దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన 21.9 కోట్ల ప్రజలు

Dec 12,2023 11:32 #below, #country, #crore, #people, #poverty line
  • గ్రామాల పరిస్థితి విషమం
  • ఉపాధి కల్పనతోనే పేదరికం నుంచి బయటకు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో 21.9 కోట్ల ప్రజలు ఇప్పటికీ దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారని కేంద్ర గణాంకాలు, ప్రోగ్రామ్‌ అమలు మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ పార్లమెంటుకు తెలిపారు. బహుమితీయ పేదరికానికి సంబంధించి నగరాలు, గ్రామాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ఉచిత రేషన్‌ పంపిణీని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రసంగాల్లో తరచూ ప్రస్తావిస్తూ, దానిని ఒక ఘనకార్యంగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రేషన్‌ పంపిణీ ఆవశ్యకతను అర్థం చేసుకోవాలి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే అందజేస్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి ఈ రోజు కూడా మన దేశంలో తమ ఆహార అవసరాలు తీర్చుకోలేని పేదలు పెద్ద సంఖ్యలో ఉన్నారని స్పష్టం అవుతుంది. అందుకోసమే ప్రభుత్వ పథకాలు అవసరాన్ని దుర్భిక్ష పరిస్థితి నొక్కి చెబుతుంది. పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ సమర్పించిన పేదరిక గణాంకాల ప్రకారం, నేటికీ దేశంలో 21.9 కోట్ల ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు. దేశంలో పేదరికం ఎంత ఉందో తెలుసుకోవడానికి 2011-12లో సర్వే నిర్వహించామని, ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి అంచనా వేయలేదని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సర్వేలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య 27 కోట్లుగా అంచనా వేయబడింది. ఇప్పుడు దారిద్య్ర రేఖ స్థాయిని ఎలా నిర్ణయిస్తారనే ప్రశ్న తలెత్తుతుంది.

ఒక గ్రామంలో నివసించే వ్యక్తి ప్రతిరోజూ రూ.26 ఖర్చు చేయలేకపోతే, నగరంలో నివసించే వ్యక్తి రూ.32 ఖర్చు చేయలేకపోతే, ఆ వ్యక్తి దారిద్య్ర రేఖకు దిగువన పరిగణించబడతారని ప్రభుత్వం విశ్వసిస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబం వారి పిల్లలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోతుంది. వారి పిల్లలకు సరైన విద్యను అందించలేకపోతుంది. ఆరోగ్యం, సరిపడినంత ఆహారం అందించలేకపోతుంది. కరోనా కాలంలో పేదరికంలో మగ్గుతున్న ప్రజలు అధిక వడ్డీలకు అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో వారి పిల్లల చదువులు దెబ్బతినడమే కాకుండా సరైన తిండి దొరక్క ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో అట్టడుగు వర్గాలు, వారి కుటుంబాలు చాలా కష్టాలను ఎదుర్కొన్నాయి. కోవిడ్‌ ముగిసిన తరువాత కొంతకాలం ఉపాధి సమస్యలను ఎదుర్కొన్నాయి. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సిఎంఐఇ) లాక్‌డౌన్‌ తరువాత కొంత డేటాను విడుదల చేసింది. నిరుద్యోగిత రేటు మే 2022లో 7.1 శాతం నుండి జూన్‌ 2022లో 7.8 శాతానికి పెరిగిందని, ఇందులో గ్రామీణ భారతదేశంలో నిరుద్యోగిత రేటు 1.4 శాతం పెరిగిందని పేర్కొంది.

నీతి ఆయోగ్‌ నివేదిక ఏం చెబుతోంది ?

ప్రభుత్వ డేటా ప్రకారం, నీతి ఆయోగ్‌ ‘నేషనల్‌ మల్టీడైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌: ఎ ప్రోగ్రెస్‌ రివ్యూ 2023’ పేరుతో ఒక నివేదికను సమర్పించింది. దీని ప్రకారం 2015-16 నుండి 2019-21 సంవత్సరంలో 13.5 కోట్ల మంది బహుమితీయ పేదరికం నుండి విముక్తి పొందారు. నీతి ఆయోగ్‌ నేషనల్‌ మల్టీడైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ రెండో ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని మొదటి ఎడిషన్‌ నవంబరు 2021లో విడుదల చేసింది.

దేశంలో బహుమితీయ పేదల సంఖ్య ఎంత ?

దేశంలో 2015-16లో 24.85 శాతం జనాభా బహుమితీయ పేదరికంలో ఉన్నారు. ఇది 2019-21 నాటికి 14.96 శాతానికి తగ్గింది. అయినప్పటికీ, దేశ జనాభాలో 15 శాతం మంది ఇప్పటికీ బహుమితీయ పేదరికంలో జీవిస్తున్నారని విస్మరించలేము. ఈ గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ బహుమితీయ పేదరికానికి సంబంధించి నగరాలు, గ్రామాలను పోల్చినట్లయితే, పేదరికంలో గ్రామాలు ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో పేదరికం 8.65 శాతం నుంచి 5.27 శాతానికి తగ్గగా, గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 32.59 శాతం నుంచి 19.28 శాతానికి తగ్గింది. అయితే, పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఈ వ్యత్యాసంపై నీతి ఆయోగ్‌ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

రేషన్‌ పంపిణీ చేయడంతో పేదలను పేదలుగా ఉంచడానికి సరిపోతుంది. ప్రభుత్వాలు రేషన్‌కు బదులుగా ఉద్యోగాలు, లేదా రేషన్‌తోపాటు ఉద్యోగాల వాగ్దానాలను అమలు చేయాలి. ప్రజలకు ఉపాధి కల్పించాలి.

అప్పుడు పేదరికం తగ్గుతుంది. 2018-19 నుంచి 2023-24 వరకు 1,06,561 కంపెనీలు ఏదో ఒక కారణంతో మూతపడ్డాయని కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ స్వయంగా లోక్‌సభలో ఈ సమాచారాన్ని తెలియజేశారు. కంపెనీలు చాలా సందర్భాల్లో మూసివేతకు 6 నుండి 8 నెలల సమయం పట్టింది. కొన్ని సందర్భాల్లో ఈ సమయం 12 నుండి 18 నెలలకు చేరుకుంది. ఏదేమైనప్పటికీ, పేదరికానికి అతిపెద్ద కారణం ప్రజలకు ఉపాధి లేకపోవడమని ఎవరూ కాదనలేరు. దీనిపై మన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఉపాధి కల్పించడంతోనే దేశంలోని కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయి.

➡️