ధన… మద్య ప్రవాహాలు

May 13,2024 07:17 #alcohol flows, #elections
  • బహిరంగంగా పంచుతున్న వైసిపి, టిడిపి కూటమి నాయకులు
  • చోద్యం చూసిన ఎన్నికల అధికారులు, పోలీసులు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ధనం, మద్యం ప్రవాహం యథేచ్ఛగా సాగుతోంది. గతం రికార్డులను తలదన్నే విధంగా లారీలు, వ్యాన్లలో కోట్ల కొలది డబ్బు రవాణా అవుతోంది. ప్రమాదాలు జరిగి, వ్యానులు బోల్తాపడితేనే కోట్లు దొరికాయి. ఇక దొరకని డబ్బు ఎన్నివేల కోట్లు రవాణా అయిందో లెక్కలేదు. పెద్దఎత్తున తనిఖీలు చేసినా డబ్బు రవాణా మాత్రం ఆగలేదు. ఈ ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వైసిపి, టిడిపి కూటమి తరపున అత్యధిక నియోజకవర్గాల్లో అభ్యర్థి రూ.30 కోట్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.10 వేల కోట్ల వరకూ ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు చర్చ నడుస్తోంది.
ప్రచారం ముగిసిన శని, ఆదివారాల్లో డబ్బు పంపిణీ ఇష్టారాజ్యంగా సాగింది. ఓటుకు రెండువేల రూపాయలు నుండి ఐదువేల రూపాయలు వరకూ పంచుతున్నారని ప్రచారం వుంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు కూడా పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రయాణంలో ఎన్నో తిప్పలు పడ్డారు. అయితే డబ్బు పంపిణీని అడ్డుకునే పోలీసు, అధికార యంత్రాంగం ఎక్కడా కనిపించలేదు. రాష్ట్రంలో గతంలో జరిగిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఈసారి ధన, మద్య రాజకీయం సాగింది. పూర్తిగా డబ్బు చుట్టూ రాజకీయాన్ని తిప్పారు. మరోవైపు డబ్బు పంపిణీలో పెద్దఎత్తున ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. కొన్నిచోట్ల పంపిణీ సరిగా జరగలేదని, కొన్నిచోట్ల రెండు పార్టీల నాయకుల మధ్య ఇలా పరస్పరం ఘర్షణలు జరిగాయి. తలలు పగలకొట్టుకున్నారు. ఇంతకుముందు ఎన్నికల రోజు ఘర్షణలు జరిగేవి, ఇప్పుడు డబ్బు పంపిణీ రోజే ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ప్రత్యేక పరిస్థితి
ఈసారి కొన్నిచోట్ల ద్వితీయశ్రేణి నాయకత్వంలో ప్రత్యేక పరిస్థితి కనిపించింది. పలు డివిజన్లలో వైసిపి, టిడిపి కూటమి నాయకులు కొత్త ఎత్తుగడ వేశారు. అభ్యర్థులు వారి వ్యక్తిగత సిబ్బందిని, కంపెనీల సిబ్బందిని డబ్బు పంపిణీకి పంపించడంతో రెండు పార్టీల నాయకులు కూడబలుక్కుని ఎక్కడ డబ్బు పంపిణీ చేస్తున్నారో అక్కడ ఘర్షణ సృష్టించి మొత్తం డబ్బు వారే తీసుకుపోయారు. వైసిపి వాళ్లు పంచుతుంటే టిడిపి వాళ్లు వెళ్లి గొడవ చేయడం అభ్యర్థి తరుపున తీసుకొచ్చిన డబ్బు లాక్కుని వెళ్లిపోవడం, టిడిపి వాళ్లు వెళ్లి పంచుతుంటే వైసిపి వాళ్లు గొడవ చేయడం డబ్బు లాక్కుని వెళ్లిపోవడం వంటి ఘటనలు జరిగాయి. ఎక్కువచోట్ల డబ్బు పంపిణీ చేయకుండానే వారి కార్యకర్తలతో పలానా చోట డబ్బు పంపిణీ అని ప్రచారం చేయడం, అక్కడకు వెళ్లగానే పోలీసులు వచ్చారని చెప్పి తిప్పి పంపించడం వంటి చర్యలు జరిగాయి.

చెక్‌పోస్టులున్నా…
నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత అంతర్‌జిల్లా చెక్‌పోస్టులు పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. ఒకటి రెండు రోజులు హడావిడి చేసినా మిగిలిన రోజుల్లో ఎక్కడా తనిఖీలు జరగడం లేదు. ఎక్కడికక్కడ లారీల్లో డబ్బు దొరకడమే ఇందుకు నిదర్శనం. ఈసారి ఎన్నికల సంఘం సిబ్బంది పూర్తిగా చేతులెత్తేశారు. వామపక్ష నాయకులు కళాకారులకు కొన్న డ్రస్సులను సీజ్‌ చేసిన ఎన్నికల అధికారులు కోట్ల రూపాయలు, వందల కోట్ల ప్రైజులు పంపిణీ చేస్తుంటే చేతులెత్తేశారు. గతంలో ఎక్కడన్నా హడావుడి జరుగుతుందంటే పోలీసులు వచ్చి తనిఖీలు చేసి పంపించేసేవారు. ఈసారి అటువంటి పరిస్థితి లేదు.

ప్రజా రాజకీయం చేసిన వామపక్షాలు
రాష్ట్రంలో డబ్బు, మద్యం ప్రవాహం యథేచ్ఛగా సాగుతున్నా వామపక్ష పార్టీల అభ్యర్థులు మాత్రం ఎక్కడా ధన ప్రస్తావన చేయలేదు. ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల కోసం, రక్షణ కోసం చేసిన పోరాటాలు, ఆందోళనలు గురించి చెప్పి ఓట్లు అడుగుతున్నారు. ప్రజల ముందుకు వెళ్లి ధైర్యంగా తమకు ఓటు వేయాలని కోరుతున్నారు.

➡️