బ్రహ్మసాగర్‌ భద్రత గాలికి!

Jan 18,2024 08:29 #Irrigation Projects
brahma sagar security irrigation project
  • ఆనకట్ట, గేట్ల లీకేజీలతో పొంచి ఉన్న ప్రమాదం 
  • ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచని వైనం
  • 1.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకం

ప్రజాశక్తి- కడప ప్రతినిధి : వైఎస్‌ఆర్‌ జిల్లాలోని బ్రహ్మసాగర్‌ సాగునీటి ప్రాజెక్టు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఆనకట్ట, గేట్ల నుంచి నీరు లీకవుతోంది. మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. 1.75 లక్షల ఎకరాల ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగంగా 2006లో ఈ ప్రాజెక్టును 17.2 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు నిర్వహణను పాలకులు గాలికొదిలేశారు. వర్షాలు అనుకూలించడంతో 2012లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఆనకట్ట అడుగు భాగంలో 230 మీటర్ల దగ్గర లీకేజీ వెలుగులోకి వచ్చింది. మరమ్మతులకు నోచుకోకపోవడంతో గేట్ల నుంచి కూడా నీరు లీకవుతోంది. దీంతో, ఐదేళ్ల కిందట జిల్లా నీటిపారుదల శాఖ రూ.52 కోట్లతో ప్రతిపాదనలు పంపించింది. అప్పటి టిడిపి ప్రభుత్వంలో స్పందన లేకపోవడంతో ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. వైసిపి సర్కారు అధికారంలోకి వచ్చాక కేవలం గేట్ల లీకేజీలను అరికట్టడానికి రూ.1.16 కోట్లతో నాలుగు దఫాలు టెండర్లు పిలిచింది. అయితే, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. మళ్లీ 2022లో వర్షాలు అనుకూలించడంతో ప్రాజెక్టులో నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అడుగు భాగాన లీకేజీ మళ్లీ బయటపడింది. గత ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావం నెలకొనడంతో ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్‌ స్టోరేజీకి పడిపోయింది. ప్రస్తుతం 3.56 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి. ఈ సమయంలో మరమ్మతులకు అవకాశం ఉన్నా ప్రభుత్వంలో చిత్తశుద్ధి కరువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లీకేజీల వ్యవహారాన్ని ప్రభుత్వానికి చెరదిన డ్రిప్స్‌ గ్రూపు దృష్టికి జిల్లా నీటి పారుదల శాఖ మూడు నెలల క్రితం తీసుకెళ్లింది. ఈ గ్రూపు నిపుణుల నేటికీ పరిశీలనకు రాలేదు. ఆనకట్ట, గేట్ల లీకేజీలను అరికట్టకపోతే భవిష్యత్‌లో బ్రహ్మసాగర్‌ నుంచి రాయలసీమ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఆర్‌టిపిసి)కి నీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చేసిన హెచ్చరికలు ప్రభుత్వానికి పట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే నిర్లక్ష్యం కొనసాగితే అన్నమయ్య రిజర్వాయర్‌ తరహాలో అనుకోని ప్రమాదం వాటిల్లితే దిగువ ప్రాంతంలోని బ్రహ్మంగారిమఠం, మైదుకూరు, బద్వేలు, కాశినాయన, పోరుమామిళ్ల, అట్లూరు తదితర మండలాల పరిధిలోని లోతట్టు గ్రామాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత రబీ సీజన్‌లో 70 వేల ఎకరాల్లో వరి, ఉల్లి, మిర్చి, పసుపు, కంది, బొప్పాయి, చీనీ, అరటి వంటి పంటలు సాగవుతున్నాయి. ఆయకట్టు భూములకు సాగు నీటిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

మరమ్మతులకు నిధులు ఇవ్వాలి

బ్రహ్మసాగర్‌ మరమ్మ తులకు నిధులు ఇవ్వకపోవడం వల్లే లీకేజీలు కొనసాగుతున్నాయి. టిడిపి హయాం నుంచి నేటి వరకు ఆనకట్ట లీకేజీ అరికట్టడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేయలేదు. ఎటువంటి పురోగతీ లేకుండాపోయింది.

– జి.శివకుమార్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు, బి.మఠం

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం

డ్రిప్స్‌ గ్రూపులోని ఇంజనీరింగ్‌ నిపుణుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రధాన ఆనకట్ట లీకేజీ మరమ్మతు పనులకు రూ.52 కోట్లతో, కుడి, ఎడమ గేట్ల మరమ్మతులకు రూ.1.16 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. గేట్ల లీకేజీ మరమ్మతులకు నాలుగేళ్లలో నాలుగుసార్లు టెండర్లు పిలిచాం. కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. డ్రిప్స్‌ గ్రూపు నిపుణుల సూచనల మేరకు మరమ్మతు పనులు చేపడతాం.

– డి.వెంకటరామయ్య, ఎస్‌ఇ, తెలుగుగంగ ప్రాజెక్ట్సు, కడప

సత్వరమే లీకేజీలను అరికట్టాలి

బ్రహ్మసాగర్‌ రిజర్వాయర్‌ లీకేజీని తక్షణమే అరికట్టాలి. లీకేజీల కారణంగా పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందడం లేదు. పంట కాల్వలు పెండింగ్‌లో ఉన్నాయి. కాల్వల్లో కంప చెట్ల మొలవడంతో చివరి ఆయకట్టు వరకు నీరందడం పరిస్థితి.

– లంకల వీరకృష్ణ, రైతు, బి.మఠం.

 

➡️