భారీగా తగ్గిన కేంద్ర నిధులు

Feb 23,2024 11:08 #central funds

 జనవరి లెక్కలు తేల్చిన పిఏజి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి –  అమరావతి : ఈ ఆర్థిక సంవత్సరంలో 10 నెలలు గడిచిపోయాయి. అయితే ఆదాయం మాత్రం ఆశించిన స్థాయిలో సమకూరడం లేదు. దీంతో భారీగా అప్పులు చేయాల్సి వస్తోంది. ఆదాయానికి, వ్యయానికి మధ్య రూ. 78 వేల కోట్లకుపైగా అంతరం ఉరడడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జనవరి నెలవరకు ప్రధాన అక్కౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం విడుదల చేసిన గణాంకాలు ఖజానాకు ఇబ్బందికరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా గణనీయంగా తగ్గిపోవడం ఖజానాకు భారంగా మారుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 2,79,279 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో పొందుపరిచారు. అయితే జనవరి వరకు రూ. 2,10,242 కోట్లు మాత్రమే వచ్చింది. అరదులో వాస్తవ ఆదాయంరూ. 1,32,018 కోట్లు మాత్రమే వచ్చినట్లు తేలింది. మిగిలిన రూ.78 వేల కోట్ల వరకు రుణాలుగా సేకరించి దానిని కూడా ఆదాయంగా చూపించడం వల్లనే మొత్తం ఆదాయం 2.10 లక్షల కోట్లకు చేరుకున్నట్టయింది. వాస్తవ ఆదాయంలో పన్నుల ద్వారా 1.01 లక్షల కోట్లు రాగా, పన్నేతర ఆదాయంగా 4,879 కోట్లు వచ్చింది.

గ్రాంట్లకు కత్తెరలు

కేంద్రం నురచి రావాల్సిన గ్రాంట్లు రాష్ట్రానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం కేంద్ర గ్రాంట్లకు భారీగా కోతలు పడినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఏడాది మొత్తానికి కేంద్రం నుంచి 46,835 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం 26 వేల కోట్ల వరకు మాత్రమే వచ్చినట్లు తేలింది. అంటే దాదాపు 20 వేల కోట్ల వరకు కత్తెర పడినట్లు స్పష్టమవుతోంది.

రుణాలతోనే ఆర్థిక అవసరాలు

ఆదాయం తగ్గిపోవడం, కేంద్రం నురచి నిధులు తగ్గిపోవడం, ఖర్చులు మాత్రం గణనీయంగా పెరిగిపోవడంతో రుణాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పటివరకు రూ. 78,223 కోట్ల రుణాలను తీసుకున్నట్లు పిఏజి అధికారులు వెల్లడించారు. ఇందులో బహిరంగ మార్కెట్‌ రుణాలే 90 శాతం ఉన్నట్లు తేలింది. ఇలా రుణాలుగా తీసుకున్న మొత్తాన్నే ద్రవ్యలోటుగా ఖరారు చేసి లెక్కల్లో చూపించారు. వాస్తవానికి బడ్జెట్‌లో 54,857 కోట్లు లోటుగా ఉంటుందని ప్రతిపాదించగా, అది ఇప్పటికే 78 వేల కోట్లు దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఆదాయ లోటు కూడా 56,692 కోట్లకు చేరిపోయింది.

➡️