మార్పుల సంక్షోభం

Dec 16,2023 10:33 #Change, #crisis
  • వైసిపిలో అన్ని నియోజకవర్గాల్లో వేరు కుంపట్లు
  • బాలినేని జోక్యం లేనందునే సహకరించని శ్రేణులు
  • అధిష్టానం ఏకపక్ష నిర్ణయంతో అంతా అయోమయం

ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో : జిల్లా పార్టీ పగ్గాలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగిస్తున్నట్లు వైసిపి కోఆర్డినేటర్‌ విజయసాయిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు జరిగిన ఇన్‌ఛార్జిల మార్పుల వ్యవహారంలో ఆయనకు చెప్పకుండా అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంతో పార్టీలోనే పెద్ద చర్చగా మారింది. పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న బాలినేని చెప్పకుం డా తాము కూడా సహకరించలేమని నియోజకవర్గాల్లో కీలక నేతలు అంటున్నారు. అందుకే కొత్తగా నియమితులైన ఇన్‌ఛార్జిలు నియోజకవర్గా లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. వెళ్లినా అక్కడ ఎవరూ సహకరిస్తారు? ఎవరు ఇబ్బంది పెడతారనే భయం కూడా వెంటాడుతోంది. సమన్వయ లోపం స్పష్టంగా ఉంది. పార్టీలో వర్గపోరు కూడా తీవ్రమవుతోంది. చేపట్టే మార్పులపై ముందుగా కనీసం జిల్లా నేతలతోనూ మంతనాలు జరిపిన దాఖలాల్లేవు. జిల్లాలో ముఖ్యనేతలుగా ఉన్న ఒకరిద్దరినైనా పిలిచి చర్చించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ మార్పులపై బాలినేని కూడా అంతర్మథనంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. నియోజకవర్గాల్లో అంతర్గత సంక్షోభాలు తెరపైకి వచ్చాయి. ఇప్పటివరకూ పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కనపెట్టడంపై భగ్గుమంటున్నారు. ఎన్నికల నాటికి ఇవి కొత్త సవాళ్లుగా మారతాయనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

గెలుపే లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయాలు ఇక్కడ నేతలతో చర్చించకుండా చేయడంపై పార్టీలోనే విస్మయం కనిపిస్తోంది. పైగా మంత్రులు ఇద్దరికీ స్థాన చలనం తప్పలేదు. వాళ్లు కూడా అయిష్టంగానే వస్తున్నారు. వైపాలెం నుంచి గెలిచిన మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈసారికి సిట్టింగు స్థానంలోనే ఉంచాలని సిఎం జగన్‌కే మొరపెట్టుకున్నారు. సర్వేలు సానుకూలంగా లేవనే సాకుతో ఆయన్ను కొండపికి నెట్టారు. ఇపుడు వైపాలెంలో పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. రాజీనామాలకు సిద్ధమయ్యారు. మంత్రి సురేష్‌ వారిని సర్దుబాటు చేస్తున్నారు. ఆయనకు కొండపి ఇష్టం లేదని సుస్పష్టం. ఇక కొండపిలోనూ ఇప్పటి వరకూ వర్గపోరు ఉంది. కొత్తగా మంత్రి అడుగుపెడితే జరిగే సామాజిక మార్పులు కూడా చర్చలోకి వస్తున్నాయి. నాయకత్వం ఇక్కడ వర్గాలుగా చీలింది. మంత్రి వస్తే అన్నీ సర్దుకుంటాయనే చర్చ ఉన్నా బాలినేని పాత్ర కూడా కీలకంగా మారింది. ఇంకా మంత్రి సురేష్‌ కొండపిలో అడుగుపెట్టలేదు. సంతనూతలపాడులో ఇన్‌ఛార్జి మంత్రి మేరుగు నాగార్జునకు గడ్డుపరిస్థితి వచ్చింది. ఆయన వచ్చి జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లిని కలిశారు. మిగతా మండలాల నాయకులకు ఫోన్లు చేసి కలవాలని చెప్పారు. బాలినేని చెప్పకుండా తామేమీ నిర్ణయం తీసుకోలేమని కొందరు మండల నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.

