తప్పని అప్పుల తిప్పలు

May 6,2024 01:14 #lons
  •  కుటుంబాలపై పెరిగిన రుణభారం తగ్గిపోతున్న పొదుపు
  •  మోడీ ప్రభుత్వ విధానాలే కారణం

న్యూఢిల్లీ : దేశంలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు అప్పుల తిప్పలు తప్పడం లేదు. నానాటికీ పెరిగిపోతున్న రుణభారం కారణంగా ఆ కుటుంబాల్లో పొదుపు అనే పదమే విన్పించడం లేదు. రిజర్వ్‌బ్యాంక్‌ తాజా గణాంకాల ప్రకారం 2022-23లో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో కుటుంబాల నికర ఆర్థిక ఆస్తులు 5.1%కి పడిపోయాయి. ఆర్థిక ఆస్తులు అంటే బ్యాంకులు, బ్యాంకింగ్‌ యేతర సంస్థ ల్లో డిపాజిట్లు, నగదు, ఈక్విటీలో పెట్టుబడులు, బీమా, పెన్షన్‌ ఫండ్‌ మొదలైనవి. ఈ తరహా ఆస్తులు 2018- 19లో జిడిపిలో 7.9%, 2019-20లో 8.1%, 2020- 21లో 11.5%, 2021-22లో 7.2%గా ఉన్నాయి.
దేశంలో చాలా మంది పౌరులకు పొదుపు చేయడానికి ఆర్థిక ఆస్తులు ప్రధాన వనరు. ఆదాయాలు తగ్గిపోవడం, అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి కారణాలతో కుటుంబాల్లో పొదుపు తగ్గిపోతోంది. పొదుపు చేసిన సొమ్ము కొద్దో గొప్పో ఉన్నప్పటికీ దానిని కూడా కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేసుకోవాల్సి వస్తోంది. చాలా కుటుంబాలు మాత్రం ఇప్పుడు పొదుపు అనే మాటే మరిచిపోయాయి. అదే సమయంలో కుటుంబాల రుణభారం పెరిగిపోతోంది. ఫలితంగా నికర ఆర్థిక ఆస్తులు తరిగిపోతున్నాయి. ఇక ఎగువ మధ్యతరగతి ప్రజలు, సంపన్నులు తమ వద్ద ఉన్న డబ్బును పొదుపు చేయకుండా బంగారం, వెండి, భూమి కొనుగోలుకు వినియోగిస్తున్నారు. లేదా ఇళ్లు నిర్మించుకుంటున్నారు.

కోవిడ్‌ సమయంలో…
2020-21లో… అంటే కోవిడ్‌ తొలి సంవత్సరంలో ఆర్థిక ఆస్తులు సుమారు రూ.31 లక్షల కోట్లకు పెరిగాయి. లాక్‌డౌన్‌ అమలులో ఉండడం, లావాదేవీలు చాలా తక్కువగా జరగడమే దీనికి కారణం. బ్యాంకులు, షేర్లలో ఉన్న డబ్బంతా అలాగే ఉండిపోయింది. ఆ తర్వాతి సంవత్సరం ఆర్థిక ఆస్తులు గణనీయంగా పడిపోయాయి. ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడడమే దీనికి కారణం. అయితే అదే సమయంలో అప్పులు పెరిగాయి.

బ్యాంక్‌ డిపాజిట్లు, రుణాలే అధికం
అప్పులకు ప్రధాన వనరు బ్యాంక్‌ రుణాలే. ఆర్‌బిఐ అందజేసిన సమాచారం ప్రకారం కుటుంబాల అప్పుల్లో బ్యాంక్‌ రుణాల వాటాయే 77%గా ఉంది. మిగిలిన అప్పులు బ్యాంకింగ్‌ యేతర ఆర్థిక కంపెనీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, బీమా కంపెనీల నుండి తీసుకున్నవి. 2018-19 నుండి 2022-23 వరకూ కుటుంబాల రుణభారం 23% పెరిగింది. ఇక ఆర్థిక ఆస్తుల్లో బ్యాంక్‌ డిపాజిట్ల వాటా 35%గా ఉంది. పిపిఎఫ్‌ సహా ప్రావిడెంట్‌, పెన్షన్‌ ఫండ్లు 22%, జీవిత బీమా నిధులు 18%, చిన్న మొత్తాల పొదుపు 7% వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆర్థిక ఆస్తుల్లో కేవలం 7% మాత్రమే పెట్టుబడుల రూపంలో ఉండడం ఆసక్తికరం. వీటిలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో అత్యధికంగా 6% పెట్టుబడులు ఉంటే షేర్లలో అత్యల్పంగా 0.8% ఉన్నాయి. దీనిని బట్టి అర్థమవుతోంది ఏమిటంటే భారత ప్రజలు షేర్‌ మార్కెట్‌లో అతి తక్కువగా పెట్టుబడి పెడుతున్నారు.

ప్రభుత్వ విధానాలే కారణం
2018-19, 2022-23 మధ్యకాలంలో బ్యాంక్‌ డిపాజిట్లు 9% పెరిగాయి. జీవిత బీమా, పెన్షన్‌ నిధుల్లో కూడా పెరుగుదల కన్పించింది. భౌతిక ఆస్తుల్లో పొదుపు సుమారు రూ.28 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. బంగారం, వెండిపై పొదుపు కూడా సుమారు రూ.60,000 కోట్లు ఉండవచ్చునని ఆర్‌బిఐ అంచనా వేసింది. ఇవన్నీ అధికారిక గణాంకాలే. అనధికారికంగా, చట్టవిరుద్ధంగా జరిగే లావాదేవీలకు లెక్కే ఉండదు. ఏదేమైనా పొదుపు తగ్గిపోవడం సామాన్య ప్రజల ఆర్థిక ఇబ్బందులకు అద్దం పడుతోంది. మోడీ ప్రభుత్వం అవలంబించిన సంపన్న వర్గాల అనుకూల విధానాలే దీనికి కారణం. ఇలాంటి విధానాలకు స్వస్తి చెప్పినప్పుడే ప్రజలకు ఊరట లభిస్తుంది. ఇందుకు ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

➡️