ఇల్లు

Jun 30,2024 08:55 #kavithalu, #Sneha

అలాంటి ఇలాంటిది కాదు నా ఇల్లు!
ఇంటితో ఎప్పుడైనా మాట్లాడారా మీరు?
ఇప్పుడంతా ఇంటితో మాట్లాడటం
నా దినసరి చర్యగా మారిపోయింది

వాకింగ్‌, దినసరి పత్రిక,
ఉదయం ఫిల్టర్‌ కాఫీ..
ఇవి కూడా కొన్నిసార్లు
సమయం తప్పవచ్చు

కానీ నేను ఇంటితో
మాట్లాడడం మాత్రం
తప్పడం అంటూ లేనే లేదు

అదీ గత కొద్ది రోజులుగా
ఆఫీసుకు బయలు దేరుతున్నప్పుడో
అర్జంటు పని మీద పొరుగూరి పయనమో
అతిథుల రాకనో ఏదైనా సరే
ఇంటితో చెప్పడం
అలవాటై పోయింది

చెక్క తలుపు ద్వారంలో
బీగం దూర్చి తాళం వేసి
వాకిలి గ్రిల్‌ గేటు మూసి
‘వెళ్లి వస్తాను’ అని చెబుతాను
ఇంటితో!

‘భద్రం… జాగ్రత్తగా వెళ్ళు’,
తల్లిలాగా సుద్దులు చెప్పడం కానీ,
‘ఎప్పుడు తిరిగి వస్తావు?’
భార్యలాగా ప్రశ్నించిందిగానీ లేదు
నా ఇల్లు ఎప్పుడూ!
మౌనంగా ఉండటం మాత్రమే తనకి తెలుసు,

కొన్నిసార్లు ఎదురుచూడని సమయంలో
అలవాటు కన్నా ముందుగా
చెప్పా పెట్టకుండా వచ్చి
తాళం తీస్తున్నప్పుడు
చిరు సంతోషంతో ఇల్లు పులకరించడం
నాకు తెలుసు

కంప్యూటర్‌, దూరదర్శిని పెట్టె
సెల్‌ ఫోన్‌, మ్యూజిక్‌ సిస్టం అంటూ
ధ్వనులతో అదరగొట్టినా
భూదేవిలాగా ఓర్పుతో
వింటూ ఉంటుంది నా ఇల్లు

చాలాసేపు వెలిగే లైట్లు
రోజుల తరబడి ముగ్గులు పెట్టని వాకిలి..
దేనికీ నొచ్చుకోవడం గానీ
ఉసూరుమనడం గానీ
నేను చూసింది లేదు

అర్ధ ఝామంలో ఎదురింటి గోడ పక్కగా
పార్క్‌ చేసిన నా బైక్‌ శబ్దానికి
నా ఇల్లు కుతూహలం చెందినట్లు
అనిపిస్తుంది!

అర్ధరాత్రి ప్రాణం పోసుకుంటున్న
నా కవితలను పైకప్పు కోణం నుంచి
మొట్ట మొదట చదివేది
నా ఇల్లే!

నా ఇంటి గురించి
అతిశయమైన ఆలోచనలతో
బైక్‌ మీద వెళ్తున్నప్పుడు
పొరబాటున అతిక్రమించబోయిన
సిగల్‌లో

నా మీద గుద్దుకోకుండా విశ్వ ప్రయత్నం చేసి
బండిని కీచుమంటూ నిలిపిన
భారీవాహన చాలకుడు అరిచాడు.
”ఏంటయ్యా… ఇంట్లో చెప్పి వచ్చేశావా?!”

తమిళం: ఆర్‌.కె. రామనాథన్‌
తెలుగు అనువాదం: గౌరీ కృపానందన్‌
09791069485

➡️