బాలినేనిని కలిసి చర్చించాకే సహకారంపై నిర్ణయం ఉంటుందన్నారు. హఠాత్తుగా ఎమ్మెల్యే సుధాకర్‌బాబును పక్కనబెట్టి ఇన్‌ఛార్జిగా మంత్రిని వేయడంపై జీర్ణించుకోలేకపోతున్నారు. బాలినేని పాత్ర ఇక్కడా కీలకంగా మారింది. అద్దంకి విషయానికి వస్తే ఇక్కడా అదే పరిస్థితి. టిటిడి మాజీ ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి సన్నిహితుడుగా ఉన్న పాణెం హనిమిరెడ్డికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకూ ఇన్‌ఛార్జిగా ఉన్న చైతన్య వర్గం రగలిపోతోంది. నియోజకవర్గ ముఖ్యనేతలు, కార్యకర్తతో సమావేశమైన సీనియర్‌ నేత గరటయ్య, శాప్‌ఛైర్మన్‌ బాచిన చైతన్యలు భవిష్యత్‌ వ్యూహంపై దృష్టి సారించారు. కొంతకాలం వేచిచూద్దామనే ధోరణిలో ఉన్నారు. కొత్త అభ్యర్థిని తేవడంపై పార్టీ క్యాడర్‌ అసంతృప్తిగా ఉంది. అయితే ఇక్కడ మార్పు ఏ పరిణామానికి దారితీస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా ఇన్‌ఛార్జిగా నియమితులైన హనిమిరెడ్డి పార్టీ అగ్రనేత వైవి.సుబ్బారెడ్డితో నియోజకవర్గంలోకి అడుగుపెట్టేందుకు సన్నాహాల్లో ఉన్నారు. సోమవారం నాడు ఆయన అద్దంకికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని మార్పులు, చేర్పులపై చర్చ సాగుతోంది. మార్కాపురం, దర్శి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలకు అభ్యర్దులను ఖరారు చేయాల్సి ఉంది. దర్శిలో మాత్రం బూచేపల్లికి దాదాపుగా ఖరారైనట్లేనని పార్టీ వర్గాల్లో స్పష్టత ఉంది. అక్కడ సిట్టింగు ఎమ్మెల్యేకు ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై తర్జనభర్జన సాగుతోంది. గిద్దలూరు, కనిగిరి, కూడా కీలకంగా ఉన్నాయి. ఇక్కడ వైసిపికి బలమైన సామాజికవర్గ నేతలు గట్టిగా అభ్యర్దులను మార్చాలని పట్టుపడుతున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో గతంలో సామాజిక ప్రాధాన్యతల్లోనే వాళ్లకు టిక్కెట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రాధాన్యం అలాగే ఉంటుందా? లేక మార్పులు జరుగుతాయా? అనేదీ చూడాలి. గిద్దలూరులో టికెట్టు కోసం మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కూడా దృష్టి సారించారు. మార్పు అనివార్యమైతే తనకు అవకాశం కల్పించాలని ఆయన పార్టీ నేతలను కోరుతున్నారు. వైపాలెంలోనూ బలమైన సామాజికవర్గం తిరుగుబాటు వల్లనే మంత్రిని కొండపికి మార్చారనే చర్చ నడుస్తోంది. ఇక్కడ అభ్యర్థిపై స్పష్టతకు రాలేకపోతున్నారు. అభ్యర్థుల ఎంపిక, మార్పులలో తన పాత్ర లేనందున మాజీ మంత్రి బాలినేని కూడా అధిష్టానంపై అసంతృప్తిగానే ఉన్నారు. దీంతో ఆయనపైనా రాజకీయంగా పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గిద్దలూరులో పోటీచేయాలని అక్కడ బలమైన సామాజికవర్గ నేతలు బాలినేనిని అడుగుతున్నారు. ఇది కూడా చర్చలోకి వచ్చింది. జిల్లా నేతలతో చర్చించకుండా ఏకపక్షంగా అధిష్టానం తీసుకున్న మార్పుల వ్యవహారం ప్రస్తుతం పార్టీలో అంతర్గత సంక్షోభానికే దారితీసింది.

➡️