క్రీడల్లో వివక్షకు అంతమెప్పుడు?

  •  స్త్రీ, పురుష అసమానతలు కొట్టొచ్చినట్టు కనిపించేవాటిలో క్రీడా రంగం ఒకటి. కొత్త సహస్రాబ్దిలో సైతం క్రీడల్లో మహిళల పట్ల వివక్ష అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతుండడం మన జాతికే సిగ్గుచేటు. ప్రపంచ జనాభాలో సగ భాగంగా ఉన్న మహిళలకు సమానావకాశాలు ఇప్పటికీ మిథ్యగానే మిగిలిపోయాయి. పురుషుడై పుట్టడమే గొప్ప అనుకునే పితృస్వామ్య భావజాలం సమాజంలో పాతుకుపోవడం దీనికి ఒక ముఖ్యకారణం. 

మహిళలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత గురించి భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ అన్న మాటలను ఇక్కడ మననం చేసుకోవాల్సిన అవసరముంది. ‘ఒక జాతిని మేల్కొలపాలంటే మహిళలను ముందు మేల్కొలపాలి. వారు చైతన్యవంతులైతే మొత్తం కుటుంబమే చైతన్యవంతమవుతుంది. తద్వారా యావద్దేశం పురోగమిస్తుంది’ అన్నారు. ఈ సందర్భంగానే రష్యా విప్లవ సారథి, ఇరవయ్యో శతాబ్దపు చరిత్ర గతినే మార్చేసిన మహనీయుడు వి ఐ లెనిన్‌ – మహిళల ప్రాముఖ్యత గురించి నొక్కిచెబుతూ ‘ప్రతి ఒంటగత్తె ఒక రాజకీయవేత్త కావాలి’ అని అంటారు. ఆణిముత్యాల్లాంటి ఆ మహనీయుల మాటలు నెరవేరాలంటే ప్రతి బాలికకు ప్రాథమిక విద్యతోబాటే క్రీడల్లోనూ ప్రోత్సహించాలి. ఒకప్పటి సోషలిస్టు రష్యా, నేటి చైనా, క్యూబా, వియత్నాం వంటి దేశాల్లో మహిళలు అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలకు దీటుగా క్రీడల్లో రాణిస్తున్నారంటే దానికి కారణం అక్కడి ప్రభుత్వాలు, సమాజం ఇస్తున్న ప్రోత్సాహమేనని నిస్పందేహంగా చెప్పొచ్చు. ఇక మన దేశం విషయానికి వస్తే నూట నలబై కోట్ల మందికిపైగా జనాభాతో జనాభాపరంగా ప్రపంచంలోనే అతి పెద్ద దేశంగా ఉన్న భారత్‌ ప్రపంచ క్రీడా పటంలో ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. స్వాతంత్య్రానికి ముందు ఒలింపిక్స్‌లో భారతీయ మహిళలు పాల్గొన్న దాఖలాలే లేవు. స్వాతంత్య్రం వచ్చిన ఐదేళ్లకు అంటే 1952లో మొట్టమొదటిసారి ఒక భారతీయ మహిళ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టారు. రెండవసారి 1975లో. ఇప్పటికీ ఒక సాక్షి మాలిక్‌, ఒక పిటి ఉష, ఒక కరణం మల్లీశ్వరి, ఒక సానియా మీర్జా, ఒక పివి సింధు, ఒక మేరీకోమ్‌, ఒక అంజూ బాబీ జార్జి, ఒక జ్యోతిర్మయి సిక్దార్‌ను చూసి మనం మురిసిపోతుంటాం. ఇంత పెద్ద దేశం క్రీడల్లో ఇంతగా ఎందుకు వెనకబడుతోంది? క్రీడల్లో మహిళల పట్ల తరతరాలుగా సాగుతూ వస్తున్న వివక్ష ఒక కారణమైతే, పేదరికం, ప్రభుత్వాల నిర్లక్ష్యం మరో కారణం. దిగువ మధ్యతరగతి, అట్టడుగు వర్గాల పిల్లల్లో క్రీడల పట్ల మక్కువ ఉన్నా ఆర్థిక స్తోమత లేక ఆ కోరికను చంపుకోవాల్సి వస్తుంది. దీనికి తోడు సామాజికంగా అవమానాలు, అవహేళనల గురించి వేరే చెప్పనక్కర్లేదు. పట్టణాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వివక్ష ఎక్కువగా కనిపిస్తుంది. క్రీడల్లో పాల్గొంటే పునరుత్పత్తి సంబంధమైన ఆరోగ్యసమస్యలు వస్తాయని, అందం దెబ్బతింటుందని ఇలా రకరకాల అపోహలు ఉన్నాయి. వీటన్నిటినీ అధిగమించి గ్రౌండ్‌కు వెళితే – అక్కడ సరైన మౌలిక సదుపాయాలు ఉండవు. బట్టలు మార్చుకునేందుకు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు సరైన సదుపాయాలు ఉండవు. మహిళల క్రీడలకు మీడియా కవరేజి కూడా తక్కువే. క్రీడా పోటీలను వీక్షించేవారు కూడా తగినంతగా ఉండకపోవడం వంటివి ఈ అసమానతలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. అంతకన్నా దారుణమైన విషయం మహిళా అథ్లెట్ల పట్ల లైంగిక వేధింపులు. ఈ సంస్కృతి క్రీడా సమాఖ్యల్లో కింది నుంచి పై దాకా పాకింది. స్కూళ్లలోను, స్టేడియాల్లోను మహిళా కోచ్‌లు తగినంత మంది లేకపోవడం.. క్రీడా సమాఖ్యల్లో, ఒలింపిక్‌ కమిటీల్లో, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా వంటి వాటిలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఉంటే లైంగిక వేధింపులను చాలావరకు నిరోధించవచ్చని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె ఎన్‌ వర్మ కమిటీ అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 నుండి 18 వరకు సమానత్వ హక్కుకు గ్యారెంటీ ఇస్తున్నాయి. ‘క్రీడా మైదానాలు వంటి బహిరంగ ప్రదేశాలను స్త్రీ, పురుష అన్న తేడా లేకుండా అందరికీ సమానంగా అందుబాటులో ఉండేలా చూడాలని ఆర్టికల్‌ 15 చెబుతోంది.’ ఒకవేళ ఎవరైనా వివక్ష చూపినట్టైతే సదరు బాధితులు హైకోర్టు లేదా సుప్రీం కోర్టును ఆశ్రయించే హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32, 226 కల్పిస్తున్నాయి.

