సబ్సిడీ దాణా నిలిపివేత

Feb 22,2024 12:42 #subsidized feeding
  • పాడి రైతులకు ప్రభుత్వం ఝలక్‌
  • బహిరంగ మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : పాడి రైతులకు సబ్సిడీపై ఇస్తున్న దాణాను గత ఆరు నెలలుగా ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో, బహిరంగ మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. పాడి సంపద వృద్ధి, రైతులకు భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఏటా సమీకృత మిశ్రమ రేషన్‌ (టిఎంఆర్‌) పేరుతో పాడి పశువుల పెంపకందార్లకు సబ్సిడీపై దాణాను అందిస్తూ వచ్చేది. డెయిరీ నిర్వహిస్తున్న రైతులతోపాటు సాధారణ రైతులకు 25, 50 కేజీల బ్యాగుల్లో పంపిణీ చేసేది. ఒక్కో బాగులో పచ్చగడ్డి, ఎండుగడ్డి, మొలాసిస్‌, సాల్డ్‌, మినరల్‌ మిశ్రమం, వేరుశనగ చెక్క, పత్తి చెక్క, మినరల్‌ సప్లిమెంట్‌ తదితర పదార్థాలు ఉండేవి. కేజీ రూ.16 కాగా, 60 శాతం రాయితీతో రూ.6.40కి అందించేది. ఈ రకమైన దాణా మార్కెట్లో ఎక్కడా దొరక్కపోవడం, ఈ దాణా తో పాల దిగుబడి బాగా ఉండడంతో రైతుల్లో దీనికి మంచి డిమాండ్‌ ఉంది. అయితే, జిల్లాకు లక్ష్యాలను నిర్దేశించినా ఆ మేరకు సరఫరా చేసేది కాదు. రైతులకు 200 కేజీల వరకే సబ్సిడీని పరిమితం చేసింది. శ్రీకాకుళం జిల్లాలో 4.56 లక్షల ఆవులు, 40 వేలకుపైగా గేదెలు ఉన్నాయి. వీటికి మేత కోసం సుమారు 2,500 మెట్రిక్‌ టన్నులకుపైగా పశువుల దాణా అవసరం. ప్రభుత్వం 1,200 మెట్రిక్‌ టన్నులు మాత్రమే అందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. 1,080 టన్నులను సరఫరా చేసి 2023 ఆగస్టు తర్వాత నుంచి సబ్సిడీ దాణాను నిలిపివేసింది. దీంతో పాడి రైతులపై భారం పడుతోంది.బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు కొనుగోలుదాణా సరఫరాను ప్రభుత్వం ఆపేయడంతో గత్యంతరం లేక రైతులు బహిరంగ మార్కెట్‌లో మేత కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు ధరలను పెంచేశారు. పశువుల మేతగా వినియోగిస్తున్న గోధుమ పొట్టు 50 కేజీల బస్తాను ప్రస్తుతం రూ.1,300కు అమ్ముతున్నారు. ఏడాది కిందట ఇది రూ.1,050 ఉంది. పాలిష్‌ తవుడు కేజీ రూ.28 ఉండగా, గతంలో రూ.25కు అమ్మేవారు. బఠానీ పొట్టు 45 కేజీల బస్తా గతంలో రూ.వెయ్యి ఉండగా, ప్రస్తుతం రూ.1150కు అమ్ముతున్నారు. ఆగస్టు వరకు 60 శాతం సబ్సిడీతో దొరకే దాణా ఇప్పుడు 120 శాతం, అంతకంటే ఎక్కువ ధరకు కొనుక్కోవాల్సి వస్తోంది. పోషక విలువల విషయంలోనూ అవి సమానం కాదు.కరువు కాలంలో పాడి రైతులకు కష్టం వరి కోతలను యంత్రాలతో చేపట్టడంతో గడ్డికి కొరత ఉంది. దీంతోపాటు ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొనడంతో లక్షలాది ఎకరాల్లో వరి సాగు చేయలేకపోయారు. పచ్చిగడ్డి కూడా పెద్దగా దొరకడం లేదు. ఈ సమయంలో సబ్సిడీపై దాణాను అందించాల్సిన ప్రభుత్వం ఆపేయడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

➡️