు చైతన్యవంతమైన పాత్రను నిర్వహించింది. ఊరూరా గ్రంథాలయాలు నెలకొల్పాలని, ప్రతి స్కూల్లోనూ గ్రంథాలయం వుండాలని ఎంతో కృషి చేసినవారు ఎందరో వున్నారు. నేడు గ్రంథాలయాలు ఎక్కడా క్రియాశీలంగా కనబడ్డంలేదు. ఎక్కడైనా వున్నా… సరిగా పనిచేయడం లేదు. ప్రభుత్వాలు, అధికారులు కూడా గ్రంథాలయాల పట్ల చిన్నచూపే చూస్తున్నారు. గ్రంథాలయాల అభివృద్ధి జాడే లేదు. ‘పుస్తకాలు నా మనస్సుకు, హృదయానికి రెక్కలినిచ్చాయి. నేను బురదలోంచి బయట పడటానికి ఎంతో తోడ్పడ్డాయి. పుస్తకాలు చదవకపోతే నా చుట్టూ వున్న మౌఢ్యం, నీచంలోను మునిగిపోయి వుండేవాణ్ణి. విశాలమైన ప్రపంచ దృశ్యాలను పుస్తకాలు నా ముందు పరిచాయి’ అంటారు మాక్సిం గోర్కీ. పిల్లలు పుస్తకం నుంచి గ్రహించే జ్ఞానం కంటే స్మార్ట్‌ఫోన్‌ నుంచి గ్రహించే అజ్ఞానమే ఎక్కువగా వుందనేది ఇటీవల జరుగుతున్న అనేక పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. మనిషి సమయాన్ని, ఆలోచనలను కూడా స్మార్ట్‌ఫోన్‌ ఆక్రమించేసింది. పాఠ్యపుస్తకం మినహా మరో పుస్తకం చదవడం ఎరుగని పిల్లలకు ప్రాపంచిక జ్ఞానం కొరవడుతోందని నిపుణులు సైతం చెబుతున్నారు. అలాంటి సమయంలో మరో గ్రంథాలయోద్యమాన్ని భుజానికెత్తుకున్నారు మంచికంటి. గ్రంథాలయాల విశిష్టతను తెలియజెపుతూ.. ఆంధ్రప్రదేశ్‌ అంతటా మోటర్‌ సైకిల్‌పై ఆయన చేసిన ‘గ్రంథాలయ యాత్ర’ ను ‘తెలుగు రాష్ట్రాల గ్రంథాలయ ఉద్యమ చరిత్రలోనే ఒక మైలురాయి’ అని అభివర్ణించారు ప్రముఖ సాహితీవేత్త వాడ్రేవు చినవీరభద్రుడు. ‘మన ముందు ఎంతోమంది ఎన్నో ఉద్యమాలను నడిపించారు. ఆ ఉద్యమాల స్ఫూర్తితో ఇవాళ భాష, సంస్కృతి గ్రంథాలయాల కోసం ఒక ఉద్యమాన్ని నిర్మించలేమా అనే ఆలోచనతోనే మొదలైన యాత్ర ఇది’ అని ఈ పుస్తక రచయిత తన యాత్ర నేపథ్యం గురించి చెప్పుకున్నారు. అలా రాష్ట్రమంతటా మంచికంటి నిర్వహించిన గ్రంథాలయ యాత్ర అనుభవాల దర్పణమే ‘మోటార్‌ సైకిల్‌ యాత్రా దర్శనం’ పుస్తకం.

వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు కావడం, స్వతహాగా సాహిత్యాభిలాషి కావడం, తను చదువు చెప్పే పిల్లలకు ఏదో నేర్పాలనే తపన వుండటం మంచికంటిని గ్రంథాలయోద్యమం వైపు మళ్ళించాయని ఈ పుస్తకం చదివిన ఎవరికైనా అర్థమౌతుంది. ‘కవులకు, రచయితలకు ప్రజలు దూరమైపోయారు. మనం ఏం చేస్తున్నామో వాళ్లకు తెలియదు. మనం ఏం రాస్తున్నామో వాళ్లదాకా చేరదు. అందుకే ప్రజలకు, మనకు మధ్య చాలా దూరం పెరిగిపోయింది. ఆ దూరాన్ని తగ్గించుకోవాలంటే… ఇవాళ మనుషులలో ఉండే ఏ చిన్న పాజిటివ్‌ అంశాన్నయినా పుస్తకం కోసం ఉపయోగ పెట్టుకోగలిగితే… గ్రంథాలయ ఉద్యమం మొదలైనట్లే…’ అంటారు ఈ పుస్తక రచయిత. ఒక ఉపాధ్యాయుడిగా తాను చదువు చెప్పే పిల్లలకు పాఠ్యపుస్తకాల నుంచి వచ్చే జ్ఞానంతో పాటు ప్రాపంచిక జ్ఞానం కూడా అందించాలని, వారిని విజ్ఞానవంతులను చేయాలని తపించినట్లే… తెలుగు భాష, సంస్కృతిని ప్రజలందరికీ అందించాలని, మాతృభాష ప్రాధాన్యతను తెలియజెప్పాలని కంకణం కట్టుకున్న వ్యక్తి మంచికంటి. గ్రంథాలయాల కోసం ఒక ఉద్యమాన్ని నిర్మించాలన్న ఆకాంక్ష ఆ ఆలోచనల నుంచి ఉద్భవించిందే. దాని ఫలితమే ఆయన రాష్ట్రంలోని కవులు, రచయితలు, సాహితీవేత్తలను కలిసి, అనేక గ్రంథాలయాలను సందర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ప్రారంభమైన ఈ యాత్ర… శ్రీకాకుళం జిల్లలోని ‘కథా నిలయం’ వరకు 18 రోజులు, 2700 కిలోమీటర్లు సాగింది. ఈ సాహితీ ప్రయాణంలోని అనేక అనుభవాలను, తాను సందర్శించిన ప్రముఖ గ్రంథాలయాల చారిత్రక ప్రాధాన్యతలను ఒకచోట గుదిగుచ్చి, అక్షర రూపం ఇచ్చారు.

తనకు ఉరివేసే క్షణం ముందు వరకు పుస్తక పఠనం చేస్తూ వున్న వ్యక్తి భగత్‌సింగ్‌. ‘మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏదీ అన్నప్పుడు కొంచెం కూడా ఆలోచించకుండా పుస్తకం’ అని చెబుతారు అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌. ‘తుపాకీ కంటే పెద్ద ఆయుధం పుస్తకం’ అంటారు లెనిన్‌. ముఖపుస్తకం (ఫేస్‌బుక్‌) పట్టుకుని నిజపుస్తకాన్ని మరిచాము. ‘ఒక పిల్లాడికి మీరు ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏదైనా వుందీ అంటే… అది పుస్తకమే’ అంటారు విన్‌స్టన్‌ చర్చిల్‌. ఊరూరా గ్రంథాలయం ఏర్పాటు కావాలి. ఇంటింటా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సెల్‌ఫోన్‌ పక్కన పెట్టి, పుస్తకాన్ని చదవడం ఇంటి నుంచే ప్రారంభం కావాలి. ఈ పుస్తకం ఇచ్చే సందేశం ఇదే. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా తమ పుస్తక పఠనాన్ని ప్రారంభించి, మరో నలుగురితో పుస్తకాలు చదివించేలా చేయగలిగితే ఇంటింటా, ఊరూరా… తెలుగునేల నలుమూలలా పుస్తకపఠనం ఒక ఉద్యమంగా సాగుతుంది. రాష్ట్రమంతా సాహితీవనమై విజ్ఞాన కుసుమాలను విరబూస్తుంది.

                                                                                                                               – రాజాబాబు కంచర్ల 9490099231

➡️