థాంక్యూకు అటూ ఇటూ!

Mar 24,2024 07:53 #Sneha, #Stories

‘నువ్వు ఇప్పటికీ మన స్కూల్‌ మేట్స్‌, కాలేజీ మేట్స్‌.. చాలా మందితో టచ్‌లోనే ఉంటావు కదా’
‘ఆ ! అవును. వాట్స్‌అప్‌ గ్రూప్‌ కూడా ఉంది. సో వాట్‌?’
”…….’
‘చెప్పూ! మన డిగ్రీ గ్రూప్‌లో నిన్ను యాడ్‌ చేయనా!’
‘వద్దొద్దు! ఆ మెసేజ్‌లు చూడడం డిలీట్‌ చేయటం పెద్ద తలనొప్పి!’
‘మరి..?’
‘తనూ.. ఉన్నాడా గ్రూపులో?’
‘తనా? తనెవరూ?’
‘తను.. అతను.. అతనే!’
‘అతనే అంటే ? పేరు లేదా?’
‘నీకు తెలీదా?’
‘ఓV్‌ా! చాలామంది! వారిలో ఎవరు?’
‘అదే… నీకు తెలుసు కదా?’
‘అబ్బా! నాకెలా తెలుస్తుంది నువ్వు చెప్పందే?’
‘విసుక్కోకే తల్లీ! అప్పుడేమో తెగ ఎంకరేజ్‌ చేసేదానివి ఇప్పుడు కసురుతున్నావు.’
‘ఎంకరేజా??? ఓ! అర్థమైంది. కా..నీ ఇప్పుడు ..అతను నీకెందుకు?’
‘ఎందుకంత కంగారు పడుతున్నావూ?’
‘కంగారా? అబ్బే! అదేం లేదు గానీ చెప్పూ.. ఇన్నేండ్ల తర్వాత అతని గురించి ఎందుకూ?’
‘ఎందుకేమిటి? తిందామని. నేను నర మాంసభక్షకిని అయిపోయాను లే!’
‘అవునా? సరే అయితే. గ్రూపులో అయితే లేడు కానీ ఫ్రెండ్స్‌కు చెబుతా కనుక్కోమని. తెలిసిన వెంటనే నీకు చెప్తా తిందువుగాని!’
నవ్వుల పువ్వులు విరిసాయి ఫోన్లో!
***************************************
‘ఎందుకే ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా తీయట్లేదు? అందుకే మెసేజ్‌ చేస్తున్నా’
‘ఏవో పనుల ఒత్తిడి !’
‘అవునా! పిల్లలు వచ్చారా అబ్రాడ్‌ నుండి?’
‘అవునవును. నేనిక ఓ నెలపాటు చాలా బిజీ. సారీ!’
‘సర్లే! ఎంజారు !’
****************************************************
‘నెల దాటింది. ఇంకా బిజీయేనా? ఫోన్‌ కాల్స్‌కు, మెసేజ్లకు స్పందించటం లేదు. పిల్లలు ఇంకా వెళ్లలేదా?’
‘మొన్ననే వెళ్లారు. పిల్లలతో పాటు తిరగటం, ఇంట్లో వంట పని.. బాగా అలసిపోయాన్లే!’
‘అయ్యో! అవునా? వాళ్లు వచ్చినప్పుడైనా వంట మనిషిని పెట్టుకోవాల్సింది’
‘అమ్మ చేతివంటకు మొహం వాచామంటారు. వంట మనిషి అంటే ఎలా?’
‘నీ ఆరోగ్యము, వయస్సూ.. కూడా సహకరించాలి కదా!’
‘ఆరోగ్యాన్ని తింటూ వయసు పెరుగుతుంది. నిజమే కానీ పిల్లలు ఏడాదికోసారే కదా వచ్చేది. నా చేత్తో చేసి పెడితే నాకు తృప్తి.. వాళ్లకు ఆనందమూనూ!’
‘ఆడవాళ్లు.. తల్లులు అల్పసంతోషులే! చిన్ని చిన్ని పొగడ్తలకే పొంగిపోయి పెద్ద పెద్ద కష్టాలు ఓర్చుకుంటారు’
‘అంత పెద్ద కష్టమేమీ నేను పడలేదు. మా ఆయన పడనివ్వనూ లేదు’
‘అవును చాలాసార్లు చెప్తుంటావు మీ ఆయన పురుషోత్తముడని! నేనైతే మీ పెళ్లికి రాలేదు. ఫోటో పెట్టమన్నా పెట్టలేదు నువ్వు.’
‘మరే! మా బంగారానికి దిష్టి తగులుతుందనీ’
‘భలే నవ్వావులే కానీ మీ ఇద్దరి ఫోటో పెట్టవే.’
