‘సీలేరు’పైనే ఆశలు

  • ఆందోళనలో గోదావరి డెల్టా రైతులు 
  •  శివారు పొలాలకు చేరని సాగు నీరు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : గోదావరి డెల్టాలో రబీ సాగుకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నీటి కొరతను అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించినప్పటికీ ఆచరణలో గత పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఓ వైపు వర్షాభావ పరిస్థితులు, కానరాని కాల్వల ఆధునికీకరణ, పాలకుల చిత్తశుద్ధి లేమి వెరసి రైతులకు నష్టాలు, కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలకు సాగు నీరందించే ధవళేశ్వరంలోని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీలో ప్రస్తుతం 2.64 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇది 2.05 టిఎంసిలకు చేరితే డెడ్‌ స్టోరేజి కింద లెక్కిస్తారు. దీంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం సీలేరు నుంచి రోజూ 3,566 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వేసవి కారణంగా నీరు ఆవిరి కావడం, ఇతర కారణాల రీత్యా కాటన్‌ బ్యారేజీకి దాదాపు రెండు వేల క్యూసెక్కులు మాత్రమే చేరుతున్నాయి. వేసవి తీవ్రత పెరిగితే ఇది మరింత తగ్గే అవకాశం ఉంది. కాటన్‌ బ్యారేజీ పరిధితో ఉభయ గోదావరి జిల్లాల్లో పది లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ రబీలో ఏప్రిల్‌ 15 వరకూ కాల్వలకు నీరందేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం తూర్పు, మధ్య, పశ్చిమ కాలువల ద్వారా రోజూ 8,970 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు కాలువ ద్వారా 2,650 క్యూసెక్కులు, మధ్య కాలువ ద్వారా 1,720, పశ్చిమ కాలువ ద్వారా 4,600 క్యూసెక్కుల చొప్పున అందిస్తున్నారు. ఏటా రబీ తుది దశలో సీలేరు జలాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీన్ని అధిగమించేందుకు ముందస్తు సాగుకు అధికార యంత్రాంగం సూచించింది. మార్చి 31 నాటికి కాల్వలకు నీరు నిలిపివేసేలా ప్రణాళికలు రూపొందించింది. క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించకపోవడంతో రబీ సాగు నెల రోజులు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో, ఏప్రిల్‌ 15 వరకూ సాగునీటిని అందించాల్సిన పరిస్థితి నెలకొంది.

రబీలో నీటి కేటాయింపులు ఇలా…

రబీ సీజన్‌లో తాగు, సాగునీటి అవసరాలకు 96 టిఎంసిలు అవసరం. సాగు అవసరాలకు 86 టిఎంసిలు, తాగునీరు, పరిశ్రమల అవసరాలకు పది టిఎంసిలు చొప్పున కేటాయించారు. ఇప్పటి వరకూ సాగుకు కేటాయించిన 86 టిఎంసిలను సరఫరా చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ముందస్తు ప్రణాళికల ప్రకారం పది టిఎంసిలు అవసరమవుతాయని అధికారులు భావించారు. ఏప్రిల్‌ 15వ తేదీ వరకూ గడువు పెంచడంతో 15 టిఎంసిల డిమాండ్‌ ఉందని తెలుస్తోంది. ఈ నీటిని సీలేరు జలాల నుంచే సేకరించాల్సి ఉంది.

ఎండుతున్న శివారు ఆయకట్టు భూములు

గోదావరిలో నీటి నిల్వలు తగ్గడంతో మధ్య డెల్టా, తూర్పు డెల్టాల పరిధిలోని శివారు భూములకు పూర్తి స్థాయిలో నీరు అందట్లేదు. ఫలితంగా పొలాలు నెర్రెలు వారుతున్నాయి. ప్రస్తుతం పొలాలు పొట్ట, ఈనిక దశలో ఉన్నాయి. ఈ సమయంలో సాగునీటి అవసరం ఎక్కువ. కాలువల పూడికలు తీయకపోవడం, సాగు నీరు పూర్తిగా సరఫరా కాకపోవడంతో మామిడికుదురు మండలంలో సుమారు 200 ఎకరాలకు నీటి ఎద్దడి తలెత్తింది. తాళ్లరేవు మండలం చొల్లంగిలో నీరందకపోవడంతో 200 ఎకరాల్లో పంట వేయలేదు.

సాగు, తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేదు

గోదావరి డెల్టా పరిధిలో సాగు, తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేదు. కాటన్‌ బ్యారేజీ వద్ద 2.64 టిఎంసిల నీరు నిల్వ ఉంది. తూర్పు, మధ్య, సెంట్రల్‌ డెల్టాలకు 8,970 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాం. అవసరాల రీత్యా సీలేరు జలాలను విడుదల చేయాలని కోరాం. అక్కడి నుంచి రోజూ 3,566 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ప్రస్తు తం సీలేరులో 25 టిఎంసిల వరకూ నీటి నిల్వలు ఉన్నాయి.

-కాశీ విశ్వేశ్వరరావు, ఎఇ, హెడ్‌ వర్క్స్‌, సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీ

➡️