సాధనం

Dec 31,2023 10:34 #katha, #Sneha

అప్పుడప్పుడే ఆదిత్యుని ప్రభాత కిరణాలు అవనిని ముద్దాడవస్తున్నాయి. కోయిలల కుహు కుహు రాగాలతో వాతావరణం ఆహ్లాదంగా పరిమళిస్తున్నది. చల్ల చల్లగా గాలివీస్తూ ప్రాణికోటి మెల్ల మెల్లగా నిత్యకృత్యాల్లోకి జొరబడుతున్న వేళ. వీనుల విందైన సంగీత ధ్వనితో డోర్‌ బెల్‌ ఎవరో వచ్చారని పిలిచింది.

నిద్ర మంచం దిగి, ఆవలిస్తూ వచ్చి బద్ధకంగా తలుపు తీసిన రాణికి ఎదురుగా ప్రభ కనిపించింది.

‘హాయ్ ప్రభా.. ఎంత అదృష్టం చేసుకున్నానే ఈ రోజు..’ అంటూ ఒక్కసారిగా వచ్చి ప్రభను గాఢంగా కౌగిలించుకుంది రాణి.

‘ఎప్పుడు బయలుదేరావు? అసలు ఎక్కడినుంచి వస్తున్నావు? నువ్వూ మీ అమ్మానాన్నా అందరూ బాగున్నారా? చెప్పు చెప్పు..’ అడిగింది రాణి ..కుడి భుజానికి ఒక బరువయిన బ్యాగు, రెండుచేతుల్లో కూడా లగేజ్‌తో లిఫ్ట్‌ పనిచెయ్యక మూడు అంతస్తులు మెట్లెక్కి వచ్చిన ప్రభను.

స్నేహితురాలికి హఠాత్తుగా కన్పించి ఆశ్చర్యపరచాలనే ప్లానుతో వచ్చింది ప్రభ.

‘ఒసే నిద్రమొఖమా.. ముందు లోపలికి రానివ్వవే.. ఈ బరువులు దింపుకోనివ్వవే.. నువ్వడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తాను’ ఆయాసపడుతూ అంటోంది ప్రభ.

రాణి అదేమీ విన్పించుకోకుండానే ‘ఇదుగో ఏమండీ.. ఎవరొచ్చారో చూడండి. నా ప్రాణ స్నేహితురాలు ప్రభ వచ్చిందండీ..’ సంతోషంతో గంతులు వేస్తున్నట్లు నడుస్తూ భర్త రవిని పిలవడానికి లోపలికి వెళ్ళిపోయింది రాణి.

‘ఓసి నీ ప్రేమ కూలిపోనూ.. నువ్వింకా మారలేదన్న మాట..’ అనుకుంటూ లోపలికి వచ్చింది ప్రభ.

బ్యాగులు ఓ పక్కన పెట్టి, సోఫాలో కూలబడి ఎదురుగా వున్న నీళ్ళ సీసా తనే అందుకుని, మంచినీళ్ళు తాగి కొంచెం తెప్పరిల్లింది.

అప్పుడే స్నానం చేసి బాత్రూమ్‌లోంచి వస్తున్నాడు రవి. నడుముకి ఒక్క టవలు మాత్రమే ఉన్న అతన్ని రెక్క పట్టుకుని హాల్‌లోకి లాక్కొస్తూ ‘మీకు ఎప్పుడూ చెప్తుంటానే.. ఇదే నాబెస్ట్‌ ఫ్రెండ్‌.. నాప్రాణం.. ప్రభ.. ప్రభా.. ఈయన మాశ్రీవారు రవి’ అంటూ నవ్వుతూ పరస్పరం పరిచయం చేసింది.

కొత్త మనిషికి అర్ధనగంగా ఎదురుపడ్డందుకు సిగ్గుపడుతూ, మొహమాటంగా నవ్వుతూ ‘నమస్కారం’ అని చెప్పేసి ప్రభ చేసిన ప్రతి నమస్కారం స్వీకరించకుండానే గబుక్కున గదిలోకి పారిపోయాడు రవి.

