నిర్ణయ

May 26,2024 10:45 #katha, #Sneha

‘ఏమి మాయో ఇది.. తెల్ల కాగితంలో నల్ల అక్షరాలు చూసుకుంటే.. మనసు పులకరిస్తుంది. పత్రికా విలేఖరులందరికీ ఇలాగే ఉంటుందా..? విషయం ఎవరిదో .. పత్రిక ఎవరిదో.. పాఠకులు ఎవరో.. పత్రికలో పదేళ్ళు పనిచేసినా మన పేరు వేయరు. కానీ మనం రాసిన వార్త, పత్రికలో వచ్చిందంటే ఎంత ఆనందం.. అప్పుడే ప్రసవించిన బిడ్డను చూసుకునే తల్లిలా ఎంత మురిసిపోతాము’ అనుకున్నాడు పత్రికా విలేఖరి శివసుబ్రహ్మణ్యం వేడివేడి అల్లం టీ తాగుతూ. అది ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న గ్రామం నాగలాపురం.
శివ సుబ్రహ్మణ్యం చిన్న సైజు పత్రికా విలేఖరి. టీవీఎస్‌ బండి ఎక్కి ఊర్లన్నీ డుర్రుడుర్రున తిరుగుతాడు. తను సేకరించిన తెలుగు ప్రాంతీయ వార్తలను తమిళ పత్రికలకు పంపిస్తూ ఉంటాడు. వారికి నచ్చినవి వారు ప్రచురిస్తారు. పత్రికలో వచ్చిందానికి ‘లైనుకింత’ అని తృణమో పణమో ఇస్తారు.
ఎవరైనా ‘ఆదాయం ఎంత వస్తుంది?’ అని అడిగితే ‘డబ్బుదేముంది? నాలుగు పందుల్ని మేపైనా సంపాదించవచ్చు. చదివినోళ్ళు ”భలే రాసినావబ్బా” అని చెబితే చాలు.. అదే వెయ్యిన్నూట పదహార్లు అని ఎగిరెగిరి చెప్పేవాడు. వారిచ్చే డబ్బు తను వాడే గంజి పట్టిన తెల్ల పంచె, తెల్ల చొక్కా గుడ్డల అలంకరణకే చాలదు.
అయినా పల్లెల్లో జనాలు తనను ముఖ్యమైన మనిషిగా గుర్తించడంతో ఆ వృత్తిని వదలకుండా ఉంటున్నాడు. ఆదాయం బెత్తెడైనా ఊరంతా పెత్తనాలు చేస్తాడు. ఊర్లోవాళ్ళు ‘ఆహా..ఓహో’ అంటే కుషీ అవతాడు. అలాగని నందిని పందీ చేయడు. పందిని నందీ చేయడు. ఉన్నది ఉన్నట్లు రాస్తాడు. ఆ ముక్కుసూటి తనం వల్ల అప్పుడప్పుడూ ముక్కుకు సొట్టలు కూడా పడ్డాయి. ఆదాయం చాలక, ఎవరైనా పిలిస్తే వెళ్ళి, వారి ఇండ్లకు వాస్తు చూస్తూ ఉంటాడు. ఆ వచ్చే డబ్బులతో కాలం గడుపుతూ ఉన్నాడు.
ఒకరోజు సాయంత్రం- ఊర్లోని మత్స్యావతారంలో ఉన్న మహా విష్ణువు గుడికి ఓ తమిళ నటి దర్శనానికి వచ్చింది. విషయం తెలిసి వార్త సేకరిద్దామని ఫోటో గ్రాఫర్‌ని తీసుకుని వెళ్ళాడు. ఇంటికొచ్చేసరికి బాగా ఆలస్యం అయ్యింది. ఊర్లో కరెంటు లేదు. ఇంట్లో దీపం వెలగడం లేదు. తిరుపతి పాలిటెక్నిక్‌ కాలేజీలో ఇ.సి.ఇ. డిప్లొమా కోర్సు చదివే కూతురు నిర్ణయ ఇంకా ఇంటికి రాలేదేమోనని తలుపు తీశాడు. దీపం వెలిగించబోయాడు. చేతికి ఓ కాగితం తగిలింది. ‘ఏమిటా..’ అని చూస్తూ ఉంటే కరెంట్‌ వచ్చింది. అద్దాలేసుకుని చదివాడు.
