వీడిన గ్రహణం!

Feb 18,2024 08:10 #Sneha, #Stories

‘శరణమయ్యప్ప.. స్వామి శరణమయ్యప్ప’..అంటూ ప్రసాద్‌ సెల్‌ మోగుతోంది.

‘ఈ రోజు బాబు పేరు మీద అర్చన చేయించాలి, ఆలస్యమయిపోతుంది తొందరగా వెళ్ళాలంటే ఫోన్‌ వస్తోంది, ఎవరు చేసారో?’ మనసులో అనుకుంటూ హడావిడిగా వచ్చి ఫోన్‌ చూశాడు ప్రసాద్‌.

‘ఏదో కొత్త నంబర్‌ నుండి కాల్‌ వస్తుంది’ పైకే అంటూ ఆన్‌ చేశాడు.

‘హలో’ ఒక అందమైన స్వరం బెదురుతూ వినిపించింది.

‘హలో ఎవరమ్మా?’ ఆశ్చర్యంగా అన్నాడు ప్రసాద్‌.

‘నేను.. నేనూ..’ అవతల తడబాటు.

‘ఆ.. నువ్వు ఎవరమ్మా?’..

‘అంకుల్‌, నేనూ.. నా పేరు మృదుల. నేను మీ అబ్బాయి రోహిత్‌ కంపెనీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాను. నేను మీతో కొంచెం మాట్లాడాలని కాల్‌ చేశాను..’ అన్నది మృదుల.

‘చెప్పమ్మా! టైం చూసుకుంటూ’ గడియారం చూస్తూ అన్నాడు ప్రసాద్‌.

‘అంకుల్‌! రేవంత్‌, నేను ప్రేమించుకున్నాము. ఇది మీకు తెలియదని నాకు తెలుసు. మీకు మా ప్రేమ విషయం చెప్పాలనుకున్న సమయంలోనే ఆంటీ చనిపోయారు. మీరు ఆంటీ పోయిన దిగులు నుండి ఇంకా బయటకు రాలేదని తను ఇప్పటివరకు మా విషయం మీతో చెప్పలేదు..’ మెల్లిగా అన్నది మృదుల.

దాదాపుగా ఒక లాంటి షాక్‌లోకి వెళ్లిపోయిన ప్రసాద్‌ ‘ఊ’ అనడం కూడా మరచిపోయి వింటున్నాడు.

‘నేను కొన్ని కారణాల వల్ల రోహిత్‌ని పెళ్లి చేసుకోవడం కుదరదు. అది నేను రోహిత్‌కి చెప్పాను. కానీ తను వినడం లేదు. ఇంకా ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు అంకుల్‌. ఇప్పుడు నా మానాన నన్ను వదిలేయమని మీరు మీ అబ్బాయికి నచ్చజెప్పండి. నేను రోహిత్‌ను వద్దనడానికి నా కారణాలు నాకున్నాయి. నా వెంటపడి నన్ను అల్లరి చేయొద్దని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. ఇది నా మాటగా మీరు రోహిత్‌కి చెప్పండి. నేను చెప్పాలనుకున్నదంతా మీకు చెప్పేశాను. నన్ను క్షమించండి అంకుల్‌. నేను ఫోన్‌ పెట్టేస్తున్నాను’ అంటూ ఫోన్‌ కట్‌ చేసింది మృదుల.

కొంచెంసేపు సోఫాలో కూర్చుండి పోయాడు ప్రసాద్‌. జరిగిన సంభాషణంతా మననం చేసుకున్నాడు. ‘అంటే రోహిత్‌ గత పదిహేను రోజుల నుండి దిగాలుగా ఉండటానికి కారణం ఇదా? ఎందుకు ఆ అమ్మాయి రోహిత్‌ జీవితంలోకి వద్దామనుకొని మళ్ళీ తిరస్కరించింది? ఏమీ జరిగి ఉంటుంది?’ అనుకుంటూ చాలా అలజడికి లోనయ్యాడు ప్రసాద్‌.

