రిజర్వేషన్లు.. సానుభూతి కాదు, హక్కు

Reservations.. not sympathy, right

కేంద్ర ఎన్నికల సంఘం 2024 సార్వత్రిక ఎన్నికల కోసం మొన్ననే దేశంలో ఓటర్ల వివరాలు వెల్లడించింది. దేశంలో దాదాపు 140 కోట్ల జనాభా ఉండగా, ప్రభుత్వాలను ఎన్నుకునే నిమిత్తం నమోదు కాబడ్డ ఓటర్ల సంఖ్య 94 కోట్లు. వారిలో ఇంచుమించు సగంమంది మహిళలే. ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓట్లు వేస్తున్న కోట్లాది మహిళల్లో ఎంత మంది పార్లమెంట్‌, అసెంబ్లీలలో అడుగు పెడుతున్నారు? మనకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలను ఊరూవాడా ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రస్తుత 17వ లోక్‌సభలో ఉన్న మహిళా ప్రాతినిధ్యం కేవలం 15 శాతం. లోక్‌సభలో మహిళా ప్రతినిధులు 5 శాతం నుంచి 15 శాతానికి పెరగడానికి ఏడున్నర దశాబ్దాలు పట్టింది. శాసనసభల్లో అయితే పది శాతం లోపే. అన్నింటా సగం ఉన్న మహిళలు తమకు కనీసం 33 శాతం రిజర్వేషన్లు కావాలని దశాబ్దాల తరబడి పోరాడుతున్నారు.

  • 27 ఏళ్లు పట్టింది

1996లో ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో బిల్లు ప్రతిపాదించగా, పలు కారణాల వల్ల వీగిపోయింది. 1997, 1998లోనూ ప్రయత్నం జరిగినా సఫలీకృతం కాలేదు. తిరిగి యుపిఎ-2 హయాంలో 2010లో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందినా లోక్‌సభ వరకు వెళ్లలేదు. తాము అధికారంలోకొస్తే మహిళా రిజర్వేషన్‌ బిల్లు తెస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ సారథ్యంలోని బిజెపి హామీ ఇచ్చింది. ఐదేళ్లల్లో తేలేదు. రెండవసారి 2019 ఎన్నికల్లోనూ మోడీ అదే వాగ్దానం ఇచ్చారు. రెండవ తడవ అధికారం పూర్తవుతుందనగా 2023 సెప్టెంబర్‌లో ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించి లోక్‌సభ, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. వెనువెంటనే చట్టం అయింది. అంటే, చట్ట సభల్లో కోటా కోసం మహిళలు 27 సంవత్సరాలు అలుపెరగకుండా పోరాడాల్సి వచ్చింది. ఐద్వా సహా పలు సంఘాలు, పార్టీలు మహిళా రిజర్వేషన్ల పోరాటాన్ని సజీవంగా ఉంచడం వల్లనే సాధ్యమైంది.

  • కోటాకై సంవత్సరాలు నిరీక్షించాలా?

చట్టం చేసినప్పటికీ మహిళలకు రిజర్వేషన్లు అందాలంటే కొన్నేళ్లు ఆగాలని మోడీ ప్రభుత్వం చట్టంలోనే పేర్కొంది. జనగణన, దాని ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యాకనే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. ఈ లెక్కన చూస్తే 2029 నుంచి అని, కాదు 2034 తర్వాతనేనని భాష్యాలు చెబుతున్నారు. చట్టం వచ్చాక కూడా మరి కొన్నేళ్లు మహిళలు రిజర్వేషన్ల కోసం ఎదురుచూడాలి. జనగణన, పునర్విభజనలతో సంబంధం లేకుండా 2024 నుంచే అమల్లోకి తేవడానికి అవకాశం ఉంది. కానీ మోడీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. ఇక్కడే ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది. 1983 నుంచే బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వం స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది. కేరళలో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఎన్‌టిఆర్‌ ప్రభుత్వం 33 శాతం కోటా అమలు చేయగా, ప్రస్తుతం 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. పలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేవు. రిజర్వేషన్ల వలన మహిళా ప్రతినిధులు పదవుల్లోకి రావడం అభ్యుదయకరం. స్థానిక సంస్థల్లో లక్షల మంది ఆ విధంగా ముందుకొచ్చి, తమ శక్తి సామర్ధ్యాలను నిరూపించారు కూడా. కాగా మన రాష్ట్రంలో, ఇంకా కొన్నిచోట్ల మహిళలు ఎన్నికైనా వారి కుటుంబాల్లోని పురుషులే అధికారం, పెత్తనం చెలాయిస్తుండటం చూస్తున్నాం. మహిళలు చైతన్యం అయ్యే కొద్దీ ఇటువంటి పెడ ధోరణులు మారతాయి. మహిళా కోటాలో ఎస్‌సి, ఎస్‌టిలకు సబ్‌కోటా, ఒబిసిలకు రిజర్వేషన్ల వంటి వాదనలు ఉన్నాయి. మోడీ ప్రభుత్వ మహిళా రిజర్వేషన్ల బిల్లు ఎన్నికల స్టంట్‌గానే కనిపిస్తోంది. బిల్లు ప్రవేశపెడుతూ మోడీ, మహిళల పట్ల సానుభూతి చూపామన్నారు. మహిళలకు రిజర్వేషన్లు అనేవి సానుభూతితో ఇచ్చేవి కాదు.. హక్కు. సనాతన ధర్మం, మనువాదం బిజెపి, దాని మాతృక ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం మహిళలను రెండవ జాతి పౌరులుగా చూస్తుంది. వారికి హక్కులేవీ వద్దంటుంది. స్త్రీలు అణిగిమణిగి ఉండాలంటుంది. పితృస్వామిక వ్యవస్థను పాదుకొల్పాలంటుంది. ఈ పూర్వరంగంలో మహిళా రిజర్వేషన్లపై బిజెపి చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలి.

– ప్రసాద్‌, 9701309927

➡️