‘నచ్చినవాడితో వెళ్ళిపోతున్నానని, క్షమించమని కూతురి వేడుకోలు’. చదివి పారేసిన పాత న్యూస్‌ పేపర్‌లా ముఖం కళ తప్పింది.
‘ఏమి లోటు చేసినాను ఈ అమ్మికి? ఎందుకిలా చేసింది? నాకు చెబితే నేనే పెళ్ళి చేసి ఉండేవాడిని కదా… ఛ.. నాన్ననే మోసం చేసిన దాని గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించ కూడదు. ఎక్కడి కెళ్ళిందో.. ఎవడితో వెళ్ళిందో.. పోతే పోనీ.. నేనుగా ఎక్కడా వెదకను. దాని ముఖం చూడను’ అని మనసులోనే శపథం చేసినాడు. చిన్నగా
లేచి చన్నీళ్ళ స్నానం చేశాడు.
ఇంట్లోని రెండు పచ్చ అరటిపండ్లు తింటూ.. ఇన్నాళ్ళూ ఊర్లో వాళ్ళు ‘పెళ్ళాం లేనోడు అనేవాళ్ళు. ఇకమీదట పెళ్ళాం, బిడ్డలూ లేనోడు’ అనబోతారు. చాన్నాళ్ళుగా ఊర్లో వాళ్ళ వార్తలు రాసేవాడిని. ఇప్పుడు వార్తల్లోని వ్యక్తినయ్యాను అని ఆలోచిస్తూ నిద్రపోయాడు.
రోజులు ఆకుల్లా రాలిపోతున్నాయి. సూర్యుడు ఆకాశంలోకి ఇంకా సరిగ్గా తొంగిచూడలేదు. ఇంటి ముందరి గోరింటాకు చెట్టు కింద నల్లబండ మీద కూర్చుని ఉన్నాడు శివసుబ్రమణ్యం. పేడదిబ్బ మీద మొలకెత్తిన చిక్కుడు గింజలు దండం పెడుతున్నట్లుగా కనిపించాయి. టీలు తాగితాగి వెండిరంగులోకి మారి ఉన్న మీసాలను చేతి వేళ్ళతో తడుముకుంటూ వాటినే చూస్తూ ఉన్నాడు.
చిన్నగా చినుకులు పడటం ప్రారంభమయ్యింది. వానలోనే తడుస్తూ కూర్చున్నాడు. మట్టివాసన
తెరలుతెరలుగా వస్తోంది. దూరంగా రెండు కోళ్ళు వానకి తడుస్తూ నీడకోసం పరుగులు తీస్తున్నాయి.సాయంకాలమైతే ఇంటి ముందర మంచమేసి పడుకుని ఆకాశాన్ని చూసే నిర్ణయ అతడి మనసులోకి తొంగి చూసింది.
ఏదో ఒకరోజు నక్షత్రాల దగ్గరికి వెళ్లాలని కలలు కనేది. పిచ్చి పిల్ల.. ఆవేశంగా నిర్ణయం తీసుకుంది అనుకున్నాడు. వాన నీటిలో ఒక చీమ కొట్టుకులాడుతోంది. ఇంతలో నీటిలో కొట్టుకొచ్చిన ఆకు ఒకటి దానికి దొరికింది. దాని మీద ఊరేగుతూ నీళ్ళల్లో కొట్టుకుపోసాగింది. దాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు.
ఇంతలో గుండె దడ మొదలయ్యింది. చెమటలు పట్టసాగాయి. ఒక్క సారిగా శివ సుబ్రహ్మణ్యంకి భయమేసింది. అప్పుడు గుర్తుకొచ్చింది అతడికి, రెండురోజులుగా బి.పి. మాత్రలు వేసుకోవడం మరిచిపోయా నని. గబగబా ఇంట్లోకి వెళ్ళి మాత్ర వేసుకున్నాడు.
బీ.పి. రీడింగ్‌ చాలా ఎక్కువగా ఉందని, జాగ్రత్తగా ఉండమని డాక్టర్‌ చెప్పింది గుర్తుకొచ్చింది. ఎందుకో.. వెంటనే నిర్ణయను చూడాలనిపించింది శివసుబ్రమణ్యంకి.
‘ఉంటామో..పోతామో.. పండు మాగింది, ఎప్పుడైనా రాలి పోతుంది. ఒక్కసారి నిర్ణయను చూసి వద్దాం’ అనుకున్నాడు.
