తెలంగాణలో ప్రచార హోరు

Nov 26,2023 10:57 #campaign, #Telangana

తెలంగాణలో పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. ఎన్నికల పోటీ చేస్తున్న అభ్యర్థుల తరుఫున ఆయా పార్టీల అగ్రనాయకులు శనివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. బిఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరుఫున కెటిఆర్‌, హరీష్‌రావు పలు సభల్లో పాల్గొని ప్రసంగించారు. బిజెపి అభ్యర్థులకు మద్దతుగా జరిగిన సభల్లో ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ విస్తృత ప్రచారం, రోడ్‌ షోలు నిర్వహించారు. సిపిఎం అభ్యర్థుల తరుఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బృందా కరత్‌, మాణిక్‌ సర్కార్‌, బివి.రాఘవులు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. పలు సభల్లో ప్రసంగించారు. రోడ్‌ షోలు నిర్వహించారు.

హామీలు విస్మరించిన బిఆర్‌ఎస్‌ : ప్రధాని మోడీ విమర్శలు

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : బిఆర్‌ఎస్‌ అవినీతి పాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. ఏడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రజలను విస్మరించిందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కామారెడ్డి, మహేశ్వరంలో బిజెపి నిర్వహించిన సభల్లో మోడీ మాట్లాడారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే బిసి సామాజిక తరగతికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. బిసిలకు, దళితులకు బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ చేసిందేమీ లేదని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్న కెసిఆర్‌ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. దళితలను ఆయన మోసం చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజల్లో తెలివితేటలు పుష్కలంగా ఉన్నా బిఆర్‌ఎస్‌ అవినీతి వల్ల ప్రజల సామర్థ్యాలు వెలుగులోకి రాలేదని అన్నారు. కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని, ఆ పార్టీలు స్వార్థ పార్టీలని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే బిఆర్‌ఎస్‌కు వేసినట్లేనని, కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలు గెలిచినా బిఆర్‌ఎస్‌లోకి వెళ్తారని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపిలు లక్ష్మణ్‌, బండి సంజయ్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

కెసిఆర్‌ రిమోట్‌ మోడీ చేతిలో… : రాహుల్‌ గాంధీ నిప్పులు

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : ‘రాష్ట్రంలో దొరల తెలంగాణ… ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. ముఖ్యమంత్రి కెసిఆర్‌ కుటుంబ పాలనకు, ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఇక్కడి ప్రజలు ఇలాంటి పాలన కోరుకోలేదు. ఈ దొరల పాలనను అంతమొందించి ప్రజల తెలంగాణను తీసుకురావాలనేదే మా లక్ష్యం’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. తెలంగాణ కోసం అనేక మంది యువకులు బలిదానాలు చేసుకున్నారని, వారు ఇలాంటి తెలంగాణను కోరుకోలేదని తెలిపారు. ఎలాంటి తెలంగాణ కావాలో జనం తేల్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యనే పోటీ ఉందని, బిజెపి, ఎంఐఎం పార్టీలు బిఆర్‌ఎస్‌కు సహాయకారిగా ఉన్నాయని అన్నారు. ఆదిలాబాద్‌, బోధన్‌, వేములవాడలో కాంగ్రెస్‌ విజయభేరీ సభల్లో శనివారం ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజల తెలంగాణ అంటే ప్రభుత్వం ప్రజల చేతిలో ఉండాలని అన్నారు. ఈ ఆకాంక్షను కాంగ్రెస్‌ పార్టీ నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఎస్‌సి, ఎస్‌టి, సబ్‌ప్లాన్‌ నిధుల్లో ఎస్‌టిలవి రూ.5,500 కోట్లు, ఎస్‌సిలవి రూ.15,500 కోట్ల నిధులను దారి మళ్లించారని అన్నారు. సిఎం కెసిఆర్‌ అవినీతిని ప్రధాని మోదీ ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. మోడీ రిమోట్‌ తీయగానే కెసిఆర్‌ సైలెంట్‌ అవుతారని విమర్శించారు. నాపై కేంద్ర ప్రభుత్వం కేసులు మోపిందని, పార్లమెంటు సభ్యత్వం రద్దు చేసిందని, తాను ఉంటున్న బంగ్లాను ఖాళీ చేయించిందని, అయినా నేను భయపడలేదని, సంతోషంగా తాళాలు ఇచ్చి వచ్చానని వివరించారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ను, కేంద్రంలో బిజెపిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. విద్వేషమనే బజారులో ప్రేమతో కూడిన దుకాణం తెరుస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతిలో మోడీ, కెసిఆర్‌ కూడా భాగస్వాములనే ఆరోపించారు. దేశ సంపదను ప్రధాని మోదీ తన స్నేహితులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన బిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు.

బిజెపితో దేశానికి ముప్పు : బివి రాఘవులు ఆందోళన

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ఈ ఎన్నికల్లో దేశానికి ప్రమాదకరమైన మతోన్మాద బిజెపిని అడ్డుకుని, సిపిఎం అభ్యర్థులకే తమ ఓటు వేసి అసెంబ్లీకి పంపించాలని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు కోరారు. బిజెపి పట్ల బిఆర్‌ఎస్‌ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలన్నారు. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్‌ ఏకపక్షంగా వ్యవహరించిందని చెప్పారు. బిజెపిని అడ్డుకోవాలంటే కాంగ్రెస్‌ వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సిపిఎం అభ్యర్థి యాదయ్యని గెలిపించాలని కోరుతూ చేపట్టిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. బిజెపి వ్యవహరిస్తున్న తీరు దేశానికి చాలా ప్రమాదకరమన్నారు. కేంద్రంలో అధికారం చేపట్టే ప్రభుత్వంలో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత ఉంటుందని, అందులో బిఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషిస్తుందని కెసిఆర్‌ ప్రకటిస్తున్నారని అన్నారు. కానీ దేశంలో ఎవరికి మద్దతు ఇస్తారనే విషయంలోనే ఆయనకే స్పష్టత లేదని, ఇప్పటికైనా వారి నిర్ణయాన్ని ప్రకటించాలని తెలిపారు. అంతేకాకుండా, బిజెపి పట్ల కాంగ్రెస్‌ కఠినమైన వైఖరిని తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీచేస్తున్న 19మంది సిపిఎం అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు.

➡️