సుగంధ ద్రవ్యాల్లో క్రిమి సంహారకాల స్థాయి 10 రెట్లు పెంపు

 ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ గ్రీన్‌సిగ్నల్‌

న్యూఢిల్లీ : సుగంధ ద్రవ్యాల్లో క్రిమి సంహారక మందుల అవశేషాల పరిమాణాన్ని పెంచుతూ భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. గరిష్ట అవశేష పరిమితి (ఎంఆర్‌ఎల్‌)ని పది రెట్ల వరకు పెంచింది. ఈ పెరుగుదల కిలోగ్రాము(కేజీ)కు 0.01 మిల్లిగ్రాము(ఎంజీ)ల నుంచి 0.1 ఎంజీకి పెంచింది. ఇది గతంలో అనుమతించిన స్థాయి, పరిమాణం కంటే అధికం కావటం గమనార్హం. ఈ పెరుగుదలపై పలువురు మార్కెట్‌, ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక మొత్తంలో క్రిమిసంహారకాల వినియోగం క్యాన్సర్‌కు దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు.

ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం
ఈ సడలింపు కారణంగా కొన్ని పెద్ద మార్కెట్లకు భారత సుగంధ ద్రవ్యాల ఎగుమతులు ఎక్కువగా తిరస్కరించబడతాయని పెస్టిసైడ్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ సిఇఒ దిలీప్‌ కుమార్‌ తెలిపారు. అధికమొత్తంలో పెస్టిసైడ్‌ కలిగి ఉన్న సుగందద్రవ్యాల దిగుమతి సులభతరం కానున్నదని చెప్పారు. తమకు అందిన పలు విజ్ఞప్తుల ఆధారంగానే పెస్టిసైడ్‌ పరిమితిని పెంచినట్టు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ తెలిపింది. అలాంటి విజ్ఞప్తులు ఎవరు చేశారన్నదాని గురించి మాత్రం సంస్థ వెల్లడించలేదు. క్రిమిసంహారకాల అవశేషాల పరిమాణం పెంచిన కారణంగా సుగంధద్రవ్యాలను వినియోగించేవారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నదని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రాం, సుస్థిర ఆహారాభివృద్ధి డైరెక్టర్‌ అమిత్‌ ఖురానా హెచ్చరించారు. సుగంధ ద్రవ్యాల్లో అధిక పెస్టిసైడ్‌ల వినియోగం కారణంగా కొన్ని ప్రముఖ బ్రాండ్లకు చెందిన అమ్మకాలపై హాంగ్‌కాంగ్‌, సింగపూర్‌, మాల్దీవులు గతనెల నిషేధం విధించాయి. భారత్‌కు చెందిన ఒక కంపెనీ మాత్రం తమ బ్రాండ్‌ అమ్మకాలపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది.

అత్యంత ఎక్కువ అవశేషాలు ఉండేందుకు అనుమతించలేదు : భారత ప్రభుత్వ వివరణ
ఆహార పదార్ధాల్లో క్రిమి సంహారక మందుల అవశేషాలకు అత్యంత కఠినమైన నిబంధనలు ఆమోదించిన దేశాల్లో భారత్‌ ఒకటని ప్రభుత్వం ఆదివారం తెలిపింది. సుగంధ ద్రవ్యాల్లో అత్యంత ఎక్కువగా క్రిమిసంహారక అవశేషాలు వుండేందుకు ఆహార నియంత్రణా సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ అనుమతించిందని వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. భారతదేశంలో రెండు ప్రఖ్యాతిచెందిన బ్రాండ్లు ఎండిహెచ్‌, ఎవరెస్ట్‌లకు చెందిన కొన్ని మాసాల మిక్స్‌ శాంపిల్స్‌లో క్రిమిసంహారక మందు ఎథిలిన్‌ ఆక్సైడ్‌ వుందంటూ హాంకాంగ్‌ ఫుడ్‌ రెగ్యులేటర్‌ వాటిపై నిషేధం విధించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది. ఎవరెస్ట్‌ బ్రాండ్‌కి చెందిన ఒక మసాలా ఉత్పత్తిని ఉపసంహరించాలని సింగపూర్‌ ఫుడ్‌ రెగ్యులేటర్‌ కూడా ఆదేశించింది. దేశీయ మార్కెట్లలో విక్రయిస్తున్న ఎండిహెచ్‌, ఎవరెస్ట్‌లతో సహా వివిధ బ్రాండ్లకు చెందిన నమూనాలను ప్రస్తుతం ఎఫ్‌ఎస్‌ఎస్‌ ఎఐ సేకరిస్తోంది. ప్రభుత్వం విధించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా అవి వున్నాయా? లేదా? అని తనిఖీ చేస్తోంది. ఎగుమతి చేసే మసాలాల నాణ్యతను ఇది నియంత్రించలేదు.

➡️