‘ప్రభా.. ఇదుగోనే మా బుజ్జి యువరాణి’ అంటూ ఊయలలో నిద్రపోతున్న ఆరునెలల పాపను ఎత్తుకుని వస్తూ ‘బంగారం.. అత్త వచ్చిందే..’ అంటూ పాపను ప్రభ ఒడిలో పడుకోపెట్టింది. ఆ అందమైన పాపను మనసారా ముద్దాడిన ప్రభ మళ్ళీ ఊయలలో పడుకోపెట్టి ‘మరింక నేను వెళ్ళొస్తానే రాణీ’ అన్నది బ్యాగు చేతిలోకి తీసుకుని.

‘అదేమిటే అప్పుడే వెళ్ళిపోవడమేమిటి.. కనీసం రెండు రోజులన్నా ఉండవా?’ బెంగగా అడిగింది రాణి.

‘మరి నన్ను ఉండమనేదానివి అంత అర్జంటుగా పరిచయ కార్యక్రమాలు ఎందుకే..’ ‘ఏమిటోనే.. నిన్ను చూసిన ఆనందంలో నాకు బుర్ర పనిచెయ్యడం లేదు. అవునూ ముందు నువ్వు స్నానం చెయ్యి. నేనీలోగా నీకు ఇష్టమైన పెసరట్టు వెన్నవేసి కాల్చి తెస్తాను. నువ్వు గొప్ప అదృష్టవంతురాలివే ప్రభా! ఈవేళ మా ఇంట్లో టిఫిన్‌ అదే. అల్లం, పచ్చిమిర్చి బాగా వేస్తాను. కొబ్బరి చట్నీతో తింటే సూపరనుకో.. వెళ్ళు వెళ్ళు త్వరగా స్నానం కానిచ్చి రా..’ అంటూ ప్రభను తొందరపెట్టింది రాణి.

దూర ప్రయాణపు అలసటంతా పోయేలా ఎక్కువసేపు స్నానం చేసిన ప్రభకు పాతరోజులు గుర్తొచ్చాయి.

రాణి, ప్రభ ఎంబిఏలో క్లాస్మేట్స్‌, రూమ్మేట్స్‌ కూడా.. రాణి బోళాతనం చూసి ప్రభ ఆమెను ఎంతగానో ఇష్టపడేది. ప్రభలోని మంచి మనసూ, నాయకత్వ లక్షణాలు రాణిని ఆకర్షించాయి. అందువల్ల కొద్దికాలంలోనే వాళ్ళిద్దరూ ఆప్తమిత్రులయ్యారు. ఎంబీఏ అవగానే రాణికి పెళ్లి అయిపోయింది. అప్పటికే ఉద్యోగం కోసం ముంబై వెళ్ళిన ప్రభ రాణి పెళ్లికి రాలేకపోయింది.

రవి సాఫ్ట్వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆస్తి అంతస్తు ఉన్న కుటుంబం. సహృదయుడయిన భర్త లభించినందుకు రాణి పొంగిపోతుంటుంది. మనసులు కలసిన అపురూపమైన జంట వాళ్లది.

రాత్రి పది గంటలు అయింది.’ఇప్పుడు చెప్పవే ఏమిటి నీ కబుర్లు.. మొత్తం చెప్పేయి. నువ్వు నా పెళ్ళికి కూడా రాలేదు.

ఫోన్లో అయితే మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ మూడేళ్లు అయిపోయింది కదూ మనం కలుసుకొని’ అన్నది రాణి. పాపాయిని రవికి అప్పజెప్పేసి, ప్రభ పడుకున్న మంచం మీదే తానూ పడుకుని ప్రభ మీద చేయివేస్తూ నవ్వింది.