‘ఈ విషయం ఎవరు చెప్తారు? మృదులకి మళ్ళీ కాల్‌ చేయనా? రోహిత్‌తోనే మాట్లాడనా?’ అనుకుంటూ అలాగే ఉండిపోయాడు ప్రసాద్‌.

అతడి మనసు రోహిత్‌ వైపే మొగ్గు చూపింది. ఫోన్‌ చేతిలోకి తీసుకొని, కాల్‌ చేశాడు ప్రసాద్‌.

సరిగ్గా ఆ సమయానికి బిజినెస్‌ పని మీద కాకినాడ వెళ్లిన రోహిత్‌ రాజమండ్రి తిరిగి వస్తున్నాడు. ఆ రోడ్‌ వెంట ఎప్పుడు వెళ్తున్నా, వస్తున్నా ఉప్పాడ దగ్గరకు రాగానే కాసేపు బీచ్‌ దగ్గర ఆగడం అతనికి అలవాటు. అలాగే సముద్రాన్ని చూస్తూ నిలబడ్డాడు రోహిత్‌.ఉప్పాడ బీచ్‌ ప్రత్యేకత ఏమిటంటే సముద్రపు అలలు రోడ్‌ మీదకు వచ్చి తాకుతూ వెళ్తాయి. ఆ నీళ్లను తాకుతూనే వాహనాలు అటూ ఇటూ వెళ్తుంటాయి. ఇలా మరెక్కడా కూడా బీచ్‌ రోడ్‌కి ఆనుకొని ఉండదు. నీలివర్ణంలో ఆకాశాన్ని చుంబించాలని ఎగసిపడే అలలు ఎగరలేక, శ్వేతవర్ణంలో నేలను తాకడం చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటుంది.

అంతలో అతని మొబైల్‌కి మెసేజ్‌ వచ్చిన సౌండ్‌ వినిపించి తీసి చూశాడు. ‘ఓహ్! మృదుల నుండి మెసేజ్‌’.. అనుకుంటూ ఆతృతగా మెసేజ్‌ ఓపెన్‌ చేశాడు.

‘రోహిత్‌, నేను మీ నాన్నగారితో మన విషయమంతా చెప్పేశాను. ఇక నాకు కాల్‌ చేయడం కానీ, నన్ను కలిసే ప్రయత్నం కానీ మరెప్పుడూ చేయొద్దు. నా మొబైల్‌ నంబర్‌ కూడా మార్చేస్తున్నాను. బై ఫర్‌ ఎవర్‌’ అని మెసేజ్‌ లో ఉంది.. అది చదివి రోహిత్‌ శిలలా నిశ్చేష్టుడయ్యాడు. అతని మనసు కూడా సముద్రంలా ఆలోచనల కెరటాలతో ఎగసిపడుతుంది. చెప్పలేనంతటి భావోద్రేకానికి గురవుతున్నాడు. అప్పుడే మొబైల్‌ రింగయ్యింది.’డాడీకి అంతా తెలిసిపోయింది.. నేను ఇంతకాలం చెప్పలేదని ఎంత బాధపడ్డారో?’ అనుకుంటూ ఫోన్‌ ఆన్‌ చేశాడు. ః’బాబూ ఎక్కడ వరకు వచ్చావు?’ అడిగాడు ప్రసాద్‌.

‘ఉప్పాడ బీచ్‌ వరకూ వచ్చాను డాడీ! వచ్చేస్తున్నాను. మీరు గుడికి వెళ్ళాలన్నారు కదా వెళ్లి వచ్చారా?’ అన్నాడు రోహిత్‌.

‘లేదు.. వెళ్ళలేదు బాబూ! రేపు ఉదయం వెళ్తాను. నువ్వు రా.. ఎదురు చూస్తున్నాను..’ అన్నాడు ప్రసాద్‌.

