కళ్లు తెరిపించే కార్టూన్లు..

Feb 4,2024 07:09 #book review, #Sneha

కార్టూన్‌ అంటే మూడక్షరాలే. కానీ.. ఆ కార్టూన్‌లో కనిపించే మూడు గీతల్లోనే ముప్పై అర్థాలు దాగి ఉంటాయి. మరి.. అలాంటి కొంతమంది కార్టూనిస్టులందరూ కలసి ఒక పుస్తకం విడుదల చేస్తే..! దానిలో ఎన్ని చమక్కులు, చిలిపితనాలు, వ్యంగ్యాస్త్రాలు, రాజకీయ పరదాలు, సరదాలు, గిజగిజలు, కిలకిలలు.. గిలిగింతలు పెడతాయో కదా! అలాంటిదే విశాలాక్షి విరజాజులు అనే కార్టూన్ల సంకలనం. ‘మామిడిపూడి రామకృష్ణయ్యగారి స్మారక పోటీ’లో గెలుపొందిన కార్టూన్లను ఒకచోట చేర్చగా ఏర్పడింది ఈ సంకలనం. ఇది విశాలాక్షి సాహిత్య మాసపత్రిక వారి సౌజన్యంతో వెలువడింది.

దిన పత్రిక.. మరే పత్రికయినా సరే వచ్చిన వెంటనే పాఠకుని కళ్ళు కార్టూన్‌ల కోసమే వెదుకుతాయి. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూపై కార్టూనిస్టు శంకర్‌ పిళ్ళై రాజకీయ వ్యంగ్య కార్టూన్‌ వేశారు. దానిని చూసి నెహ్రూ నవ్వుతూ ఇలా వ్యాఖ్యానించారు. ‘బహిరంగ వేదికలపై మాకుండే కొన్ని బలహీనతలు, లోపాలను ఈ కార్టూన్‌ల ద్వారా హెచ్చరించడం అనేది కార్టూనిస్టు సృజనాత్మకత. వీటిని ద్వేషపూరితంగా భావించక, ఆహ్వానించి ఆస్వాదించడం అందరికీ ఆరోగ్యకరం. వీటిని తన కళాదృష్టితో ఎత్తి చూపడం సామాజిక సేవ. ఆ హెచ్చరిక సమాజ అభివృద్ధికి, అనాలోచిత ఆలోచనలు మార్చుకోవడానికి, రాజకీయవేత్తలు సముచితంగా ఆలోచించడానికి, వారి అహంకారపు తెర దించడానికి చేసే కృషి’గా అభివర్ణించారు.

ఇహపోతే ఈ మాసపత్రికలోని కార్టూన్లను గమనిస్తే.. ఆంగ్ల అక్షరం ‘ఎ’ కి పాదాన్ని జోడించి తెలుగును తొక్కివేయడాన్ని మనమే ఆహ్వానిస్తున్నట్లున్న బొమ్మన్‌ కార్టూన్‌.. అదే అర్థంతో మాతృభాషను విస్మరిస్తే పరభాషా వ్యామోహంలో మునిగి జీవితమే నాశనమవుతుందని చెప్తున్న ప్రేమ్‌ కార్టూన్‌.. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో తిధులు, నక్షత్రాలను నమ్మి డబ్బులు నష్టపోవటాన్ని ఎత్తి చూపటం లాంటి కార్టూన్‌.. ఇలాంటివి ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో స్కేటింగ్‌ చేస్తూ సర్వ్‌ చేయటాన్ని చూపిన కళాసాగర్‌ కార్టూన్‌.. డ్రైవింగ్‌ చేస్తూ సెల్‌ఫోన్‌ మాట్లాడటం కరెక్టు కాదని చెప్పిన ఎమ్‌ రాము.. నేటి చదువుల్లో పుస్తకాల మోతను చూపిన రామ్‌శేషు.. పుస్తకానికి సొగసులద్దారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కారణంగా బ్రెయిన్‌ వాడటం లేదని చెప్పిన శేఖర్‌.. హాస్పిటల్‌లో పరామర్శ మరచి సెల్‌ఫోన్‌లలో మునిగిపోయిన యువత వైనం.. అప్పట్లో పసి పిల్లలను బొమ్మలు, గిలక్కాయలతో ఆడించేవారు. ఇప్పుడు రోజుల పిల్లల నుంచే సెల్‌ఫోన్‌లో వీడియోలు చూపించి ఆడిస్తున్నారు. ఆ పరిస్థితి చివరకు పిల్లలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోంది అని చెబుతూ వేసిన సునీల్‌ కార్టూన్‌.. ఇలా నష్టదాయకమైన వాటిని తప్పనిసరిగా మార్చుకోవలసినవిగా హెచ్చరిస్తున్నట్లున్నాయి. మీడియాలో ద్వేషపూరిత, జుగుప్సాకరమైన, ఫేక్‌ న్యూస్‌లను డ్రైనేజీతో పోల్చిన హరిక్రిష్ణ కార్టూన్‌, మనిషి శరీరంలో మిగిలిన మూలకాలలానే బంగారం, వెండి ఎందుకు లేవని డాక్టర్‌ని అడుగుతున్న పేషెంట్‌ అమాయకత్వం.. నేరస్థులు సైతం భారత రత్న గ్రహీతలవుతున్నారని తెలిపే భాను కార్టూన్‌లు ఆలోచింప చేసేవిగా ఉన్నాయి.

ఇవి ఇలా ఉంటే యమదూత ఒటిపి వచ్చిందామ్మా అనిఅడిగే కశ్యప్‌ కార్టూన్‌.. డాక్టర్ల పర్యవేక్షణలో నడుపబడుతున్న రెస్టారెంట్‌లో మెడికల్‌ రిపోర్ట్స్‌ ఆధారంగా మాత్రమే ఆహారం ఇవ్వబడుతుందనటం.. పొలంలో రంగురాళ్ళున్నాయని చెప్పి పైసా ఖర్చు లేకుండా పొలం తవ్వించుకున్న రైతు అతితెలివిని వ్యక్తం చేసేలా వేసిన కార్టూన్‌ గానీ.. భార్యకు కొత్త ఇంటికి తీసుకెళ్ళిన భర్తతో లక్కీ నంబరు ప్రకారం మూడు ఇళ్ళు కావాలన్న భార్యను చూసి భర్త ఖిన్నుడవటం కిసుక్కు మనిపించేలా ఉన్నాయి. ఇలా అనేక భావాల కలబోతగా వెలువడింది ఈ పుస్తకం. కార్టూన్‌లను గీయడం.. పత్రికలో వేయడం.. అసలు భావ వ్యక్తీకరణను చేత్తో పేపరు మీద పెట్టేంతటి సమయం తీసుకోవడానికిగానీ తిలోదకాలిస్తున్న ఈ రోజుల్లో పోటీలు నిర్వహించి ప్రోత్సహించడం, కార్టూన్‌ల ఉనికిని కాపాడే ప్రయత్నం చేయటం అభినందనీయం.

పేజీలు : 76

వెల : రూ. 100 /-

విశాలాక్షి సాహిత్య మాసపత్రిక, 27-5-487, నెల్లూరు.9440529785

 

  • టాన్య – 7095858888
➡️