‘నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందే రాణీ.. ఎవరి సంగతి మాకు అక్కర్లేదు అన్నట్లుగా అందరూ గిరిగీసుకొని ఉంటున్న ఈ రోజుల్లో కూడా నువ్వు నీ మనసుని కలుషితం కాకుండా కాపాడుకుంటున్నట్లుగా నాకు అన్పిస్తోంది. స్వచ్ఛమైన నీ మాట, నవ్వు చూస్తుంటే’ అన్నది ప్రభ రాణి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ.

‘అదంతా నీ అభిమానమేలే కానీ.. ఇంతకీ నీ పెళ్లి ఎప్పుడు? ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా లేదా? ఇంకా ఎన్నాళ్ళు ఉంటావే బ్రహ్మచారిణిగా.. కొంపతీసి నువ్వు కూడా ముదురు బెండకాయవై పోతావా ఏమిటి..’

‘ఛ.. నోరుముయ్యవే! నా పెళ్లి ఖాయమైపోయింది తెలుసా.. వరుడు శరత్‌., మా కొలీగే. నాకు జాతకాలు, ముహూర్తాలు వంటి వాటి మీద నమ్మకంలేదని నీకు తెలుసుగా.. అతనికీ అంతే. ఇంకా మా ఇద్దరికీ ఆర్భాటాలు, ఆడంబరాలు కూడా నచ్చవు. అందుకే సింపుల్‌గా రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుంటున్నాం. కేవలం రెండు దండలూ, రెండు ఉంగరాలూ.. అంతే మా పెళ్లి ఖర్చు..’

‘అమ్మో నువ్వు అసాధ్యురాలివే తల్లీ.. ఈ వంకతో పెళ్లి ఖర్చు తగ్గించుకుంటున్నారన్న మాట..

”అదేం లేదు. సుమారుగా ఆ డబ్బుని ఏదైనా అనాధ శరణాలయానికి విరాళంగా ఇద్దామనుకుంటున్నాం.’

‘నాకు నీలాంటి స్నేహితురాలు ఉన్నందుకు చాలా గర్వంగా ఉన్నదే ప్రభా..

”అబ్బో.. ఇదో పెద్ద విశేషమేమీ కాదు గానీ ఇంకా మన దోస్తుల విశేషాలు చెప్పు..’ ఆవలిస్తూ అన్నది ప్రభ.

అలా కబుర్లతో ఎంత టైము గడిచిందో కూడా వాళ్లకు తెలియలేదు. కిటికీ పక్కనే ఉన్న పారిజాతం చెట్టు సుగంధాలు వెదజల్లుతూ పూలను రాల్చింది.

‘ఈవేళ మా పెళ్లిరోజు తెలుసా..’ మరునాడు ఉదయాన్నే విరిసిన వనంలా అందంగా ముస్తాబయిన రాణి ప్రభను నిద్ర లేపడానికి గదిలోకి వచ్చి అన్నది.

‘అందుకే మీకొక బహుమతి తయారు చేశాను తెలుసా’ రాణిని అనుకరిస్తూ తాను చిత్రించిన ఒక చిత్రాన్ని సూట్‌ కేస్‌లోంచి బయటకు తీసి, రాణి చేతికి అందించింది ప్రభ ‘వివాహ దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ. ఆ చిత్రాన్ని చూసిన రాణి కళ్ళు ఆనందంతో మిలమిలలాడాయి. అసలే అందమైన జంట రాణి, రవి ముద్దులొలికే పాపతో కలిసి ఆ చిత్రంలో మరింత అందంగా ఉన్నారు. చుట్టూ అందమైన ప్రకృతి, ఒక పక్కన లేళ్లూ, నెమళ్లు మరో పక్కన జలపాతాలతోఆ చిత్రం అద్భుతంగా వచ్చింది.’ఎప్పుడు వేశావే ఈ పెయింటింగ్‌.. అడిగింది రాణి దాన్ని మురిపెంగా చూసుకుంటూ.

