సిక్కోలు చిక్కేదెవరికి?

  • టిడిపిలో చల్లారని అసంతృప్తి సెగలు
  • వైసిపిలోనూ అదే పరిస్థితి

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి : నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత అసమ్మతి సద్దుమణుగుతుందని టిడిపి భావించినా ఆ పరిస్థితి కనిపించడం లేదు. అభ్యర్థులను మార్చిన నియోజకవర్గాల్లో ఈ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో టిడిపి ఇన్‌ఛార్జులు గుండ లకీëదేవి, కలమట వెంకటరమణకు పార్టీ టికెట్లు నిరాకరించడంతో వారి అనుచరులు, అభిమానుల్లో ఆగ్రహం చల్లారలేదు. టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌, ఎంపి రామ్మోహన్‌నాయుడు గుండ అనుచరులు, కేడర్‌తో చర్చలు జరిపిన తర్వాత అభ్యర్థి గుండ శంకర్‌తో కలిసి పనిచేసేందుకు అంగీకరించినా, ప్రచారంలో అన్యమనస్కంగానే పాల్గొంటున్నారు. టిడిపి ఇన్‌ఛార్జి గుండ లకీëదేవికి పట్టున్న గార, శ్రీకాకుళంలోని అరసవల్లి తదితర ప్రాంతాలకు చెందిన నాయకులు వైసిపి గూటికి చేరిపోయారు. శ్రీకాకుళం నగరంలో వైసిపిలో కీలకంగా ఉన్న అంధవరపు వరహానరసింహం కుటుంబానికి శ్రీకాకుళం మేయర్‌ పదవి ఇస్తామనే ప్రతిపాదనతో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆ కుటుంబాన్ని పార్టీలోకి తీసుకున్నారు. దీంతో మేయర్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న టిడిపి నాయకులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఎన్నికల్లో ఇది కొంతమేర ప్రభావం చూపుతుందనే చర్చ నడుస్తోంది. ఇటీవల చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో పాతపట్నం టిడిపి ఇన్‌ఛార్జి కలమట వెంకటరమణను పిలిచి బుజ్జగించారు. ఆయనకు టిడిపి జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. అయినా అక్కడ కలమట గ్రూపు సరిగ్గా పనిచేయడం లేదు. ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవిందరావే గత నెల 30న పాతపట్నంలో నిర్వహించిన సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది.

ఆమదాలవలస బరిలో వైసిపి రెబల్‌
ఆమదాలవలస నియోజకవర్గంలో వైసిపి రెబల్‌ అభ్యర్థిగా సువ్వారి గాంధీ పోటీలో ఉన్నారు. నయానో, భయానో ఆయనతో నామినేషన్‌ ఉపసంహరించాలని ఉత్తరాంధ్ర పార్టీ పెద్దలు చేసిన ఫలితాలు ఫలించలేదు. దీంతో వైసిపి అభ్యర్థి శాసనసభాపతి తమ్మినేని సీతారాంకు ఇక్కడ నష్టం వాటిల్లనుంది. నరసన్నపేటలో వైసిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, అతని కుటుంబంపై ఉన్న అసంతృప్తితో ఇటీవల నాలుగు మండలాల ముఖ్య నాయకులు అంతా టిడిపిలో చేరారు. ఇక్కడ ధర్మాన కృష్ణదాస్‌ గడ్డు పరిస్థితిని ఎదుర్కొం టున్నారు. పలాస-కాశీబుగ్గ ఛైర్మన్‌ బల్ల గిరిబాబు వైసిపి ప్రచారానికి దూరంగా ఉన్నారు. పట్టణానికి చెందిన ముఖ్య నాయకుడు కౌన్సిలర్‌ దువ్వాడ శ్రీకాంత్‌, వజ్రపుకొత్తూరు, మందస మండలాలకు చెందిన పలువురు నాయకులు టిడిపిలో చేరారు. ఇక్కడ పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, టిడిపి అభ్యర్థి గౌతు శిరీష నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఇచ్ఛాపురంలోనూ వైసిపి, టిడిపి అభ్యర్థుల మధ్య నువ్వానేనా అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. టెక్కలి కాంగ్రెస్‌ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి బరిలో నిలవడంతో వైసిపి ఓట్లకు గండి పడే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఇచ్ఛాపురంలో వైసిపిలో గ్రూపుల పోరు కొనసాగుతోంది. ఎమ్మెల్సీ నర్తు రామారావు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్ష్మితో వైసిపి అభ్యర్థి పిరియా విజయకు పొసగడం లేదు.

