పెద్ద పండక్కి పరిహారం లేదు!

farmers waiting for seeds input subsidy in ycp govt
  • విపత్తు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ వాయిదా
  • 11 లక్షల మంది ఎదురు చూపు
  • ఆగిన 1,200 కోట్ల పంపిణీ
  • ఇచ్చేదే తక్కువ.. ఆపై కోతలు
  • దానికీ నెలలు వెయిటింగ్‌

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఖరీఫ్‌లో విపత్తుల వలన పంటలు నష్టపోయిన రైతులకు సంక్రాంతి పండక్కి పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) సొమ్ము అందిస్తామనగా, ప్రస్తుతం ఆ హామీ నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కాగా పెద్ద పండగకు సర్కారీ సాయం చేతికంది కాస్తంత ఆసరా అవుతుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న అన్నదాతలను ప్రభుత్వం నిరాశ పర్చింది. కరువు, మిచౌంగ్‌ తుపానుతో పంటలు దెబ్బతిన్న దాదాపు 11 లక్షల మంది రైతులు పరిహారం కోసం నిరీక్షిస్తున్నారు. పరిహారం సంక్రాంతికేనన్న ప్రభుత్వ ఆదేశాలతో ఎన్యూమరేషన్‌ నిర్వహించిన యంత్రాంగం పలు సుమారు 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని నిర్ధారించింది. ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం రూ.1,200 కోట్ల వరకు కావాలని అంచనా వేసింది. కేంద్రం నుంచి రూ.800 కోట్లు ఆశించింది. మిగతా రూ.400 కోట్లు రాష్ట్రం పెట్టుకోవాలని ప్రాథమికంగా ఎస్టిమేట్‌ చేసింది. ఒక వేళ కేంద్రం నుంచి నిధులు రానిపక్షంలో ముందుగా రాష్ట్ర సర్కారే రైతులకు పరిహారం చెల్లించేసి, తర్వాత కేంద్రం నుంచి రీయింబర్స్‌ పొందాలని కూడా అనుకుంది. కనీసం తుపాన్‌ బాధిత రైతులకైనా సంక్రాంతికి పరిహారం ఇవ్వాలని ఏర్పాట్లు చేసింది. సోషల్‌ ఆడిట్‌తో సహా లబ్ధిదారుల జాబితాలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఆ చర్చలన్నింటినీ ప్రభుత్వం పక్కనపెట్టి సంక్రాంతికి కాకుండా మరెప్పుడో పరిహారం ఇద్దామని వాయిదా వేసినట్లు సమాచారం. వీలైతే ఫిబ్రవరిలో ఇవ్వొచ్చని సంకేతాలిచ్చి నట్లు తెలిసింది.

  • కరువు, తుపాన్‌ జాబితాలు రెడీ అయినా..

ఖరీఫ్‌లో రాష్ట్రంలో చాలా భాగం కరువుండగా కేవలం ఏడు జిల్లాల్లోని 103 మండలాలనే ప్రభుత్వం ప్రకటించింది. పలు కోతల అనంతరం 14.21 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, 6.68 లక్షల మంది రైతులు పరిహారానికి అర్హులని తేల్చింది. పరిహారం చెల్లింపునకు రూ.844 కోట్లు కావాలని అంచనా వేసింది. ఈ మేరకు కేంద్ర బృందాలకు వినతిపత్రం ఇచ్చింది. కేంద్రాన్ని రూ.503 కోట్లు అడిగింది. మిగతా నిధులు తన వాటా కింద పెట్టుకోవాలనుకుంది. డిసెంబర్‌ 5న వచ్చిన మిచౌంగ్‌ తుపాన్‌కు ఏడున్నర లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు ఎన్యూమరేషన్‌లో నిర్ధారించింది. సుమారు నాలుగు లక్షల మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీకి రూ.400 కోట్ల వరకు కావాలని అంచనా వేసింది. సంక్రాంతికి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామని స్వయాన ముఖ్యమంత్రి తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా రైతులకు హామీ ఇవ్వడంతో యంత్రాంగం ఆగమేఘాల మీద లబ్ధిదారుల జాబితాలను రెడీ చేసింది. పండగ 15వ తేదీన కాగా ఇప్పటి వరకు నిధుల విడుదలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

  • అక్కరకొస్తాయనుకుంటే…

ప్రభుత్వం కరువు మండలాలకు కోత పెట్టి కొన్నింటినే ప్రకటించింది. తుపాన్‌ నష్టం విషయంలోనూ ఆ విధానాన్నే అమల్లో పెట్టింది. ఇ-క్రాప్‌ వంటి నిబంధనలు లబ్ధిదారులకు కత్తెర పడిందని రైతుల నుంచి ఆందోళనలొచ్చాయి. మరో వైపు నిర్ణయించిన స్కేల్‌ ఆఫ్‌ ఆసిస్టెన్స్‌ (పరిహారం కొలబద్దలు) వాస్తవంగా రైతులకు జరిగిన నష్టంతో పోల్చితే నామమాత్రం. ఈ స్వల్ప సాయం రైతులకు అందించేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రత్యామ్నాయ పంటలేసుకోవాలన్నా, రబీ సాగు సాగించాలన్నా రైతులకు పెట్టుబడులు కావాలి. సంక్రాంతి రైతుల పండగ అని చెపుతున్న సర్కారు వారికి ఇస్తానన్న కొద్దిపాటి పరిహారం ఇవ్వకపోవ డంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

➡️