తీవ్ర ముప్పు !

Dec 5,2023 08:55 #mi
  • ప్రచండగాలుల ‘మిచౌంగ్‌’
  • కోస్తా అంతా రెడ్‌ అలర్ట్‌
  • నిజాంపట్నం, కృష్ణపట్నంలలో 10వ నెంబర్‌ హెచ్చరిక
  • ప్రాణ నష్టం లేకుండా చూడాలన్న సిఎం
  • చెన్నై అతలాకుతలం
  • రాష్ట్రంలో భారీగా పంట నష్టం-

ప్రజాశక్తి యంత్రాంగం : తీవ్ర తుపాన్‌గా మారిన ‘మిచౌంగ్‌’ ధాటికి రాష్ట్రం అతలాకుతలామౌతోంది. భారీ వర్షాలు, ఈదురుగాలులతో తీర ప్రాంతం వణుకుతోంది. పూర్తిస్థాయిలో అప్రమత్తంగా లేకపోతే తీవ్ర ముప్పు తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా అంతా రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత జారీ చేసిన హెచ్చరికలో తుపాన్‌ మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం ఉదయానికి బాపట్ల వద్ద తీరం దాటే అవకాశం ఉందని పేర్కొనడంతో పాటు తీరాన్ని తాకే సమయంలో భయకరంగా విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే తీర ప్రాంతమంతా ఈదురుగాలులు వీస్తుండగా, తీరం దాటే సమయంలో ప్రచండగాలులతో విరుచుకుపడుతుందని పేర్కొనడంతో పాటు, తీరం దాటిన తరువాత కూడా తుపాన్‌ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని తెలిపింది. తీరం దాటే వరకు కోస్తా ప్రాంతానికి సమాంతరంగా సముద్రంలో ప్రయాణం చేస్తుందని తెలిపింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా చూడాలని ముఖ్మమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. తుపాన్‌ ప్రభావ ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించ డం, హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేయడం వంటి చర్యలను అధికారులు పూర్తి చేశారు. ప్రభావిత జిల్లాల్లో దాదాపు 200 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసిన అధికారులు 10వేల మందిని తరలించారు. మరికొంత మందిని తరలించనున్నట్లు తెలిపారు. నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో 10వ నెంబర్‌ హెచ్చరికను ఎగురవేశారు. దీంతో స్థానిక ప్రజానీకం పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతోంది. మొత్తం 11 హెచ్చరికలు ఉండటమే దీనికి కారణం. ఇటీవల కాలంలో పదవ నెంబర్‌ హెచ్చరికను ఎగురవేయలేదని, ఇది పరిస్థితి తీవ్రతను తెలియచేస్తోందని అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సముద్రపు అలలు విరుచుకుపడుతున్నట్లు సమాచారం అందింది. పలు ప్రాంతాల్లో సముద్రం కొన్ని అడుగుల మేర ముందుకు వచ్చింది. ఆది, సోమ వారాల్లో కురిసిన వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట నష్టపోయింది. కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

70 ఏళ్లలో లేని వర్షం

సోమవారం కురిసిన వర్షంతో చెన్నై నగరం పూర్తిగా జలమయమైంది. ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. గత 70-80 ఏళ్లలో ఎన్నడూ చూడని వర్షం కురిసిందని ఆ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.ఎన్‌ నెహ్రూ అన్నారు. తుపాన్‌ విలయం ముందు తమ ప్రభుత్వం విఫలమైందని ఆయన చెప్పారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా అవి చాలలేదని ఆయన అన్నారు. చెంగల్పట్లు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది.

సహాయక చర్యలు చేపట్టాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వరి కోతల సమయంలో తుపాను ముంచుకురావడంతో కోస్తా జిల్లాల ప్రజానీకం, రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోందని, తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అన్ని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. తుపాను వల్ల రైతులకు, ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని, బాధిత ప్రజలను ఆదుకోవాలని కోరింది. అలాగే పార్టీ కార్యకర్తలు, వలంటీర్లు ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలబడి అవసరమైన సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో కోరారు.

➡️