క్షమించండి సార్‌ !

Apr 21,2024 12:03 #Sneha

ఒక ప్రతిష్టాత్మక విద్యాలయ క్వార్టర్స్‌లో వుండే రోజులవి. పదిహేనేళ్ల పైమాటే! టీచింగ్‌ స్టాఫ్‌ క్వార్టర్స్‌కు కొంచెం దగ్గర్లోనే పిల్లల డార్మిటరీ వుండేది. స్టాఫ్‌ క్వార్టర్స్‌ చుట్టూ చెట్లు చేమలు దట్టంగా పెరిగి వుండేవి. రాత్రిపూట చెట్ల నీడల్లో ఎవరైనా తచ్చాడినా అంతగా తెలిసే అవకాశం లేదు. ఇంటికి ఒక రోజు బంధువులొచ్చారు. ‘ఎవరో కిటికీ దగ్గర తచ్చాడుతున్నట్టు అనిపించింది’ అని సందేహాస్పదంగా చెప్పారు.
అయినా బయటికి వెళ్లి చూసి టార్చి వేసి ‘అలాంటిదేమీ లేదు!’ అంటూ నవ్వుతూ భరోసా ఇచ్చా.నైట్‌ వాచ్‌ మన్‌, గేట్‌ కీపర్‌ కూడా వుండే విద్యాలయ పరిసరాల్లోకి బయట వ్యక్తులు వచ్చే అవకాశం ఉండదని చెప్పారు.
నాలుగు రోజుల తర్వాత ఒక రోజు అర్ధరాత్రి, ‘కిటకీలో నుండి చేతులు చాచినట్టు అనిపించింది డాడీ’ అంటూ ఉలిక్కి పడి లేచి కూచుంది మా అమ్మాయి. హారీ పోటర్‌ పిచ్చిలో వుండే తనతో, ‘దయ్యమేమో?’ అన్నా. అలా అనుకుంటూ నవ్వుతూనే బయటకెళ్లి చూశా. ముగ్గురు విద్యార్థులు డార్మిటరీ వైపు పరుగు తీయడం గమనించా! విషయం అర్ధం అయ్యింది. సరస్వతీ నిలయంలో అపచారం!. లోపలికి వచ్చి పరీక్షగా చూస్తే కిటికీకి ఆనుకొని వుండే కూలర్‌ మీద నేను అలవాటుగా పెట్టుకొనే గోల్డ్‌ వాచ్‌ లేదు! హతాశుడయ్యా, అది అప్పట్లో ఒక డ్రీమ్‌ వాచ్‌! అదిప్పుడు లేదక్కడ! వాచ్‌ కంటే ముందు చదువుకునే పిల్లలు దొంగతనం చేశారనేది విపరీతమైన ఆగ్రహానికి గురిచేసింది శ్రీమతికి.
గుండె రగిలి పోతుంది తనకు. స్కూల్‌ ప్రిన్సిపాల్‌కి మహా ఘాటైన ఫిర్యాదు రాసేసింది శ్రీమతి.
ఉదయం పది గంటలకల్లా నేరస్థులను పట్టేశారు. అక్కడ తచ్చాడింది మేమే అని ఒప్పుకున్నారు. వాచీ తీయలేదనో, తీశామనో ఇంకా చెప్పనేలేదు.
తచ్చాడడం కూడా శిక్షార్హమే. స్కూల్లో శిక్ష అంటే టీసీ ఇవ్వడమే. క్రమశిక్షణ పేరుతో టీసీ ఇచ్చి ఇంటికి గెంటేయడం. ఆ స్కూల్లో సీటు రావాలంటే అత్యుత్తమ ర్యాంకులు సంపాదించాలి. మెరిట్‌ పిల్లలకు మాత్రమే వచ్చే సీటది. పదకొండు గంటలకల్లా ఆఘ మేఘాల మీద ఆ విద్యార్థులను కనిపెంచి, బుద్ధులు నేర్పించలేని ఆ ముగ్గురి తల్లి దండ్రులు రప్పించబడ్డారు.
నిలువెత్తు మట్టి మనుషులు వాళ్ళు. నాటు వేసి వచ్చిన ఆ చేతుల బురద ఆరక ముందే ఉన్నఫళంగా పరుగెత్తుకొచ్చినట్టున్నారు. వారి చేతులకు అంటిన మట్టి పచ్చిగా వుంది. అన్నం తిన్నట్టు కూడా లేదు. బిక్క చచ్చిపోయి, నెత్తురు లేని మొహాల్తో పీలగా వంగి పోయి వున్నారు. భూమిలో కూరుకు పోయారేమో అన్నట్టున్నారు.
వారి మొహాల్లో భీతి వుంది, తప్పు చేసిన భావన వుంది, అన్నింటికీ మించి బిడ్డల భవిష్యత్తు పట్ల భయం వుంది. జోడించిన చేతులు తీయడం మరచిపోయినట్టు అవి అలాగే అతుక్కుపోయి వున్నాయి. వాళ్లు వచ్చిన దగ్గరనుంచి రెండే మాటలు, పదేపదే! ”అయ్యా, బిడ్డలు తప్పు చేశారు, క్షమించండయ్యా, కావాలంటే బొక్కలిరగ దన్నండి సారూ! సదువుకు దూరం సెయ్యొద్దయ్యా”
యుగాల నుంచీ వినిపించే ఆక్రందనలా వుందది! వారి కళ్లలో సుడులు తిరుగుతున్న కన్నీరు. చదువుకునే పిల్లలు దొంగతనం చేస్తే టీసీ ఇవ్వడం మా పద్ధతి. మీ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళిపోండి!
ప్రిన్సిపాల్‌ గద్దింపు. పిల్లలు అప్పటికే వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఆ నిరుపేద కుటుంబాలకు చెందిన ఆ తల్లిదండ్రులు తలొంచుకుని ముద్దాయిల్లా నిలబడ్డారు. కాసేపట్లో ఆ ముగ్గురినీ చదువుల తల్లి ఒడిలో నుంచి గెంటిపారేసే తంతు మొదలైంది. కాసేపు అక్కడ అంతా మౌనం. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఇంట్లోంచి బయటకొచ్చా. గొంతు సంబాళించుకొని ‘సార్‌!’ అంటూ పిలిచా. అందరూ మౌనంగా వెనుదిరిగి చూశారు.
ప్రిన్సిపల్‌తో, ‘సర్‌! ఏమీ అనుకోకపోతే మీరు నన్ను క్షమించాలి. కొంచెం జాగ్రత్తగా వెతగ్గా వాచ్‌ కూలర్‌ సందులో దొరికింది. పాపం, పిల్లల మీద అనవసరంగా నిందపడింది నా కారణంగా. మీక్కూడా అనవసరంగా ఇబ్బంది కలిగించాను. ఏమీ అనుకోకండి సర్‌’ అంటూ చేతులు జోడించాను.
‘అయ్యో పరవాలేదు లెండి’ అన్నారు ప్రిన్సిపల్‌.
కాసేపట్లో పిల్లలు మళ్లీ క్లాసుల్లోకి వెళ్లిపోయారు. వాళ్ల తల్లిదండ్రులు తేలిగ్గా నిట్టూరుస్తూ ఇంటికి మళ్ళారు. అంతా సద్దు మణిగాక ‘వాచ్‌ ఎక్కడీ’ అంది శ్రీమతి సాలోచనగా.