‘రాత్రి నువ్వు నిద్రపోయాక వేశాను’ అన్న ప్రభ మాటలు విన్పించుకోకుండానే ‘ఇదుగో రవీ.. ఇలా చూడు.. ఈ పెయింటింగ్‌ ఎంత బాగుందో.. ప్రభ ఎంత బాగా వేసిందో..’ అంటూ ఆ చిత్రాన్ని అపురూపంగా పట్టుకుని హాల్‌లోకి పరుగుతీసింది రాణి.

ప్రభ హాయిగా నవ్వుకున్నది. అప్పుడే ఆమె వచ్చి నాలుగు రోజులు గడిచిపోయాయి. రవి కూడా ఆఫీసుకు సెలవు పెట్టాడు. ముగ్గురు కలిసి పాపతో ఒకటే షికార్లు.. సినిమాలు.. సరదా కబుర్లు.. ఆటలుపాటలతో వాళ్లకి నాలుగు రోజులు నాలుగు క్షణాల్లా గడిచిపోయాయి.

ఇక రేపే ప్రభ తిరుగు ప్రయాణం.ఆరోజు రాణి దిగులుగా కూర్చుంది.

‘అంత దిగులుపడకే రాణీ.. నీకు మరో బహుమతి ఇస్తున్నాను’ అన్నది ప్రభ.

‘మరో బహుమతా.. ఏమిటది.. త్వరగా ఇవ్వు’ చిన్నపిల్లలా ఉత్సాహంగా అడిగింది రాణి.రవి కూడా ఆసక్తిగా చూస్తూ ‘మీరు మంచి చిత్రకారులండీ.. ఎంత అద్భుతంగా వేస్తున్నారు’ అన్నాడు.

‘థాంక్స్‌ అండీ. కానీ ఇచ్చినాక నన్ను తిట్టకూడదు మరి’ అంటూ మరో చిత్రాన్ని వాళ్ళకు అందించింది ప్రభ.

‘అందులో కూడా రాణీ రవీలే ఉన్నారు. కాకపోతే 40 ప్లస్‌ వయసుతో.. అందులో రాణి చాలా లావుగా ఉంది. రవి కూడా లావుగానూ, బానపొట్టతోనూ ఉన్నాడు. ఆ చిత్రాన్ని చూసిన రాణీ, రవీ మాన్పడిపోయారు.

‘ఏమిటే నీకు మామీద ఇంత కోపం ఉందా.. లేకపోతే ఎగతాళా.. అందుకే ఇలా వేశావా..’ అడిగింది రాణి. ఆమె కంఠంలో బాధ తొంగిచూసింది. రవి ముఖం కూడా చిన్నబోయింది.

‘మీమీద కోపం నాక్కాదే.. మీకే మీమీద ప్రేమ లేదు.. అభిమానం లేదు..ఇంకా మిమ్మల్ని మీరే ద్వేషించుకుంటున్నారు..’

‘అదేమిటే అలా అంటున్నావు.. మామీద మాకే ప్రేమ లేకపోవడం ఏమిటి..? అభిమానం లేకపోవడం ఏమిటి..? మమ్మల్ని మేమే ద్వేషించుకోవడం ఏమిటి..?’ అయోమయంగా రాణీ, రవీ ఒకరిముఖం ఒకరు చూసుకున్నారు. ‘అర్థమయ్యేట్లు చెబుతాను.. ఈ నాలుగు రోజుల నుంచి మీ పనులు, పద్ధతులు అన్నీ గమనించాను. అసలు మీమీద మీకు కొంచెమైనా శ్రద్ధ ఉన్నదా..? జాగ్రత్త ఉన్నదా..’

‘జాగ్రత్త ఏమిటే..? ఇప్పుడు మాకేమయిందని.. బాగానే ఉన్నాంగా ఇద్దరం..? అన్నది రాణి.

‘ఇప్పటివరకు బాగానే ఉన్నారు నిజమే.. కానీ ఇలాగే గడిపితే మరొక పదేళ్ళు పదిహేనేళ్ళ తర్వాత కూడా ఇలాగే ఉండగలరని నమ్మకం ఉందా..?