నిర్ణయ, తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరులో ఊరి మొదట్లో కనిపించిందని, ఏమి చేస్తోందో తెలియదని..తెలిసిన వాళ్ళు చెప్పింది గుర్తుకొచ్చింది. ఎలాగోలా వెతికి పట్టుకోవచ్చని సంచి సర్దుకుని అప్పటికప్పుడే తమిళనాడు బస్సు ఎక్కాడు. నిర్ణయ ఎలా ఉందో.. ఏమి చేస్తోందో.. అని ఆలోచిస్తూ ప్రయాణం చేశాడు.
తిరువళ్ళూరు వచ్చిందని కండక్టర్‌ చెప్పడంతో ఆలోచనల్లోంచి బయటపడి బస్సు దిగాడు. ఊరంతా వెదుక్కుంటూ వెళ్ళాడు. కనిపించినవారినంతా అడిగాడు. ఆచూకీ దొరకలేదు. ఆకలిగా ఉంటే టీ అంగడికి వెళ్ళి టీ తాగుతూ దిక్కులు చూస్తూ ఉన్నాడు. అతడి కంటికి ఊరి బయట రెండు పందుల ఫారములు కనిపించాయి.
అక్కడ ఎవర్నైనా అడిగి చూద్దామని వెళ్ళాడు. ‘గుర్‌ గుర్‌’ అని పందులు అరుస్తూ ఉన్నాయి. ‘గూచ్‌.. గూచ్‌’ అని వాటిని అదిలిస్తూ ఓ అమ్మాయి గడ్డి వేస్తూ ఉంది. తమిళ భాషలో ”మేము తెలుగువాళ్ళం. మా అమ్మాయి పేరు నిర్ణయ. ఆమె ఇక్కడెక్కడో ఉంటోందని తెలిసింది. మీరు ఏమైనా ఈ ఫోటో చూసి వివరాలు చెప్పగలరా?” అని అడిగాడు.
అప్పుడే రైలు పట్టాల మీద రైలు వేగంగా పోతుండటంతో ఆమెకు ఏమీ వినిపించలేదు. గడ్డి వేయడం పూర్తయ్యాక తల ఎత్తి చూసింది.
ఆమెను చూసిన అతడి మెదడు మొద్దుబారిపోయింది. అతడి కళ్ళను ఎవరో సూదులతో గుచ్చినట్లు, కాళ్ళు నరుకుతున్నట్లు అనిపించింది. ‘అయ్యో, భగవంతుడా! నాకింత అన్యాయం చేశావేమి స్వామీ? కష్టపడి చదివించిన కూతురు ఇంజినీరు అవుతుందని ఆశపడ్డానే.. లక్షల జీతం సంపాదిస్తుందని అనుకున్నానే.. దేశ విదేశాలు తిరుగుతుందని, మంచి ఉద్యోగం చేస్తుందని కలలు కన్నానే..ఇదేమిటి.. పందులు పెంచుకుంటూ ఉంది’ అంటూ గుండెనిండా దు:ఖంతో కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే కూర్చున్నాడు.
‘నాన్నా..!’ అని అరుస్తూ నిర్ణయ పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని పట్టుకుంది. ఇద్దరూ ఒకర్ని పట్టుకుని మరొకరు ఏడ్చారు. కొద్దిసేపు అక్కడ మౌనం రాజ్యమేలింది. తేరుకున్న అతడు.. చిన్నగా ‘మాంసాహారం అంటేనే మండిపడే దానివి. వీధిలో వాళ్ళు కూర వండుతుంటేనే ముక్కు మూసుకుని నడిచే దానివి. ఎవరైనా కోడిగుడ్డు ఇచ్చినా వద్దు అనేదానివి అలాంటిది.. సీమ పందుల్ని పెంచుతున్నావా..?’ అని బాధగా అడిగాడు.
‘పందుల్ని మేపడం అంటే ఎందుకు నాన్నా అందరికీ చులకన? అది వృత్తి కాదా? ఏ వృత్తి అయినా నోట్లోకి నాలుగేళ్ళూ పోవడానికే కదా. మేము చేస్తున్నది మంచి పనే అని మేము నమ్ముతున్నాం. అదే మాకు గొప్ప. నీకు తెలుసో తెలియదో.. సీమ పందులకు మార్కెట్‌లో డిమాండ్‌ బాగా ఉంది. శ్రమ తక్కువ. లాభం ఎక్కువ. అమ్ముడు కావేమో అన్న భయమే అక్కరలేదు. ఒక ఎకరం భూమి సాగుచేస్తే ఎంత లాభం వస్తుందో రెండు పందులను పెంచితే అంతే లాభమొస్తుంది నాన్నా. మొదట్లో ఇరవై సీమ పందుల్ని తెచ్చి, పెంచడం ప్రారంభించాం. అవి ఇప్పుడు రెండువందలయ్యాయి. స్వంత స్థలమే కాబట్టి బాగానే గిట్టుబాటు అవుతోంది. అయినా ఈ వృత్తిలో నేను సంతోషంగానే ఉన్నాను కదా నాన్నా’ అని వివరించింది.
