నీటికి కటకట

Mar 23,2024 11:09 #Water Problem
  • దేశంలో అడుగంటుతున్న ప్రధాన జలాశయాలు
  • సగటు రిజర్వాయర్ల నీటి మట్టం 38 శాతమే

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఈ మండు వేసవిలో నీటికి తిప్పలు తప్పేలా లేవు. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ నీటి కొరత ముంచుకొస్తోంది. దేశంలోని ప్రధాన జలశయాల్లో నీటి మట్టాలు అంతకంతకూ కుచించుకుపోతున్నాయి. రిజర్వాయర్లలో కనీస నీటి నిల్వల స్థాయీలు సగటున 38 శాతానికి పడిపోయాయి. గతేడాదితో పోలిస్తే దక్షిణ భారత్‌లోని రిజర్వాయర్లలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కేంద్ర జల సంఘం (సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ – సిడబ్ల్యుసి) ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. దేశంలోని 150 ప్రధాన రిజర్వాయర్లలో వాటి నీటి నిల్వ మొత్తం సామర్థ్యంలో ప్రస్తుతం నీటి మట్టాలు సగటున 38 శాతానికే పరిమితమయ్యాయి. బెంగళూరు లాంటి మహానగరాలు ఇప్పటికే తీవ్రమైన నీటి కొరతతో అవస్థలు పడుతున్నాయి. బెంగళూరులో రోజువారీ అవసరాల డిమాండ్‌ 260 కోట్ల లీటర్లుగా ఉండగా..ప్రస్తుతం సుమారు 50 కోట్ల లీటర్ల నీటి కొరత నెలకొంది. గతేడాదితో పోలీస్తే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో జలశయాల్లో నీటి నిల్వలు బాగా తగ్గిపోయాయి.
బెంగళూరులో 14 వేల బోరుబావులున్నాయి. వీటిలో 6900 ఇప్పటికే ఎండిపోయాయి. నగరంలోని జలాశయాల్లో చాలా వరకు ఆక్రమణకు గురికావడం లేదా ఎండిపోవడం కనిపిస్తోంది. ‘రోజువారీ 260 కోట్ల లీటర్లు నీరు డిమాండ్‌ ఉండగా.. 147 కోట్ల లీటర్ల నీరు కావేరీ నది నుంచి అందుతోంది. మరో 65 కోట్ల లీటర్ల నీరు బోరుబావుల ద్వారా అందుతోంది’ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.
ఉమ్మడి జలాశయాలు కలిగియున్న తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, త్రిపుర, రాజస్థాన్‌, బీహార్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌ సహా అనేక రాష్ట్రాల్లో గతేడాదితో పోలీస్లే నీటి మట్టాలు కుచించుకుపోయాయి. దేశ నీటి అవసరాల అంచనా 257.812 178.784 బిసిఎం (శతకోటి ఘనపు మీటర్లు) ఉండగా అందులో 69.35 శాతం ఈ రాష్ట్రాల్లోని 150 ప్రధాన రిజర్వాయర్లపైనే ఆధారపడివుంది. ఈ రిజర్వాయర్ల నీటి సామర్థ్యం 178.784 బిసిఎం (శతకోటి ఘనపు మీటర్లు)గా ఉండగా ..ఈ నెల 21 నాటి గణాంకాల ప్రకారం..అందులో 38 శాతం అంటే 67.591 బిసిఎం (శతకోటి ఘనపు మీటర్లు) నీరు మాత్రమే అందుబాటులో ఉంది. పదేళ్ల సగటు నీటి సామర్థ్యం 72.396 బిసిఎం (శతకోటి ఘనపు మీటర్లు) కాగా గతేడాది ఇదే సమయానికి 80.557 బిసిఎం (శతకోటి ఘనపు మీటర్లు) నీరు అందుబాటులో ఉండేది. అందువల్ల గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం ఈ 150 ప్రధాన రిజర్వాయర్లలో 84 శాతం నీటి కొరత ఎదుర్కొంటుండగా..పదేళ్ల కాలంతో పోల్చి చూస్తే 93 శాతం కొరత ఎదుర్కొంటోంది.
నాగార్జునా సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులను ఉమ్మడిగా కలిగియున్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడులోని 42 రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం 53.334 బిసిఎం (శతకోటి ఘనపు మీటర్లు)గా ఉండగా..ఈ నెల 21 గణాంకాల ప్రకారం..వీటిలో నీటి నిల్వ 12.287 బిసిఎం (శతకోటి ఘనపు మీటర్లు)గా మాత్రమే ఉంది. అంటే వాటి మొత్తం నీటి నిల్వ సామర్థ్యంలో ఇది 23 శాతం మాత్రమే. గతేడాది గణాంకాలతో పోలిస్తే ఇది 39 శాతం, పదేళ్ల సగటుతో పోలిస్తే 32 శాతం తక్కువ. దక్షిణ భారత్‌లోని ప్రధాన జలాశయాల నీటి మట్టాల ప్రస్తుత పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో నీటికి ఇబ్బందులు తప్పవు అని తెలుస్తోంది.

➡️