‘డాడీ! ఆరోగ్యం బాగోలేదా? గొంతు నీరసంగా అనిపిస్తుంది. మీరు దేని గురించీ ఎక్కువగా ఆలోచించి, మనసు పాడుచేసుకోకండి. నేను వచ్చాక అన్నీ వివరంగా చెప్తాను’ కంగారుగా అడిగాడు రోహిత్‌.’నాకు ఏమీ కాలేదులే నాన్నా! నువ్వు వచ్చాక మాట్లాడుకుందాం..’ అని ఫోన్‌ పెట్టేసి, సోఫాలో వెనక్కు వాలి, కళ్ళు మూసుకున్నాడు ప్రసాద్‌.

రోహిత్‌ కార్‌ స్టార్ట్‌ చేశాడు.. స్టీరింగ్‌తో పాటు అతని మనసు గతంలోకి పరుగులు తీసింది.

******************************************************************************

ప్రసాద్‌, రేవతిల ఏకైక పుత్రుడు రోహిత్‌. నోవాకోలా కూల్‌ డ్రింక్స్‌ మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీ యజమాని ప్రసాద్‌. మూడు పువ్వులు ఆరుకాయలుగా కంపెనీ నడుస్తుంది. రోహిత్‌ ఎమ్‌ఎస్‌ చేయడానికి అమెరికా వెళ్ళాలనుకున్నాడు. అందుకు జిఆర్‌ఈ పరీక్ష రాసి అర్హత సంపాదించుకున్నాడు. కానీ అదే సమయంలో కారు ప్రమాదంలో రేవతి అక్కడికక్కడే మరణించింది. భార్య మరణంతో ప్రసాద్‌ కుప్పకూలిపోయాడు. దానితో రోహిత్‌ భవిష్యత్తు అయోమయంలో పడింది. మానసికంగా కుంగిపోయిన తండ్రిని వదిలి, అమెరికా వెళ్లేందుకు రోహిత్‌ మనసు అంగీకరించలేదు. తండ్రికి అండగా నిలబడి, బిజినెస్‌ చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రోహిత్‌ ఆధ్వర్యంలో అతి తొందరలోనే లేటెస్ట్‌ ఎక్విప్మెంట్‌ సహకారంతో కంపెనీ లాభాల బాట పట్టింది. కంపెనీలో ఆపరేటర్‌గా చేరిన మృదుల మొదటిచూపులోనే రోహిత్‌ మనసుని ఆక్రమించింది.

మృదుల సన్నగా, చామనఛాయ రంగులో నవ్వు ముఖంతో పొందికగా, సౌమ్యంగా తన పనేదో తను చేసుకుంటుంది. మొదట్లో బాస్‌, వర్కర్‌లా ఉన్నవారిద్దరూ కాలక్రమేణా స్నేహితులయ్యారు. స్నేహం ప్రేమగా మారేందుకు కూడా ఎక్కువ సమయం పట్టలేదు.

ఒకరి కుటుంబ విషయాలు మరొకరు పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు. మృదుల వాళ్ళది సంప్రదాయబద్ధంగా ఉండే మధ్యతరగతి కుటుంబం. మృదుల కన్నా పెద్ద అమ్మాయికి పెళ్ళయిపోయింది. మృదులకి కూడా సంబంధాలు చూస్తున్నారు. మృదుల, రోహిత్‌లు ముందు రోహిత్‌ ఇంట్లో పెళ్లి గురించి చెప్పాక, తరువాత మృదుల వాళ్ళ ఇంట్లో చెప్పాలనుకున్నారు.

