నత్త నడకన ఉప్పాడ

Jan 31,2024 11:13 #uppada, #works
  • రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న పనులు
  • నిర్మాణానికి గడువు పెంచినా 60 శాతమే పురోగతి

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి : కాకినాడ జిల్లాలోని యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు అమీనాబాద్‌ తీరంలో చేపట్టిన ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణ పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. రెండున్నరేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. రూ.361 కోట్ల నిధులతో 2020 డిసెంబరులో సిఎం వైఎస్‌.జగన్‌ వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. 2021 జూన్‌ నుంచి పనులు ప్రారంభించారు. 2023 జూన్‌ నాటికి పనులు పూర్తి కావాల్సి వచ్చినా ఇప్పటి వరకు 60 శాతమే పనులు పూర్తయ్యాయి. నిధుల విడుదలలో జాప్యంతో బాటు నిర్ధేశిత కాలంలో నాలుగు సార్లు తుపానులు రావడంతో పనులు పూర్తి చేయడానికి మరో 18 నెలలు గడువు పొడిగించారు.

60 శాతమే పురోగతి

             వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లు, నాలుగు ఫిషింగ్‌ ల్యాండింగ్‌ కేంద్రాలను నిర్మిస్తుంది. ఇందుకోసం రూ.నాలుగు వేల కోట్లను ఖర్చు చేస్తుంది. మొదటి ఫేజ్‌లో ఉప్పాడతో బాటు మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నెలలో రూ.1,200 కోట్లతో హార్బర్‌ పనులు ప్రారంభించారు. ఎపి అర్బన్‌ ఇన్‌ఫ్రాÛస్ట్రక్చర్‌ ఆసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ (ఎపియుఆర్‌ బిఎఎన్‌) పర్యవేక్షణలో ఎంఆర్‌కెఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ ఇండిస్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్మాణాన్ని చేపట్టింది.

ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్‌ ఐదు దశల్లో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. మొదటి దశలో 27 అడుగుల లోతున 5.20 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను ఒకే స్థాయిలో తొలగించారు. రెండో దశలో జెట్టీ నిర్మాణం కోసం సుమారు రెండు కిలోమీటర్ల మేర బ్రేక్‌ వాటర్‌కు అడ్డుకట్ట వేసేందుకు బండరాళ్లను డంప్‌ చేశారు. ఈ బ్రేక్‌ వాటర్‌ ప్రొటక్షన్‌ కోసం 2,3,4,6 టన్నుల బరువు గల టెట్రా పోడ్స్‌ (ట్రై ఎంగిల్‌) దిమ్మెలను తయారు చేసి వేశారు. మూడో దశలో 800 మీటర్ల రన్నింగ్‌ మీటర్ల పొడవున నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకూ ఈ పనులు 50 శాతమే పూర్తి అయ్యాయి.

నాలుగో దశలో భవనాలు, రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు పది భవనాలకు మాత్రమే స్లాబులు పూర్తయ్యాయి. కాంపౌండ్‌ వాల్‌ 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఐదో దశలో 20 టన్నుల సామర్థ్యం కలిగిన కోల్ట్‌ స్టోరేజ్‌, ఐస్‌ ప్లాంట్ల నిర్మాణం, 980 టన్నుల సామర్థ్యం గల గిడ్డంగులను, బోట్లు మరమ్మతులు చేసే యార్డును కూడా నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకూ మొత్తం ప్రాజెక్టులో 60 శాతం పనులు మాత్రమే పూర్తి కాగా 43 శాతం నిధులు విడుదలయ్యాయి. ఇది పూర్తయితే 1.10 లక్షల మెట్రిక్‌ టన్నుల అదనపు మత్స్య సంపద సేకరణకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. సుమారు 50 వేల మంది మత్స్యకారులకు నేరుగా ప్రయోజనం కలుగనుంది. 40 శాతం పనులు పూర్తి కావాలంటే మరో రెండేళ్ల వరకు సమయం పట్టే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఏడాది మార్చికి పూర్తి

నిధుల విడుదలలో జాప్యం ఏమీ లేదు. వాస్తవానికి వచ్చే ఏడాది ఆగస్టు వరకూ గడువు ఉంది. అయితే ఈ ఏడాది మార్చి 31 లోపే హార్బర్‌ పనులు పూర్తి అవుతాయి. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. – శివ ప్రసాద్‌, ఎపి అర్బన్‌ ఇన్‌ఫ్ర్రాస్ట్రక్చర్‌ ఆసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ (ఎపియుఆర్‌బిఎఎన్‌)ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ (పిఎంసి)

నిధులు విడుదల చేసి పూర్తి చేయాలి

ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం చేపట్టి దాదాపుగా మూడేళ్లు అయ్యింది. సగం పనులు కూడా పూర్తి కాలేదు. నిధుల విడుదల్లో జాప్యం కారణంగానే నిర్మాణ పనులు ఇంకా జరుగుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి పనులను త్వరితగతిన పూర్తిచేసి మత్స్యకారులను ఆదుకోవాలి. – సిహెచ్‌ ప్రసాద్‌, మత్స్యకారుడు, ఉప్పాడ

➡️