‘అయితే ఇప్పుడు మమ్మల్నేం చెయ్యమంటావు ప్రభా.. అసలు మేము చేస్తున్న తప్పేమిటంటారు? ప్రభ, రాణిల సంభాషణంతా వింటున్న రవి అడిగాడు ఆసక్తిగా ముందుకు వంగుతూ.

‘ఒకటి కాదు రెండు కాదు. చాలా చాలా తప్పులు చేస్తున్నారు ఇద్దరూ.. ఈ రాణీ గారు వంటల్లో ఉప్పు, కారం, నూనె, పంచదార అన్నీ ఎక్కువే. ఆహారంలో బియ్యం, గోధుమలు తగ్గించి తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి కదా.. రాత్రిపూట వేపుళ్ళూ, ఊరగాయపచ్చళ్ళతో తొమ్మిదిన్నరకో పదింటికో భోజనం చేస్తున్నారు. తిన్నాక పావుగంటలోనో నిద్రపోతారు…

అసలు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి కదా.. మీరేమీ చెయ్యడం లేదు. ఉదయం నడకకూ వెళ్ళడం లేదు.. రవీ మీకు ఆఫీస్‌వర్క్‌ ఎక్కువగా ఉంటున్నదనీ, రాణీనేమో పాపాయి వంక పెట్టుకుని అన్నీ మానేస్తున్నారు. రాణీ నువ్వూ, రవీ మీపెళ్ళప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికే ఎలా మారిపోయారో ఎప్పుడైనా గమనించకున్నారా..?

ప్రభ అడిగిన ప్రశ్నకు ఇద్దరూ సమాధానం చెప్పలేకపోయారు.’ఇప్పట్లాగే ఇంకా కొన్ని సంవత్సరాలు గడిపితే, ఈ చిత్రంలో ఉన్నట్లు మారిపోరని చెప్పగలరా మీరు..? ప్రభ ప్రశ్నకు మౌనమే సమాధానమయింది.

‘ఇదంతా మీకు తెలియదని కాదు.. మీరూ అన్నీ తెలిసినవాళ్ళే.. కాకపోతే కొంచెం అశ్రద్ధ, అంతే. కానీ ఇప్పటి ఈ చిన్న అశ్రద్ధ తర్వాత మన కొంప ముంచుతుంది. ఊబకాయం తనొక్కటే రాదు. వస్తూ వస్తూ వెంటపెట్టుకుని షుగరూ, బీపీ లాంటి అనేకరోగాలను తెస్తుంది. ఆ తర్వాత మనం జీవితాంతం బాధలు పడాల్సిందే. మన బాగోగులకు చాలావరకు మనమే కారణం అవుతాము. స్వయంకషికి మించిన సాధనం మహిలో లేదంటారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా.. ఇతరులకు ఏమైనా సహాయం చెయ్యగలిగేది.. యువత ఇనుప శరీరాలతో ఉక్కు నరాలతో ఉండాలంటారు స్వామి వివేకానంద. మనం అంతకాకపోయినా మన వరకు మనమైనా బాగుండాలి కదా.. నేనేదో ఉపన్యాసం చెబుతున్నానని నవ్వుకోకండి.. మీకు కోపం వస్తుందేమో.. బాధ పడతారేమోఅని అనుకుని కూడా నామనసాగక మీ మంచి కోరే నేను ఈ పని చెయ్యవలసి వచ్చింది. తప్పయితే..’ అని అంటుండగానే..

‘తప్పా..తప్పున్నరా.. ఎంత ధైర్యమే నీకూ.. దీనికి శిక్ష ఏమిటో తెలుసా..?’ అంటూ రాణి ప్రభను గాఢంగా కౌగిలించుకుని, బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టింది. ఆ దృశ్యాన్ని సెల్‌ ఫోనులో ఫోటో తీస్తూ మనసారా నవ్వాడు రవి.

ఆ సందడికి నిద్ర లేచిన పాపాయి ఆరున్నొక్క రాగం అందుకుంది.

– కోపూరి పుష్పాదేవి

94407 66375

➡️