శివ సుబ్రహ్మణ్యంను, ఫారానికి కొంచెం దూరంగా పక్కనే ఉన్న ఇంటికి తీసుకెళ్ళింది. ఇంటి చుట్టూ గోరింటాకు చెట్లే. దేవుడి గదిలో వరాహస్వామి ఫోటోకి పూలు పెట్టి ఉండటం చూశాడు. అతడికి నచ్చిన నల్లరాగుల సంగటి, చింతాకు పచ్చడి, గోరు చిక్కుడుకాయల తాలింపు చేసింది. గోరింటాకు పండిన చేతులతో అన్నం వడ్డిస్తూ ‘పందిని పెంచితే పాత అప్పులు తీరుతాయి, కోడిని పెంచితే కొత్త అప్పులు తీరుతాయంట నాన్నా” అని చెప్పింది. పడీపడీ నవ్వినాడు. కొసరి కొసరి వడ్డించింది. తృప్తిగా తిని చేతులు కడుక్కున్నాడు. తెచ్చుకున్న తెలుగు పేపర్‌ కొద్దిసేపు చదివి ‘సరే, నేనిక బయలుదేరుతాను!’ అన్నాడు.
‘ఆయన చెన్నైలో ఓ హోటల్‌ వారితో వారం వారం మాంసం సరఫరా చేసే కాంట్రాక్ట్‌ అగ్రిమెంట్‌ కోసం వెళ్ళి ఉన్నారు. రాత్రికి వచ్చేస్తారు. మాట్లాడి వెళ్ళొచ్చు కదా’ అని అడిగింది.
‘నాదేమైనా గవర్నమెంటు ఉద్యోగమా.. లీవు పెట్టి కూర్చుంటే జీతం రావడానికి. ఏ పూటకా పూట కొత్తే ఈ వృత్తిలో. పల్లె పల్లె తిరిగి వార్తలు సేకరించి పంపిస్తే ఏవి ప్రచురిస్తారో తెలియదు, ఏవి చెత్తబుట్ట పాలు చేస్తారో తెలియదు. అయినా మన ప్రాంతపు చిన్న వార్త కూడా నా ద్వారా మిస్‌ అవకూడదనేది నా అభిప్రాయం’ అని చెప్పి ఇంటి బయటికి వచ్చాడు.
‘కోడి చూరెక్కి, తను కూత కూస్తేనే తెల్లవారుతుందనుకున్నట్లు ఉంటుంది నాన్నా, నీ వ్యవహారం” నిష్టురంగా అంది.
మురికి అయిన నాన్న అద్దాలను మెత్తటి గుడ్డతో శుభ్రంగా తుడిచి ఇస్తూ ‘సరే, ఈ డబ్బైనా ఖర్చుకు వాడుకో నాన్నా!’ అని అయిదు వేలు ఇవ్వబోయింది.
‘డబ్బుల్లేక తగినంత తిండి తినలేననా నీ ఉద్దేశ్యం? చీమలకు చక్కెర దొరకగాలేనిది మనుషులమైన మనకు నాలుగు మెతుకులు దొరకవా తల్లీ!’
‘నిన్ను ఆ దేవుడు కూడా మార్చలేడు నాన్నా!’ అని చెప్పి దారిలో తినడానికి ఉడకబెట్టిన వేరు శెనక్కాయలు పొట్లం కట్టి ఇచ్చింది. ఫాంలో ఒకదాని మీద ఒకటి పడి దొర్లుతున్న పిల్లపందులని చూస్తూ ‘నువ్వు చేసే వృత్తి నాకు నచ్చవచ్చు, నచ్చక పోవచ్చు. అది వేరే విషయం. నువ్వు క్షేమంగా, సంతోషంగా ఉన్నావు. అది చాలు. అయినా అనురాగ్‌లో ఏమి చూసి ప్రేమించావు?’ అని అడిగాడు.