మృదులలో రోహిత్‌కి నచ్చని ఒకే ఒక విషయం జాతకాల పిచ్చి. ఉదయం జాబ్‌కి వచ్చే టైం కూడా వర్జ్యం చూసుకొని, బయలుదేరుతుంది. ఏ విషయానికైనా పంచాంగం చూడాలి అంటుంది. ‘ఏంటి మృదుల? అదంతా ట్రాష్‌! సైన్స్‌ ఇంత డెవలప్‌ అయిన రోజులలో కూడా ఈ జాతకాలు, వార ఫలాలు ఏంటి?’ రోహిత్‌ చాలాసార్లు వాదిస్తుంటాడు. ఊహూ!.. ఆ విషయంలో మృదుల ఎవరి మాటా వినదు. చిన్నప్పటి నుండి కట్టుదిట్టాలలో పుట్టి పెరగడం వల్ల ఆమె నరనరాల్లో అవి జీర్ణించుకుపోయాయి.

మృదుల పదిహేను రోజుల క్రితం జ్యోతిష్యుడి దగ్గరకు ఫ్రెండ్‌ వెళ్తుంటే తోడుగా వెళ్లింది. అక్కడకు వెళ్ళాక కుతూహలంతో రోహిత్‌కి తనకి జాతకాలు కలిశాయా, లేదా అని చూపించింది. ఆయన పెద్ద బాంబ్‌ లాంటి విషయం పేల్చారు. ‘పెళ్లంటే బ్రహ్మ పదార్థం.. బ్రహ్మచారులకి అర్థంకాని యథార్థం! మీ ఇద్దరి జాతకాలు విడివిడిగా బాగున్నాయి. కలిపితే అబ్బాయికి మృత్యు గండం ఉంది. నువ్వు అడుగుపెడితే అత్తగారింటికి అరిష్టం వాటిల్లుతుంది’ అన్నాడు జ్యోతిష్యుడు.అది విన్నప్పటి నుండి ‘నన్ను మరచిపో రోహిత్‌! నేను ఈ పెళ్లి చేసుకోను..’ అనడం మొదలు పెట్టింది మృదుల.

‘ఏమైంది మృదుల? నిజం చెప్తావా, లేదా? అని గట్టిగా నిలదీశాడు రోహిత్‌.జ్యోతిష్యుడు చెప్పినవన్నీ చెప్పింది మృదుల.’అవన్నీ నిజాలు కావు! మూఢ నమ్మకాలు’ అని రోహిత్‌ ఎంత నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోయింది. రోహిత్‌ తన వినడం లేదని మృదుల అతని కంపెనీలో ఉద్యోగం మానేసింది. గత జ్ఞాపకాల దొంతర నుంచి ఇల్లు రావడంతో వాస్తవంలోకి వచ్చాడు రోహిత్‌.

సోఫాలో కూర్చుని ఉన్న ప్రసాద్‌ పక్కన కూర్చుని, నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు రోహిత్‌.

‘ముఖంలో బాగా అలసట కనిపిస్తుంది. బాగా టెన్షన్‌ పడుతున్నారా డాడీ?’ అన్నాడు రోహిత్‌.

‘మృదుల గురించి చెప్పు!’ డైరెక్ట్‌గా పాయింట్‌ కొచ్చాడు ప్రసాద్‌.

‘సరే డాడీ! ఏమీ దాచకుండా అన్నీ చెప్తాను’ అని వారిద్దరి పరిచయం నుండి ఇప్పటివరకు జరిగినదంతా తండ్రికి చెప్పాడు రోహిత్‌. ‘మృదుల చాలా మంచి అమ్మాయి డాడీ! అచ్చు అమ్మలా ప్రేమిస్తుంది. నేనంటే తనకు చాలా ఇష్టం. నాకు ఏదో అవుతుందని పిచ్చిగా ఆలోచిస్తుంది. తను లేకుండా నేను ఉండలేను డాడీ!’ తండ్రి ఒడిలో తల పెట్టి, దిగాలుగా అన్నాడు రోహిత్‌.

ప్రసాద్‌ సమాధానంగా కొడుకు తల మౌనంగా నిమిరాడు.

