వాల్తేరు రైల్వే ప్రాజెక్టుల పట్ల కేంద్రం నిర్లక్ష్యం

Apr 4,2024 06:54 #BJP Failures, #Waltair Railway

ముందుకు సాగని రూ.2,500 కోట్ల పనులు
ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో :  వాల్తేరు రైల్వే ప్రాజెక్టుల పట్ల కేంద్ర బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఏటా 30 మిలియన్ల రైలు ప్రయాణికులు రాకపోకలు సాగించే డివిజన్‌గా, దేశంలోనే రూ.9,800 కోట్ల ఆదాయం సాధించే ఏకైక డివిజన్‌గా వాల్తేరుకు పేరున్నా కేంద్రానికి మాత్రం ఇక్కడి అభివృద్ధి పట్టడం లేదు. కేంద్రంలోని మోడీ సర్కారు 2016లో వాల్తేరు డివిజన్‌ను ఎత్తేసి విజయవాడ డివిజనల్లో కొంత భాగాన్ని, రాయగడ డివిజన్‌లో మరికొంత భాగాన్ని కలిపేసింది. బిజెపి పాలనలో వాల్తేరు డివిజన్‌ పరిధిలోని కీలక రైల్వే ప్రాజెక్టులు కొడిగట్టుకుపోయాయి. గడిచిన మూడేళ్లలోనే సుమారు రూ.2,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోతున్నాయి. ప్రధానమైన రైల్వే లైన్లు, స్టేషన్ల అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యం వల్ల రైలు ప్రయాణికులకు అవస్థలు పెరుగుతున్నాయి.

నిలిచిపోయిన పనులు ఇవే…
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ రీ డవలప్‌మెంట్‌ ప్రాజెక్టు నిల్చిపోయింది. రూ.456 కోట్లతో 2016లోనే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి దీనికి ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని గాంధీధామ్‌ స్టేషన్‌కు సంబంధించి 2016లోనే రీ డవలప్‌ మెంట్‌ సర్వే, టెండరు ఖరారయ్యాయి. ఆ తర్వాత పనులు కూడా పూర్తయ్యాయి. దీంతోపాటే ఆమోదం లభించిన వాల్తేరు రైల్వే ప్రాజెక్టు పనులు మాత్రం ముందుకు సాగలేదు. పిపిపి మోడ్‌లో 45 ఏళ్లకు విశాఖపట్నం స్టేషన్‌కు టెండర్లు పిలవగా 99 ఏళ్లు కావాలని జిఎంఆర్‌ తదితర బిడ్డర్లు కోరారు. దీంతో, అప్పట్లో దీనికి ఆమోదం లభించలేదు. ఇటీవల మళ్లీ టెండర్లు పిలిచారు. కాగా, 2022లో ఒక కాంట్రాక్టు సంస్థ విశాఖ రైల్వే స్టేషన్‌ వెనుక భాగంలో మల్టీ కార్‌ పార్కింగ్‌ పనులు పట్టింది. ఈ పనులు 2023 ఏప్రిల్‌లో పూర్తి కావాల్సి ఉంది. నిధుల విడుదలలో కేంద్రం జాప్యంతో పనులు ఆగిపోయాయి.

రూ.1,200 కోట్ల 3 కీలక లైన్‌ పనులపైనా నీలినీడలు
విశాఖపట్నం-గోపాలపట్నం, గోపాలపట్నం- దువ్వాడ, సింహాచలం-పెందుర్తి మధ్య వాల్తేరు డివిజన్‌కు కొత్త రైల్వే లైన్లు పడాల్సి ఉంది. వీటి ఏర్పాటు అంచనా విలువ సుమారు రూ.1200 కోట్లు. రైల్‌ ఫ్లై ఓవర్లు కూడా నిర్మించాల్సి ఉంది. పై మూడు ప్రాజెక్టులకూ సర్వే జరిగింది. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. దీంతో, ప్లాట్‌ఫారాలు ఖాళీలేక గంటల తరబడి అవుట్‌లో రైళ్లను నిలిపి ఉంచాల్సి వస్తోంది.
ప్రయాణికులు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఈ మూడు లైన్లు పూర్తయితే ఈ సమస్యకు పరిష్కారమని రైల్వే డిఆర్‌ఎం కార్యాలయ ఉన్నతాధికారులు కేంద్రానికి గతంలోనే ప్రతిపాదన పంపారు. ప్రస్తుతం యూనివర్సల్‌ ఎలక్షన్‌ కోడ్‌ ఉందని, ఈ పనులు చేపట్టవద్దని కేంద్రంలోని బిజెపి సర్కారు నుంచి ఇటీవల రైల్వేకు ఆదేశాలొచ్చాయి.

అమృత్‌ భారత్‌ స్టేషన్‌లకూ అదే గతి
ప్రధాని మోడీ ఘనంగా ప్రచారం చేసుకుంటున్న అమృత్‌ భారత్‌ రైల్వే స్టేషన్లలో మౌలిక వసతులు, స్టేషన్ల నిర్మాణ పనులూ నిలిచిపోయాయి. వాల్తేరు రైల్వేలో 12 స్టేషన్లను అమృత్‌ భారత్‌ స్టేషన్‌లుగా గుర్తించి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు మోడీ పునాది రాయి వేసినా పనులు జరగలేదు. సింహాచలం, ఆంధ్రా ఊటీ అరకు, పార్వతీపురం, బొబ్బిలి, కొత్తవలస, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్డు, నౌపాడ, పర్లాకిమిడి వంటి చోట్ల రైలు ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉండగా, వీటిలో విశాఖపట్నం, పార్వతీపురం, బొబ్బిలి, రాయగడ, పర్లాకిమిడిల్లో మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. మిగతా చోట్ల పనులు కాలేదు. సుమారు రూ.900 కోట్ల మేర రైల్వే ప్రాజెక్టులకు బ్రేక్‌ పడింది.

➡️