2013 జులై 10న కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన జాతీయ క్రీడల అభివృద్ధి ముసాయిదా బిల్లు పీఠికలో క్రీడల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెబుతోంది. ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కూడా నిర్దేశించింది. క్రీడల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు భారతీయ ఒలింపిక్‌ కమిటీ, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా వంటి క్రీడా సమాఖ్యల్లో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనేది అందులో అతి ముఖ్యమైనది. కోచ్‌లకు, మహిళా అథ్లెట్లకు మధ్య సంబంధం ఆరోగ్యకరంగా ఉండేలా తగిన మెకానిజాన్ని ఏర్పాటు చేయడం, కోచింగ్‌, సహాయక సిబ్బందిలో తగినంత మంది మహిళలను సభ్యులుగా నియమించడం వంటి అనేక విలువైన సూచనలను ఆ కమిటీ చేసింది. అయితే, కేంద్రంలో ఆ తరువాత వచ్చిన మోడీ ప్రభుత్వం ఆ జాతీయ క్రీడా విధాన ముసాయిదాను అటకెక్కించింది. కాబట్టే ఒలింపిక్‌ పతక విజేత, సాక్షి మాలిక్‌, వినేష్‌ పొగాట్‌ వంటి రెజ్లర్లు సమాఖ్య అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్‌ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బహిరంగంగా వీధుల్లో వచ్చి, పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా క్రీడల్లో మహిళల పట్ల వివక్ష, లైంగిక వేధింపులను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక విద్య స్థాయి నుంచే బాలికల్లో ప్రతిభను గుర్తించి, వాటికి పదును పెట్టేందుకు సమగ్ర ప్రణాళికలను రూపొందించాలి. క్రీడల్లో మహిళలను ప్రోత్సహించేందుకు వర్మ కమిటీ చేసిన సిఫారసులను అమల్లోకి తీసుకురావాలి. అన్ని రాజకీయ పార్టీల ఎజెండాలోను ఇదొక ముఖ్యాంశంగా ఉండాలి. అందుకు మహిళా సంఘాలు, ప్రగతిశీల వాదులంతా కలసికట్టుగా ఒత్తిడి తీసుకురావాలి.

– కె గడ్డెన్న, 9490099012

➡️