చెమటోడ్చుతున్న సిట్టింగ్‌ ఎంపి రామ్మోహన్‌నాయుడు
శ్రీకాకుళం ఎంపి స్థానానికి టిడిపి తరపున సిట్టింగ్‌ ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, వైసిపి నుంచి పేరాడ తిలక్‌, కాంగ్రెస్‌ నుంచి పేడాడ పరమేశ్వరరావు బరిలో ఉన్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపిగా కింజరాపు రామ్మోహన్‌నాయుడు వరుసగా విజయం సాధించారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈసారి టిడిపి పరిస్థితి అంత సానుకూలంగా కనిపించడం లేదు. అభ్యర్థుల ఎంపికలో టిడిపి తీసుకున్న నిర్ణయాలు, గ్రూపుల పోరు గెలుపు అవకాశాలను కొంతమేర కష్టంగా మారతాయనే అభిప్రాయం వినిపిస్తోంది.
మరోవైపు వైసిపి కూడా ఎలాగైనా ఈ సీటును దక్కించుకోవాలని అన్ని రకాల ప్రయత్నాలూ సాగిస్తోంది. 2019 ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు గానూ ఐదు చోట్ల అభ్యర్థులు ఘన విజయం సాధించినా వైసిపి ఎంపి సీటును కోల్పోయింది. నరసన్నపేట, పలాస, పాతపట్నం స్థానాల నుంచి వైసిపి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. అక్కడ మాత్రం టిడిపి ఎంపి అభ్యర్థికి మెజార్టీ వచ్చింది. దీంతో ఈసారి క్రాస్‌ ఓటింగ్‌ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉంటున్నా ధర్మాన, కింజరాపు కుటుంబాల మధ్య రాజకీయ అవినాభావ సంబంధం ఇటీవల వరకు కొనసాగుతూ వస్తోంది. శ్రీకాకుళం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌కు సీటు ఇప్పించి, గెలిపించే బాధ్యతను తీసుకున్న టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తాజాగా వైసిపి కేడర్‌ను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. ఇది ధర్మాన వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల నుంచి ఎంపి అభ్యర్థి రామ్మోహన్‌నాయుడుకు సహకారం ఉండకపోవచ్చన్న చర్చ నడుస్తోంది. పలాస నియోజకవర్గం నుంచి కూడా గత ఎన్నికల్లో టిడిపికి భారీగానే క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. పలాస నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు ఎంపి అభ్యర్థి గెలుపుపై పెద్దగా పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొన్నారు. మంత్రి అప్పలరాజు, టిడిపి ఎంపి అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. అది ఇప్పుడు తీవ్రస్థాయికి చేరింది. దీంతో అక్కడ్నుంచి టిడిపి ఎంపి అభ్యర్థికి ఒక్క ఓటు కూడా క్రాస్‌ ఓటింగ్‌ జరగకుండా మంత్రి అప్పలరాజు పట్టుదలతో పనిచేస్తున్నట్లు తెలిసింది.

గట్టి పోటీ ఇవ్వనున్న పేడాడ పరమేశ్వరరావు
శ్రీకాకుళం పార్లమెంటుకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పేడాడ పరమేశ్వరరావు కూడా ఈసారి భారీగానే ఓట్లు రాబడతారని కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టిడిపి ఎంపి కె రామ్మోహన్‌నాయుడు, వైసిపి ఎంపి అభ్యర్థి పేరాడ తిలక్‌కు లేని గుర్తింపు డాక్టరేట్‌ పేడాడ పరమేశ్వరరావుకు ఉంది. గతంలో కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాలుపంచుకున్న వ్యక్తి ఆయన. ప్రజా సమస్యలపై నాయకులను నిలదీయ గల సమర్థుడు. మూలపేట పోర్టు నిర్వాసితులకు అండగా పోరాటాలు కొనసాగిస్తున్నారు.

➡️