‘పెట్టొచ్చు కానీ ఉంటే కదా? ఆయనకు ఫోటోలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. నాతోనే కాదు పిల్లలతో కూడా ఫోటో దిగరు’
‘ఓ! సరే అయితే. ఎప్పుడో ఒకప్పుడు నేనే మీ ఇంటికి వచ్చేసి నేరుగానే చూస్తాలే ! మరి నేను అడిగింది మర్చిపోయావూ’
‘ఓ! సారీ. నిజంగానే మర్చిపోయాను. కనుక్కుంటాను’
‘ప్లీజ్‌..’
‘సరే! సరే! తప్పకుండా!’
****************************************************
‘మా అపార్ట్మెంట్‌లో కొందరు ఈశా యోగా సెంటర్‌కు వెళ్తూ నన్ను రమ్మన్నారు. కోయంబత్తూర్‌లో నిన్ను చూడొచ్చని సరే అన్నా. ఎన్నేళ్లయింది మనం కలిసి? నలభై ఏళ్ళు దాటింది కదూ! డిగ్రీ అయ్యాక మనం కలవనే లేదు. నా పెళ్ళి.. ఆయనతో అమెరికా వెళ్ళిపోవటం..! నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. మరో రెండు రోజుల్లో నిన్ను కలవబోతున్నానని!’
‘రెండు రోజులా? ఎప్పుడు బయలుదేరుతున్నారు?’
‘ఏమిటంత కంగారూ? ఎల్లుండి. ఆవలి రోజు కల్లా..’
‘అయ్యో! మేము రేపు సాయంత్రమే కేరళ టూర్‌ వెళుతున్నామే!’
‘అరరే! అవునా?’
‘సారీ!’
‘సర్లే! హ్యాపీ జర్నీ. జాగ్రత్త! ఆ.. అన్నట్లు.. తన ఫోన్‌ నెంబర్‌గాని, అడ్రస్‌ కాని..’
‘అగైన్‌ సారీ! వాకబు చేస్తూనే ఉన్నా!’
‘హుమ్‌!’
‘సారీ’
‘నువ్వెందుకూ సారీ చెప్పటం? ఎందుకో ఓసారి కనీసం మాట్లాడాలనిపించింది. చూడటమెటూ కుదరదు కదా!’
‘ఎందుకంత నిరాశ? ఏమో! కొయ్యగుర్రం ఎగరావచ్చు’
‘గుర్రం ఎగురుతుందబ్బా! కానీ ఎగిరి గుర్రం మీద కూర్చునే వయసు కాదు కదా మనది?’
‘వయసున్నప్పుడు ఎగరాల్సింది మరి!’
‘అప్పుడు ధైర్యం లేకపోయే కదా?’
‘ఇప్పుడు వచ్చిందా?’
‘ఇప్పుడు భయం లేదు.’
‘భయం లేకపోవడమే ధైర్యం కదా?’
‘భయం అనేది ఒక పదమే కానీ అది అనేక రూపాలలో ఉంటుంది. వాటిని ఎదుర్కోవడానికి విశ్వరూప ధైర్యం కావాలి. అంత ధైర్యం అప్పుడు లేదు. ఇప్పుడు భయము లేదు. మన వయసు, జ్ఞానము, పరిపక్వత ఇచ్చిన అభయం!’
‘ఓ! బాగుంది కానీ ఇప్పుడు ఎందుకు నీకు ఆ కోరిక కలిగింది? అదే.. అతన్ని చూడాలని? మాట్లాడాలని?’
‘కొన్ని కోరికలకు మూలాలు.. కొన్ని ప్రశ్నలకు జవాబులు కనుక్కోలేము. కానీ ప్లీజ్‌..’
‘సరే.. సరే! ఐ విల్‌ ట్రై మై బెస్ట్‌!’
*******************************************
‘ఏమైందే నీకు? ఆరోగ్యం బాగా లేదా? ఇరవై రోజులుగా ఫోన్‌ చేస్తే తీయవు. మెసేజీలు చూడవు?’
‘పిల్లలు వచ్చారే! బిజీగున్నాను’
‘పిల్లలా? వాళ్ళామధ్యనే కదా వచ్చారు? వాళ్ళు ఏడాదికోసారి మాత్రమే వస్తారన్నావు. అన్నట్లు మీరిద్దరూ బాగానే ఉన్నారు కదా?’
‘ఆ! బాగానే ఉన్నాము. ఆయనకే కాస్త సుస్తీ చేస్తే పిల్లలు భయపడి వచ్చేసారు’
‘అవునా? ఇప్పుడు ఎలా ఉన్నారు?’