‘ఒకసారి నన్ను మృదుల ఇంటికి తీసుకువెళ్లు’ అన్నాడు ప్రసాద్‌ చిన్నగా.

‘డాడీ! మృదుల మీ మాట వినదేమో!’ అన్నాడు రోహిత్‌.’ప్రయత్నించి చూడటంలో తప్పు లేదుగా! వెళ్దాం పద’ అన్నాడు ప్రసాద్‌.

ఇద్దరూ మృదుల ఇంటికి వెళ్లారు. అది చిన్న ఇల్లయినా బయట ఉన్న కొంచెం ఖాళీ స్థలంలో అన్నీ పూల మొక్కలతో చూడటానికి ముచ్చటగా ఉంది.గేట్‌ తీస్తుండగానే ‘ఎవరూ?’ అన్న కేక వినబడింది.

కిటికీలో నుండి చూస్తూ అడిగిన వ్యక్తి వైపు చూసి ‘ఆయన మృదుల వాళ్ళ నాన్న గారు.. పేరు రాజారావు’ అన్నాడు రోహిత్‌.

వీళ్ళ నుండి సమాధానం రాకుండానే ‘వస్తున్నాను ఉండండి’ అంటూ ఆయనే వచ్చి, తలుపులు తెరిచి లోపలకి ఆహ్వానించారు. రోహిత్‌ ‘నమస్తే అంకుల్‌!’ అని చేతులు జోడించాడు.

ఆయనకి రోహిత్‌తో పరిచయం ఉండటంతో ప్రతి నమస్కారం చెప్పి ‘రండి బాబూ! కూర్చోండి’ అంటూ కుర్చీలు చూపించారు కూర్చోమని.ఈ అలికిడికి లోపల నుండి మృదుల, ఆ వెనుక వాళ్ళ అమ్మ కూడా హల్‌లోకి వచ్చారు.

మృదుల ఈ అనుకోని హఠాత్పరిణామానికి అవాక్కయి అలాగే చూస్తూ నిలబడిపోయింది.మృదుల వాళ్ళ అమ్మ ‘నమస్తే బాబూ! బాగున్నారా? మృదుల ఫోటోలో మా బాస్‌ అని మిమ్మల్ని చూపించింది. అందుకే గుర్తు పట్టాను. ఈయన మీ నాన్నగారా? పోలికలు తెలుస్తున్నాయి. ఈ మధ్య మీ అమ్మగారు కాలం చేశారని కూడా అమ్మాయి చెప్పింది. మంచి మనుషులకే కష్టాలు వస్తుంటాయి. మీరు బాబు కోసమైనా గుండె దిటవు చేసుకోక తప్పదండి’ అంటూ ప్రసాద్‌ వైపు తిరిగి అన్నది.

ఆవిడ పరిచయం ఉన్నవాళ్ళతో మాట్లాడినట్లు గబగబా మాట్లాడేస్తుంది.

‘లక్ష్మీ, వాళ్లకు కాఫీ అయినా ఇస్తావా? మాట్లాడుతూనే ఉంటావా?’ అన్నారు రాజారావు గారు.

‘తెస్తాను ఉండండి’ అని మృదుల వైపు చూసి ‘వాళ్లకు మంచి నీళ్ళు ఇవ్వమ్మా మృదుల!’ అని వంటగది వైపు వెళ్ళబోయింది లక్ష్మీ.

‘అవేమీ వద్దు. నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. కాసేపు కూర్చోండి. మదులా, నువ్వు కూడా రామ్మా!’ అని పిలిచాడు ప్రసాద్‌.మృదులకి తప్ప మిగిలిన ఇద్దరికీ ఏమీ అర్థం కాలేదు. ఆయన చెప్పబోయే విషయం కోసం ఆశ్చర్యంగా చూస్తున్నారు. మృదుల వచ్చి తలవంచి, కిందకు చూస్తూ కూర్చుంది.