తల వంచి నిలబడిపోయింది నిర్ణయ. ‘నీకు చెప్పాలనిపిస్తేనే చెప్పమ్మా!’ అన్నాడు గీర గొంతుతో.
‘నీ దగ్గర దాపరికం ఏముందిలే నాన్నా.. నాకు మూర్ఛ సమస్య వుందని నీకు తెలుసు కదా. ఆ సమస్య నన్ను నీడలా వెంటాడేది. ఏ క్షణం ఏమి జరుగుతుందో అని భయంభయంగా ఉండేది.
నేను రోజూ పాలి టెక్నిక్‌ కాలేజీకి మన ఊరి నుంచి తిరుపతికి బస్సులో వెళ్ళేదాన్ని. బస్టాండు నుంచి మైలు దూరంలో ఉన్న కాలేజీకి, నడకనే వెళ్ళేదాన్ని. ఒకరోజు దారిలో గంగమ్మ గుడి దగ్గర మూర్ఛ వల్ల గిలగిలా కొట్టుకుంటూ పడిపోయాను.
ఆ రోజు ఆటో డ్రైవర్‌ అయిన అనురాగ్‌ నన్ను చూశాడు. గుడ్డ తల కింద పెట్టి, నన్ను ఒక పక్కకి పడుకోబెట్టి, చిన్నచిన్న సేవలు చేసి కాపాడాడు. అప్పుడు పరిచయమయ్యాడు.
ఆ రోజు నుంచీ అతడు నన్ను బస్టాండు నుంచి కాలేజీకి డబ్బు తీసుకోకుండా ఆటోలో తీసుకెళ్ళే వాడు. సాయంకాలం కాలేజీ నుంచి బస్టాండుకు చేర్చేవాడు. ఆ ప్రయాణంలో ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నాము. అతడు అప్పటికే వెటర్నరీ సైన్సులో డిప్లొమా చేసి ఉన్నాడు. ఉద్యోగం రాలేదని ఆటో నడుపుకుంటూ ఉన్నాడు. నాకు ఎన్నో విషయాలు ‘మన’ అనే వాళ్ళతో మాట్లాడాలనిపించేది. అమ్మ నా చిన్నప్పుడే చనిపోవడం, నువ్వేమో పనుల మీద ఉండటం, తోబుట్టువులు ఎవ్వరూ లేకపోవడంతో అతడికి మానసికంగా దగ్గరయ్యాను.
మన ఇంట్లో నేను చెప్పేది వినేవాళ్ళు ఎవ్వరూ లేకపోయేసరికి ఒంటరితనం అనుభవించేదాన్ని. కుదిరినప్పుడల్లా నా విషయాలన్నీ అతడికి మనసు విప్పి చెప్పే దాన్ని. అన్నీ ఓపికగా వినేవాడు. నా కోర్స్‌ పూర్తి అయ్యే సమయంలో ఇద్దరం పెళ్ళి చేసుకోవాలనుకున్నాం. వాళ్ళ అమ్మానాన్నలు ఒప్పుకున్నారు.
నీకు చెబితే అడ్డు చెబుతావేమోనని, భయపడ్డాను. మన ఊర్లో వాళ్ళు తలా ఒక మాట అని నా మనసు గాయం చేస్తారేమోనని అనుమానపడ్డాను. అందుకే ఎవ్వరికీ చెప్పకుండా ఇక్కడే గుడిలో పెళ్లి చేసుకున్నాం. అనురాగ్‌ చాలా మంచివాడు నాన్నా!’ అని చెప్పింది.
తన కూతురే జీవితం పట్ల స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా ఎదిగినందుకు ఆశ్చర్యపోయాడు. వెళ్ళి వస్తానని చెప్పి చిన్నగా అక్కడి నుంచి కదిలాడు శివసుబ్రమణ్యం.
‘ప్రేమ ఎంత పనైనా చేయిస్తుందని విన్నాను. ప్రేమరాహిత్యం ఎంతదూరమైనా తీసుకెళ్తుందని కళ్ళారా చూస్తున్నాను. ఇంట్లో దొరకని ప్రేమ బయట దొరికితే.. స్వంత రక్తం కూడా పరాయిది అయిపోతుందేమో ..! ఏదేమైనా మంచివ్యక్తినే ఎంచుకుంది’ అనుకుంటూ బస్టాండు వైపు అడుగులేశాడు.

ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు
93936 62821

➡️