                                                                           ***

ఉదయం ఐదుగంటలకు స్కూలు గ్రౌండ్లో పెరేడ్‌ మొదలైన సందడి. కాసేపట్లో వాకింగ్‌ కోసమని చకచకా రెడీ అయి తలుపు తీశాను. గడప మీద చిన్న పొట్లం లాంటిది కనపడింది. ఆశ్చర్యంగా విప్పి చూశాను. అందులో నా గోల్డ్‌ వాచ్‌. దాంతోపాటూ ఒక కాగితం ముక్క. ”క్షమించండి సార్‌!” ఆ ఒక్క ముక్క నా గుండెల్ని ఒక దుఃఖపు తెరతో వుప్పెనలా ముంచెత్తింది.
‘నిన్న వాచ్‌ ఎక్కడ అని అడిగావు కదా? ఇదిగో ఇక్కడ వాచ్‌!’ అంటూ లోపలికి పరుగెత్తా సంభ్రమంగా! చమర్చిన కన్నీటిని తుడుచుకుంటూ. కొన్ని సంవత్సరాల తరువాత ఓ నిజం తెలిసింది. అందులో ఒకరు ఐఐటీలో టాప్‌ రాంకర్‌ అయ్యాడనీ, మరో ఇద్దరు మంచి ఇంజనీర్లుగా ఉద్యోగాల్లోకి వెళ్లారనీ.

వి. విజయకుమార్‌
85558 02596

➡️