‘ఆ.. బాగానే ఉన్నారు.’
‘నీ గొంతు చాలా నీరసంగా ఉంది. రెస్ట్‌ తీసుకో. టేక్‌ కేర్‌ !’
***********************************************
‘ఓ మై బెస్ట్‌ ఫ్రెండ్‌ ! హ్యాపీ యానివర్సరీ!’
‘యానివర్సరీ ఏమిటి?’
‘నేను నీకో పని చెప్పి ఏడాది అయింది ఇవాల్టితో.’
‘సారీ! నిష్టుర పడుతున్నావు కానీ తెలిస్తే చెప్పనా?’
‘చెప్పవని ఇన్ని రోజులు అనుకోలేదు కానీ ఇప్పుడే జస్ట్‌ ఇప్పుడే నాకు డౌట్‌ వస్తోంది.’
‘ఏమనీ?’
‘నీకు తెలిసీ చెప్పటం లేదేమోనని?’
‘అలా ఎందుకు అనుకుంటున్నావు?’
‘అమాయకంగా అడుగుతున్నావు కానీ నీకు తెలుసు’
‘నిజ్జం! నాకు తెలియదు. చాలా ప్రయత్నించాను. కానీ..’
‘అవును. ప్రయత్నించే ఉంటావు. తెలుసుకునే ఉంటావు. నాకు చెప్పడం లేదంతే!’
‘తెలిస్తే ఎందుకు చెప్పనూ?’
‘ఎందుకంటే.. ఈ వయసులో గత జలసేతుబంధనం ఎందుకని ? దానివల్ల లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవటం ఎందుకనీనూ? అవునా?’
‘నువ్వు అలా నిక్కదీసి అడిగితే..’
‘నువ్వేం చెప్పలేవులే గాని తలుపు తిరు’
‘తలుపు తీయడమేమిటే?’
‘తలుపు ముందు నిలబడి ఉన్నాను కాబట్టి’
‘అవునా? నేను ఇంట్లో..’
‘ఆ! కిటికీలో నుండి కనిపిస్తూనే ఉన్నావులే !’
*********************************************************
‘ఇదెలా జరిగింది?’
పూలదండ వేసిన అతని ఫోటో చూస్తూ గుండె నిండుతున్న తడి!
‘హఠాత్తుగా.. హార్ట్‌ ఎటాక్‌ !’
‘ఓ! పిల్లలు వచ్చారన్నావు. ఆయనకు సుస్తీ అన్నావు కానీ అసలు విషయం చెప్పలేదు కదా?’
‘చెప్పలేక పోయాను! నిజానికి నేనే షాకులో వున్నాను.’
‘అదివరకెప్పుడైనా..??’
‘లేదు. ఆరోగ్యంగానే వుండేవాడు. కానీ ఈమధ్య.. బాగా మూఢ అయ్యాడు. సరిగా తినేవాడు కాదు. నిద్రపోయేవాడు కాదు. అడిగినా ఏం చెప్పలేదు. డాక్టర్‌ దగ్గరకి వెళదామన్నా చిన్నగా నవ్వేసేవాడు. అంతే!’
‘హుమ్‌! మరి ఇదెలా?’ పెళ్లినాటి జంట ఫోటో చూస్తూ గుండె నుండి గొంతుకు పొర్లుతున్న తడి.
‘ఒక అమ్మాయి ఎడాపెడా లవ్‌ ఎటాక్‌ లిచ్చి హఠాత్తుగా పెళ్లి మంత్రంతో గాయబ్‌ అయిపోతే.. ఆ గుండెకు అయిన గాయాన్ని మాన్పే ప్రేమ లేపనం!’
‘అబ్బో! త్యాగమా? జాలా? సానుభూతా??’
‘ఏవీ కాదు. ప్రేమ. అచ్చంగా ప్రేమే! మీ ఇద్దరి మనసుల మధ్య మాటల వంతెన కట్టింది నేనే కదా! ఆ వంతెన కూలిపోయే సమయంలో నేను అతని దగ్గరే ఉన్నాను. చిత్రంగా నాకు చాలా ఆనందంగా అన్పించింది. అది అతని మీద లోపలే దాచుకొన్న ప్రేమ! ఆ ప్రేమతోనే అతని వేదనకు, జీవితానికి కూడా తోడునైపోయాను.’
‘హుమ్‌! అతను మన కాలేజీ అమ్మాయిల కలల రాకుమారుడు కదా మరి!’
‘అతని ప్రేమను పొందిన రాకుమారి నువ్వేగా మరి!’
