జగనన్నా… మా ఇళ్లేవన్నా?

Jan 23,2024 10:49 #Houses, #srikakulam
  •  కట్టినవి కూల్చేశారు
  • కొత్తగా కడతామని చేతులెత్తేశారు
  • లబ్ధిదారుల ఆవేదన

ప్రజాశక్తి- కవిటి (శ్రీకాకుళం జిల్లా) : కాంగ్రెస్‌ ప్రభుత్వం 2008లో వారందరికీ ఇందిరమ్మ కాలనీలో ఇళ్లు మంజూరు చేసింది. లబ్ధిదారులు కొంతమంది పునాదులు వేశారు, మరికొందరు గోడల వరకు కట్టారు, ఇంకొందరు స్లాబ్‌ వరకు పని పూర్తి చేశారు. ఆ తరువాత ప్రభుత్వం మారడంతో అవి అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 2019లో వైసిపి అధికారంలోకి వచ్చాక వారికి మంజూరు చేసిన ప్రదేశంలోనే జగనన్న కాలనీకి కేటాయించారు. అయితే, అప్పటికే అక్కడ అసంపూర్తి నిర్మాణాలతో ఉన్న వీరి నిర్మాణాలు అడ్డంగా ఉన్నాయని అధికారులు భావించారు. వారికి మళ్లీ ఇళ్లు మంజూరు చేస్తామనే హామీ ఇచ్చి లబ్ధిదారులను సంప్రదించకుండానే నిర్మాణాలను తొలగించేశారు. కానీ, ఇప్పటి వరకూ వారి ఇళ్ల నిర్మాణం మాత్రం జరగలేదు. దీనిపై అధికారులను అడిగితే మీకు ముందే ప్రభుత్వం నుంచి ఇంటి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు కాబట్టి ఇప్పుడు మళ్లీ ఇవ్వడం కుదరని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు మేం నిర్మించిన ఇళ్లు ఎలా పడగొట్టారంటే వారి దగ్గర సమాధానం లేదు. చివరకు స్థానిక నాయకుల ద్వారా నియోజకవర్గ నేతలను సంప్రదించినా ఫలితం లేకపోయింది. అటు కాలనీలో ఇళ్లు లేక ఇటు ఉంటున్న పూరిళ్లు కొత్తగా నిర్మించుకోలేక రెంటికీ చెడ్డ రేవటి మారింది వారి పరిస్థితి ఉంది. గత ఐదేళ్లుగా కవిటి మండలం వరకకు చెందిన సావిత్రి పురియా, గున్ని పురియా, మోహిని పురియా, క్రాంతి బిసాయి, మేనకా సాహు, పార్వతి మజ్జి, భూదేవి పురియా, భూదేవి మజ్జి, బోలియాశెట్టి సావిత్రి, బెహరా హైమ, భారిక పురియా, వల్లభ పురియాకు నిరీక్షణే మిగిలింది. అధికారులు, నాయకులు స్పందించి జరిగిన పొరపాటు సరిచేసి తమకు ప్రభుత్వం ద్వారా ఇళ్లు నిర్మించుకునేలా చూడాలని వారు కోరుతున్నారు.

ఇల్లు లేకుండా పోయింది:  గున్ని పురియా

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇంటి స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణం కూడా గోడల వరకు పూర్తి చేశాను. ఆ తరువాత ప్రభుత్వాలు మారడంతో మాకు నిరాశ ఎదురైంది. 2019లో వైసిపి ప్రభుత్వం వచ్చాక మమ్మల్ని సంప్రదించకుండానే మా ఇంటి నిర్మాణాలు కూల్చి వేశారు. దీనిపై ప్రశ్నిస్తే, మీకు ఇంతకు ముందే ఇల్లు మంజూరైనట్టు రికార్డులో ఉందని అంటున్నారు.

ఇల్లు కూల్చేశారు : సావిత్రి పురియా

అప్పటి ప్రభుత్వంలో ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణాలు జరుగుతుండగానే ప్రభుత్వాలు మారిపోయాయి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న ఇంటిని మాకు సంబంధం లేకుండానే కూల్చివేసింది. అప్పటి నుంచి మా 14 మందికి సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. ఇప్పటికైనా మా సమస్య గుర్తించి న్యాయం చేయాలి.-

➡️