వామాకుతో వహ్వా..!

Jan 28,2024 10:14 #cooked
vamaku recipes

వామాకులు ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగులో ఉండి, మందంగా ఉంటాయి. ఇవి వెడల్పుగా, గుండ్రంగా ఉండి అంచుల చుట్టూ రంపపు నొక్కు ఉంటుంది. వాటిపైన మృదువైన నూగులా ఉంటుంది. ఈ మొక్క శాస్త్రీయనామం ‘ప్లెక్ట్రాంథస్‌ అంబోనికస్‌’. కుండీలో, గార్డెన్‌లో సులభంగా పెంచుకునే సౌలభ్యం ఉన్న మొక్క ఇది. ఈ ఆకుతో బజ్జీలు వేయడం అందరికీ తెలిసిందే! అలాగే ఇది మంచి ఔషధకారి. ఆకలి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జలుబు, దగ్గును తగ్గించడానికి దీని ఆకుల కషాయం మంచి ఉపయోగకారి. ఇన్ని ఔషధ గుణాల కారణంగానే ఆహారంలో మరిన్ని రుచుల రూపంలో తీసుకోవచ్చు. అందుకు తేలికగా చేసుకోగలిగే కొన్ని రకాల వంటకాలున్నాయి. అవి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

vamaku recipes

రోటి పచ్చడి..

కావలసినవి : వామాకులు – 20, నిమ్మకాయ – ఒకటి, ఉప్పు – తగినంత, వాము – చిటికెడు, ఎండుమిర్చి – 8, వెల్లుల్లి రెబ్బలు – 4, ఉల్ల్లిపాయ – ఒకటి, పసుపు – చిటికెడు, నూనె – 4 స్పూన్లు, ఆవాలు – 1/2 స్పూను, కరివేపాకు – 2 రెబ్బలు

తయారీ : బాండీలో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చితో తాలింపు పెట్టుకోవాలి. తాలింపులోనే ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి. దీనిని వేరే గిన్నెలోకి తీసుకుని, అదే బాండీలో స్పూను నూనె వేడి చేసి వామాకును వేయాలి. స్టౌ సిమ్‌లో పెట్టి ఈ ఆకును వేయించాలి. అలా వేయించేటప్పుడే పసుపు, ఉప్పు, వాము కూడా వేయాలి. ఆకు మగ్గిన తర్వాత స్టౌ ఆపి చల్లారనివ్వాలి. ముందుగా వేయించిన ఎండుమిర్చి, వెల్లుల్లి ముందుగా కచ్చాపచ్చాగా నూరి, మగ్గిన వామాకు మిశ్రమం, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా నూరుకోవాలి. దీనిని పోపు ఉంచిన గిన్నెలోకి తీసుకుని, నిమ్మరసం కలిపాలి. అంతే కమ్మని వామాకు పచ్చడి రెడీ.

పప్పు

కావలసినవి : వామాకులు – కప్పు, కందిపప్పు- కప్పు, తాలింపు గింజలు- స్పూను, పసుపు – స్పూను, ఎండుమిర్చి – 4, చింతపండు -పెద్ద నిమ్మకాయంత, నూనె-తగినంత

తయారీ : ముందుగా కందిపప్పును కుక్కర్‌లో పసుపు, కారం, చింతపండు వేసి ఉంచుకోవాలి. బాండీలో రెండు స్పూన్ల నూనె వేడిచేసి తాలింపుగింజలు, ఎండుమిర్చి వేయాలి. ఇవి వేగిన తర్వాత వామాకు వేసి, మగ్గే వరకూ తిప్పుతూ వేయించాలి. చివరిలో కొత్తిమీర సన్నగా తరగి వేయాలి. ఇది కూడా కొంచెం వేగాక, ఉడికించిన పప్పును మెదిపి, వేసుకోవాలి. అంతే ఘుమఘుమలాడే వామాకు పప్పు రెడీ.

మజ్జిగ చారు..

కావలసినవి : వామాకులు – 10, చిక్కటి మజ్జిగ (పులవకూడదు)- లీటరు, వాము- చిటికెడు, నూనె – 2 స్పూన్లు, పచ్చిమిర్చి- 4, పచ్చికొబ్బరి తురుము – 2 స్పూన్లు, నానబెట్టిన శనగపప్పు – 2 స్పూన్లు, అల్లం – అరంగుళం ముక్క , పసుపు – చిటికెడు, ధనియాలు – స్పూను, కరివేపాకు – 2 రెబ్బలు, ఉప్పు – తగినంత

తయారీ : బాండీలో స్పూను నూనె వేడి చేసి వామాకు, కొంచెం ఉప్పు వేసి మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చికొబ్బరి తురుము, నానబెట్టిన శనగపప్పు, అల్లం, పసుపు, ధనియాలు, వేయించిన వామాకులను మెత్తని ముద్దగా నూరాలి. ఈ ముద్దను మజ్జిగలో కలపాలి. ఆకు వేయించిన బాండీలోనే మరో స్పూను నూనె వేడి చేసి వాము, కరివేపాకు వేయించాలి. దీనిలో మజ్జిగ చారును పోసి, ఐదు నిమిషాలు ఉడికించాలి. అంతే టేస్టీ టేస్టీ వామాకు మజ్జిగ చారు రెడీ. దీనిలో ఉడికించిన దోసకాయ, ముల్లంగి, బూడిద గుమ్మడి లాంటి కూరగాయ ముక్కలు కలుపుకోవచ్చు.

➡️