‘ఆ అదృష్టాన్ని నిలుపుకోలేని దురదృష్టమూ నాదేగా? అయినా ఎన్నిసార్లు అడిగాను ఏడాదిపాటు! తెలీదన్నావూ?’ చివరి చూపుకూ నోచుకోని ఆవేదన కళ్ళలోంచి ఉబికింది!
‘హుమ్‌! అతను నిన్ను మర్చిపోయాడో.. మనసు మడతల్లో దాచి పెట్టుకున్నాడో కానీ.. నాకే విషయంలోనూ అన్యాయం చేయలేదు. పెళ్ళయ్యాక మా మధ్య నీ ప్రసక్తి ఎప్పుడూ రాలేదు. నువ్వు నీ భర్తతో అమెరికాలో ఉండిపోవటంతో మనం ఎప్పుడూ.. ఎక్కడా కలిసే అవకాశం కూడా రాకపోయింది.
మీ ఆయన చనిపోయాక నువ్వు హైదరాబాదు వచ్చేసావని కూడా తెలియలేదు. నా ఫోన్‌ నెంబరు అనుకోకుండా ఎవరో ఫ్రెండ్‌ ద్వారా తెలిసిందని నువు ఫోన్‌ చేసినపుడు నేనెంత కంగారు పడ్డానో తెలుసా?
నిజం చెప్పనా? సంతలో తప్పిపోయిన బిడ్డ దొరికినంత ఆనందం నీ గొంతులో.. చేతిలో బిడ్డను బలవంతంగా లాక్కుపోతారేమో అన్న దిగులు నా గుండెలో! అందుకే నువ్వు పది సార్లు ఫోన్‌ చేస్తే ఒకసారి తీసే దాన్ని. క్లుప్తంగా మాట్లాడి ఫోన్‌ కట్‌ చేసేదాన్ని. ఇదంతా నువ్వు గమనించలేదనుకో! హఠాత్తుగా నువ్వు అతన్ని చూడాలని, మాట్లాడాలని అన్నప్పుడు నాకు భయమేసింది.
మీరిద్దరూ ఒకరినొకరు చూసుకుంటే… మాట్లాడుకుంటే మళ్ళీ మీ మనసులో ప్రేమ చిగురుస్తుందేమో అన్న భయం ఒక వైపు .. ఈ వయసులో ప్రేమ ఏమిటిలే.. మాట్లాడనిద్దాము అనుకుంటూ నేను చాలా తర్జనభర్జన పడ్డాను. నాలో నేను నలిగిపోయాను. ఎంతైనా.. ఏ వయసులో ఉన్నా.. ఆడదాన్ని కదా! నా భర్తతో ఎవరు మాట్లాడినా అందులో మాజీ ప్రేయసి మాట్లాడితే తట్టుకోలేను అన్పించింది. అందుకే చెప్పలేకపోయాను. సారీ! నన్ను మన్నించు. కానీ..’
‘థాంక్యూ!’ ఇద్దరూ ఒకేసారి!
‘ఎందుకూ?’ మళ్లీ రెండు గొంతులూ ఒకే ప్రశ్న!
‘ఇంట్లో వాళ్లనెదిరించలేని పిరికితనం! నన్ను తన ప్రాణంలా ప్రేమించిన అతను ఏమైపోయాడో అన్న నలభై ఏళ్ల గిల్ట్‌ ఫీలింగ్‌ పోగొట్టినందుకు! అతని తోడూనీడా అయినందుకు!’
‘నువ్వు వదిలేసినందుకే నాకు అలాంటి మంచి మనిషి జీవన సహచరుడు అయినందుకు!’
నాలుగు కళ్ళ నుండి రాలుతున్న నీటి బిందువులపైన చిరునవ్వుల క్రాంతి కిరణాల విస్ఫోటన హరివిల్లులు!
ఏ తొలిప్రేమ తన గుండె తలుపు తెరిచిందో.. ఏ ప్రేమ తనను కాదని వెళ్ళిపోయిందో.. అదే ప్రేమ.. మలిసంధ్యలో తిరిగివచ్చి మనసు వాకిట నిలబడి తపన పడుతోందని తెలిసాక, రమ్మనలేక.. పొమ్మనలేక.. పోలేక.. ఆ వేదన భరించలేకే తన గుండె కలత, నలతల ఒత్తిడితో ఆగిపోయిందన్న కఠిన సత్యం ఎప్పటికీ తెలుసుకోలేని వారిద్దరి వైపు అతను నిశ్చలంగా, నిర్వికారంగా చూస్తున్నాడు ఫోటోలో నుండి!

  • యం.ఆర్‌. అరుణకుమారి, 8121523835
➡️