‘విజయనగరం’లో ఎన్నికల యుద్ధం

Apr 16,2024 08:21 #2024 elections, #vijayanagaram

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : విజయనగరం జిల్లా టిడిపిలో అసమ్మతి రాగాలు నెలకొన్నాయి. కొన్నిచోట్ల ఆశావహులు, అసంతృప్తివాదులు వెనక్కి తగ్గుతుండగా, మరికొన్ని చోట్ల మౌనం వహిస్తున్నారు. ఇంకొన్నిచోట్ల నాయకుల మధ్య సయోధ్య, సర్దుబాట్లు జరుగుతున్నాయి. ఆచరణలో అభ్యర్థుల విజయానికి సహకారం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. విజయనగరం అసెంబ్లీ స్థానంలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అసమ్మతి రాగం రాజుకుంటోంది.
నెల్లిమర్ల నియోజకవర్గంలో వైసిపి తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, జనసేన తరఫున లోకం మాధవి పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు ఒకానొక దశలో స్వతంత్రంగా పోటీచేస్తానని ప్రకటించారు. డెంకాడ జెడ్‌పిటిసి మాజీ సభ్యులు కంది చంద్రశేఖర్‌, పూసపాటిరేగ మాజీ ఎంపిపి మహంతి చిన్నంనాయుడు తదితరులు సీటు జనసేనకు కేటాయించడం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత చంద్రబాబు సర్దిచెప్పడంతో అభ్యర్థితో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఎస్‌.కోటలో వైసిపి తరపున స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, టిడిపి తరపున మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పోటీలో ఉన్నారు. ఇదే స్థానంలో టిడిపి తరఫున సీటు ఆశించి భంగపడ్డ గొంప కృష్ణ (ఎన్‌ఆర్‌ఐ) ఒకానొక దశలో స్వతంత్రంగా పోటీచేస్తానని ప్రకటించడంతోపాటు వేలాది మందితో సభలు, సమావేశాలు నిర్వహించారు. దీంతో దాదాపు టిడిపికి ఓటమి తప్పదన్న పరిస్థితి ఏర్పడటంతో కృష్ణతో చంద్రబాబు, తానా ప్రతినిధి మాట్లాడారు. దీంతో కొద్దిరోజుల నుంచి టిడిపి అభ్యర్థికి కృష్ణ మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
రాజాంలో వైసిపి తరపున తలే రాజేష్‌, టిడిపి తరపున మాజీ మంత్రి కోండ్రు మురళీ పోటీ చేస్తున్నారు. రాజేష్‌ తండ్రి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ, ఆయనకు రాజకీయాలు కొత్త. మురళీకి వైసిపిలోనూ మంచి పరిచయాలు, అనుయాయులు ఉన్నారు. చాలాకాలంగా కోండ్రుకు వ్యతిరేకంగా కోటరీ నడిపిన మాజీ స్పీకరు ప్రతిభా భారతి, ఆమె కుమార్తె గ్రీష్మ అభ్యర్థి ప్రకటన తరువాత సైలెంటు అయ్యిపోయారు.
చీపురుపల్లిలో వైసిపి తరపున సిట్టింగు ఎమ్మెల్యే, మంత్రి బొత్స సత్యనారాయణ, టిడిపి తరఫున అభ్యర్థిగా మాజీ మంత్రి కళావెంకట్రావు తల పడుతున్నారు. ఇదే స్థానం నుంచి సీటు ఆశించి భంగపడ్డ కిమిడి నాగార్జున మౌనం వీడలేదు. ఇటీవల మెరక ముడిదాం మండలంలోని కీలక నాయకులు కోట్ల మోతీలాల్‌ టిడిపిలో చేరారు. అదే మండలంలోని తాడ్డి చంద్రశేఖర్‌ తన అనుచరులతో టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం.
గజపతినగరంలో వైసిపి తరఫున స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, టిడిపి తరఫున కొండపల్లి శ్రీనివాస్‌ పోటీలో ఉన్నారు. ఇదే స్థానం నుంచి టిడిపి టికెట్‌ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే కెఎ నాయుడు తన అనుయాయులు శ్రీనివాస్‌ వెంట వెళ్లకుండా సుమారు నెలరోజులపాటు ఆపినప్పటికీ, ఇటీవల ఒక్కొక్కరూ శ్రీనివాస్‌ వైపు జారుకుంటున్నారు.

టిడిపికి సానుకూలంగా బొబ్బిలి
బొబ్బిలిలో వైసిపి తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు, టిడిపి తరపున ఆర్‌విఎస్‌కెకె రంగారావు (బేబినాయన)కు ఆయా పార్టీలు టికెట్లు ప్రకటించాయి. జిల్లాలో టిడిపి బలంగా ఉండే నియోజకవర్గం బొబ్బిలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చింది. బేబినాయన సోదరుడు సుజయకృష్ణ రంగారావును పార్టీ అధిష్టానం పోటీ నుంచి తప్పించినప్పటికీ తన సోదరుడుకు సహకరిస్తున్నారు. చేసిన అభివృద్ధి పెద్దగా లేకపోవడంతోపాటు బొబ్బిలిలోని శ్రీనివాస్‌ జ్యూట్‌ మిల్లును తెరిపిస్తామన్నమాట నిలబెట్టుకోకపోవడం, తిరిగి దాన్ని రియల్‌ ఎస్టేట్‌గా మార్చేందుకు కీలకంగా వ్యవహరించడం తదితర అంశాలు ఎమ్మెల్యే శంబంగికి ప్రతికూలంగా ఉన్నాయి.

విజయనగరంలో దాటుతున్న ‘గీత’
విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, టిడిపి నుంచి గతంలో ఓటమి చవిచూసిన పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పోటీలో ఉన్నారు. టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రకటించారు.

ఎంపి అభ్యర్థులుగా బెల్లాన, కలిశెట్టి
విజయనగరం లోక్‌సభ అభ్యర్థిగా వైసిపి తరఫున సిట్టింగ్‌ ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, టిడిపి తరఫున కలిశెట్టి అప్పలనాయుడును ఆయా పార్టీలు ప్రకటించాయి. టిడిపి అభ్యర్థిత్వాన్ని ఆలస్యంగా ఖరారు చేయడంతో ఇప్పుడిప్పుడే జనాల్లోకి వెళ్తున్నారు.

➡️