‘నేను సూటిగానే అసలు విషయానికి వస్తాను. మా అబ్బాయి మీ అమ్మాయి ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. మనకు ఆ విషయం చెప్పేంతలోగానే కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. నా మటుకు నాకు ఉన్నది బాబు మాత్రమే! వాడి జీవితాన్ని నిర్ణయించుకునే పరిణితి బాబుకి ఉంది. మీకు ఇష్టమైతే మీ అమ్మాయిని మా కోడలిగా చేసుకుంటాను. అందుకు నేను సిద్ధమే!’ అన్నాడు ప్రసాద్‌.అనుకోని అదష్టం ఇంటిని వెతుక్కుంటూ వచ్చినందుకు మృదుల తల్లి తండ్రులిద్దరూ సంతోషంగా ప్రసాద్‌ వైపు చూస్తున్నారు. వాళ్ళ ముఖంలో అంగీకారం చెప్పకుండానే అర్థమవుతుంది ప్రసాద్‌కి.

కంగారుగా ఏదో మాట్లాడబోతున్న మృదులతో ‘అమ్మా, నాకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో తెలుసు. నేను చెప్పేది ఒకసారి విను. నీకు జాతకాలు మీద నమ్మకం ఉంది.. కాదనను. కానీ అన్నింటికీ అవి వర్తించవు. మనల్ని మనలా ప్రేమించేవారిని పొందడం పెద్ద అదష్టం అనుకోవాలి. నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తిని, నువ్వు ప్రాణంగా ప్రేమించే వ్యక్తిని వదులుకోవడం ఎంతమటుకు సబబు? అది చాలా మూర్ఖత్వం అవుతుంది. మా కాలంలో ఈ జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేశారా? వాళ్ళందరూ సుఖంగా లేరా? ఈ రోజుల్లో అందరూ జాతకాలు చూపిస్తున్నారు. వాళ్లంతా ఎంత కాలం కలిసి బతుకుతున్నారు? పెళ్లంటే రెండు మనసుల కలయిక, సర్దుబాటు! అంతే కానీ రాశి, నక్షత్రం కలిస్తే సరిపోదు. మా పెళ్లయ్యాక ఒక పెద్ద స్వామీజీ మా జాతకం చూసి, నిండు నూరేళ్ళు కలిసి బతుకుతామన్నారు. ఏం జరిగింది? అర్ధాంతరంగా రేవతి నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది. ఈ జ్యోతిష్యులు చెప్పేవి అన్నీ నిజాలు కావు. ఆలోచించు! నా ప్రాణమైన నా కొడుకుకి హాని జరగడం నాకు మాత్రం ఇష్టమా? కాదు కదా? నీ ఆలోచనలను సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యి. ఎంతటి సమస్యకైనా ఆలోచన, ఆచరణకు మించిన పరిష్కారం ఉండదు..’ నిదానంగా చెప్పాడు ప్రసాద్‌.

మృదులకి ఆయన మాటలలో జవాబు దొరికినట్లయింది. ముడుచుకుపోయిన కమలం వికసించినట్లు వాడిన ముఖం విప్పారింది. తమకు తెలియనిది ఏదో వాళ్ళ మధ్య జరిగిందని మృదుల తల్లి తండ్రులకు అర్థమైంది. అది గమనించిన ప్రసాద్‌ వాళ్లకు జరిగింది చెప్పాడు.మృదుల కూర్చున్న చోటు నుండి లేచి ప్రసాద్‌ దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని ‘అంకుల్‌! నన్ను క్షమించండి. మీరు అజ్ఞానంతో మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించారు. రోహిత్‌ బాగుండాలని అలా మాట్లాడాను కానీ రోహిత్‌కి దూరంగా నేను కూడా ఉండలేను’ అంది చెమర్చిన కళ్ళతో. ఆ మాటలతో రేవంత్‌తో సహా అందరి ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది.

  • కె.వి. సుమలత, 9492656255
➡️